కమల్ హాసన్ అంత ధైర్యం చేస్తాడా?
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ''థగ్ లైఫ్''
టాలీవుడ్ లో 2025 సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే తీవ్రమైన పోటీ ఏర్పడింది. సినిమాలకు అతి పెద్ద సీజన్.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ వస్తాయి. అందుకే ఎవరూ పొంగల్ ను మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, మాస్ మహారాజా రవితేజ లాంటి హీరోలు పండక్కి రాబోతున్నట్లు ప్రకటించేశారు. నందమూరి బాలకృష్ణ కూడా కర్చీఫ్ వేయడానికి సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నారు. తమిళం నుంచి రావడానికి అజిత్ కుమార్ రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మధ్యలో కమల్ హాసన్ వచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ''థగ్ లైఫ్''. ఇందులో శింబు, జయం రవి, త్రిష కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, సన్యా మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, జోజు జార్జ్, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రాన్ని సంక్రాంతి సీజన్ లో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చాలా నెలల క్రితమే ప్రకటించారు. వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాతో పాటుగా.. రవితేజ - భాను భోగవరపు కలయికలో తెరకెక్కతున్న మూవీని అదే పండక్కి విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అజిత్ నటిస్తున్న డబ్బింగ్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రేసులో ఉండనే ఉంది. RT 75కి కుదరకపోతే బాలయ్య - బాబీల చిత్రాన్ని బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇన్ని రిలీజుల మధ్య కమల్ 'థగ్ లైఫ్' మూవీని రిలీజ్ చేసే ధైర్యం చేస్తారా? అనేదే ఆసక్తికరంగా మారింది.
సంక్రాంతి పండుగకు మూడు నాలుగు పెద్ద సినిమాలు వచ్చినా థియేటర్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఒకేసారి ఐదారు చిత్రాలను విడుదల చేస్తామంటే మాత్రం థియేటర్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది. దీనికి తోడు స్ట్రెయిట్ తెలుగు చిత్రాల మధ్య డబ్బింగ్ మూవీస్ ను రిలీజ్ చేయడం అంటే కాస్త రిస్క్ చేస్తున్నట్లే. కమల్ హాసన్ తమిళంలో అజిత్ కుమార్ తో పోటీ పడొచ్చేమో కానీ, టాలీవుడ్ లో పొంగల్ కి చిరంజీవి, వెంకటేష్, రవితేజ, బాలయ్య లాంటి హీరోల కాంపిటీషన్ లో బరిలో దిగడం అంటే ఎంతైనా ఆలోచించాల్సి ఉంటుంది.
అందులోనూ కమల్ హాసన్ ఇటీవల 'భారతీయుడు 2' సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో 'భారతీయుడు 3'పై కూడా అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'థగ్ లైఫ్' మూవీకి విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుందని, రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ఊహించలేం. అందుకే విశ్వనటుడు సంక్రాంతికి రావాలనుకునేది నిజమే అయితే, ఆ విషయంలో పునరాలోచన చేస్తే బాగుంటుందని అభిమానులు సూచిస్తున్నారు.