గర్విస్తున్నాను సోదరా.. జనసేనానికి కమల్ విషెస్
నీ గురించి గర్విస్తున్నాను సోదరా! అంటూ కమల్ హాసన్ కొంత ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం విజయాన్ని జనసైనికులు సెలబ్రేట్ చేస్తున్నారు. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సెలబ్రేషన్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. జనసేనాని అఖండ విజయాన్ని ఏపీ ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ ఈ సెలబ్రేషన్స్ లో ఎంతో ఎమోషనల్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విజయాన్ని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. తెలుగు చిత్రసీమ ప్రముఖులతో పాటు, అన్ని సినీపరిశ్రమల నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ అద్భుత విజయాన్ని కొనియాడుతున్నారు.
ఇప్పుడు ఉలగనాయగన్ కమల్ హాసన్ వంతు. తమిళనాడు మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ ఎక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్ విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. ''ఉద్వేగభరితమైన సంభాషణలతో ఆకట్టుకుని, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన శ్రీ పవన్‌కల్యాణ్‌కి నా హృదయపూర్వక అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగిన రీతిలో సేవ చేసే ఈ ప్రయాణం ప్రారంభించినందుకు ఆయనకు శుభాకాంక్షలు'' అని అన్నారు. నీ గురించి గర్విస్తున్నాను సోదరా! అంటూ కమల్ హాసన్ కొంత ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. కమల్ హాసన్ నుంచి విషెస్ అందినందుకు జనసైనికులు సోషల్ మీడియాల్లో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
అఖిలేష్ యాదవ్‌కు శుభాకాంక్షలు:
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభలో అద్భుత విజయం సాధించినందుకు సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్‌ను MNM పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ అభినందించారు. ఈ ఎన్నికల్లో అర్హమైన విజయం ఇది అని ప్రశంసించారు. శ్రీ అఖిలేష్ యాదవ్‌జీతో గొప్ప విషయాలు మాట్లాడాను. ఉత్తరప్రదేశ్‌లో అద్భుత విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేసాను...ఇది తగిన విజయం! అని ఎక్స్‌లో కమల్ హాసన్ పోస్ట్ చేశారు.
అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటులో రికార్డు స్థాయిలో 37 స్థానాలను కైవసం చేసుకుంది. ఇది యుపి రాజకీయాల్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా ప్రజలు భావిస్తున్నారు. పార్టీ ఒంటరిగా ఈసారి 37 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే దాని మిత్రపక్షం కాంగ్రెస్ ఆరు స్థానాలను పొందగలిగింది. బిజెపికి చెందిన స్మృతి ఇరానీ నుండి అమేథీని తిరిగి గెలుచుకోవడం సహా కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. రాజకీయంగా ముఖ్యమైన మరో స్థానం అయిన రాయ్‌బరేలీని కాంగ్రెస్ అపూర్వమైన ఆధిక్యంతో గెలుచుకుంది. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో 62 సీట్లు గెలుచుకున్న బీజేపీ 33 స్థానాల్లో మాత్రమే తన స్థానాలను నిలబెట్టుకోగలిగింది. దాని మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) రెండు సీట్లు.. అనుప్రియ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ (S) ఒక స్థానాన్ని గెలుచుకుంది. భారత ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీ (SP) 37 సీట్లు, బీజేపీ 33, కాంగ్రెస్ 6, రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) 2, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) - అప్నా దళ్ (సోనీలాల్) ఒక్కో స్థానం గెలుచుకున్నాయి.