కమల్ హాసన్ అభిమానులకు నిరాశేనా?
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన నాయగన్ తెలుగులో నాయకుడు పేరుతో రిలీజైంది.
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన నాయగన్ తెలుగులో నాయకుడు పేరుతో రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 34 ఏళ్ల తర్వాత `నాయగన్`ని రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ తమ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 3న కమల్ హాసన్ 69వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం 4కెలో రీమాస్టర్ చేసిన వెర్షన్ ప్రదర్శితమవుతుంది. కేవలం తమిళనాడులోనే కాకుండా కేరళ, కర్ణాటక కలుపుకుని మొత్తం 120 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది.
1987 తమిళ చిత్రం `నాయగన్` కథాంశం ఎంతో స్ఫూర్తివంతమైనది. ముంబై అండర్ వరల్డ్ డాన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇందులో కమల్ హాసన్ వేలు నాయకర్ పాత్రలో నటించారు. కమల్ అసాధారణ నటనకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడి అవార్డు లభించింది. పిసి శ్రీరామ్ తన అద్భుతమైన సినిమాటోగ్రఫీకి గుర్తింపు పొందాడు. సినిమాటోగ్రఫీ పనితనానికి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇదే సినిమాకి తోట ధరణి అసాధారణ కళా దర్శకత్వం జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అంతేకాకుండా `నాయగన్` ఆస్కార్ కోసం భారతదేశం తరపున అధికారిక ప్రవేశంగా గౌరవం అందుకుంది. ఇది అంతర్జాతీయ వేదికపై చెప్పుకోదగ్గ విజయంగా నిలిచింది. ఈ సినిమా కథాంశం, ఆకట్టుకునే కథనం అసాధారణమైన నట ప్రతిభకు విస్తృతమైన గుర్తింపు దక్కింది. భారతీయ సినిమా చరిత్రలో దాని స్థానాన్ని పదిలపరుచుకుంది.
మణిరత్నం -బాలకుమారన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. ఇది సినిమా సృజనాత్మకతలో డెప్త్ ను ఆవిష్కరించింది. ఈ చిత్రం కమర్షియల్ విజయం సాధించడమే గాక.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో శరణ్య, కార్తీక, ఢిల్లీ గణేష్ కూడా కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రంలోని పాటలు ఆ సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి. విజయంలో కీలక పాత్ర పోషించడమే గాక.. ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. కమల్ హాసన్ చివరిగా నటించిన చిత్రం విక్రమ్. కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో లోకేశ్ కంగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు వసూలు చేసింది.
తెలుగు ప్రేక్షకులకు నిరాశేనా?
కమల్ హాసన్ కి ఇటు తెలుగు రాష్ట్రాల్లోను భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే కమల్ నటించిన నాయకుడు చిత్రాన్ని తెలుగు భాషలో రిలీజ్ చేయకపోవడం నిరాశపరుస్తోంది. తమిళనాడు సహా కేరళ, కర్నాటకలో విడుదలవుతున్నా ఏపీ, తెలంగాణలో ఎందుకు రిలీజ్ కావడం లేదు? అన్న చర్చా వేడెక్కిస్తోంది. కమల్ హాసన్ జాతీయ ఉత్తమ నటుడిగా అత్యుత్తమ ప్రదర్శనతో మెప్పించిన సినిమాని వీక్షించే అవకాశం అదృష్టం మాకు లేదా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.