సినిమా రంగంపై ఆంక్షలు... కొత్త మంత్రి కీలక వ్యాఖ్యలు!

అవును... గత ప్రభుత్వ హయాంలో సినిమా ఇండస్ట్రీపై పలు రకాల ఆంక్షలు ఉండేవనే విమర్శలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-15 04:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, టూరిజం మంత్రిగా జనసేన నేత, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సినిమా రంగంపై ఆంక్షలు, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు, చట్టపరమైన చర్యలు, ఏపీలో టూరిజం అభివృద్ధి మొదలైన అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... గత ప్రభుత్వ హయాంలో సినిమా ఇండస్ట్రీపై పలు రకాల ఆంక్షలు ఉండేవనే విమర్శలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరలు విషయంలో వైఎస్ జగన్ సర్కార్ కాస్త కఠినంగా ఉండేదనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపించేవి. టిక్కెట్ ధరలు పెంచుకోనివ్వడం లేదని పలువురు వాపోయేవారు. అయితే ఇకపై అలాంటి ఆంక్షలు ఏమీ ఉండవని అంటున్నారు కందుల దుర్గేష్.

ఇకపై సినిమా ఇండస్ట్రీపై ఎటువంటి ఆంక్షలూ ఉండవని స్పష్టం చేశారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఇదే సమయంలో సినిమా రంగం అభివృద్ధికి కృషి చేస్తామని.. ఆ రంగానికి లబ్ధి చేకూరుస్తామని ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో పరివాహక ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని టూరిజం హబ్ గా మారుస్తామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కక్ష సాధింపు చర్యలపై స్పందించారు.

ఇందులో భాగంగా తమ దృష్టంతా సుపరిపాలన అందించే విషయంపైనే ఉంటుందని చెప్పిన దుర్గేష్... తమ పాలనలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడం కానీ, చట్టప్రకారం మాత్రం తప్పు చేసినవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇదే సమయంలో లోకేష్ సిద్ధం చేసిన "రెడ్ బుక్" ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు.

ఇదే సమయంలో ఏపీలో అభివృద్ధిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పిన కందుల దుర్గేష్... తనను గెలిపించిన నిడదవోలుతో పాటు పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. గతంలో కేవలం బటన్ నొక్కడానికే పరిమితం అవ్వడం వల్ల అభివృద్ధి కుంటిపడిందని తెలిపారు!

అదేవిధంగా ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న ఈవీఎం ట్యాపరింగ్ అంశంపైనా కందుల దుర్గేష్ స్పందించారు. ఇందులో భాగంగా... కేవలం తాము అనుసరించిన విధివిధానాలే తమ గెలుపుకు కారణం అని అన్నారు. ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని.. ఈవీఎంలపై వ్యాఖ్యలు అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవడమే అవుతుందని దుర్గేష్ తెలిపారు.

Tags:    

Similar News