కంగువ.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది సూర్య!

ఇక తెలుగు వెర్షన్ లో సూర్య డబ్బింగ్ విషయంలో నిరాశ చెందినట్లుగా సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Update: 2024-11-15 03:35 GMT

తెలుగులో మంచి క్రేజ్ ఉన్న తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "కంగువ". శివ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ యాక్షన్ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేశారు. భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే రివ్యూలు వచ్చాయి. ఇక తెలుగు వెర్షన్ లో సూర్య డబ్బింగ్ విషయంలో నిరాశ చెందినట్లుగా సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

'కంగువా' సినిమా ద్వారా సూర్య తెలుగులో తొలిసారిగా డబ్బింగ్ చెప్పుకున్నారు. కాకపోతే ఇది పూర్తిగా ఆయన ఒరిజినల్ వాయిస్ కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డబ్బింగ్ చెప్పించారు. తమిళ వెర్షన్‌కు మాత్రమే సూర్య డబ్బింగ్‌ చెప్పగా.. తెలుగుతో సహా మిగిలిన భాషల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్ ను మార్చారు. దీంతో కోలీవుడ్ లో ఏఐ ద్వారా డబ్బింగ్‌ పనులు పూర్తి చేసిన తొలి సినిమాగా నిలిచింది. ఇదంతా బాగానే ఉంది కానీ, తెలుగులో మాత్రం ఈ డబ్బింగ్ కు నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.

గతంలో సూర్యకు తెలుగులో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి వాయిస్ అందించేవారు. 'సింగం' సిరీస్ లో బేస్ వాయిస్ తో ఆయన చెప్పే డైలాగ్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాత్రకు తగ్గ వేరియేషన్ తో తన గాత్రంతో మెస్మరైజ్ చేశారు. 24 లాంటి మరికొన్ని చిత్రాలలో సూర్య నటనకు ఈయన వాయిస్ తోడవడంతో, ఆ పాత్రలు అద్భుతంగా పేలాయి. సూర్య ఒరిజినల్ వాయిస్ ఇదేనని అనుకునే విధంగా, శ్రీనివాసమూర్తి గొంతు తెలుగు ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది. సూర్య సైతం ఆయన తెలుగు డబ్బింగుకు ఫిదా అయిపోయారు.

అయితే దురదృష్టవశాత్తూ శ్రీనివాస మూర్తి 2023 జనవరిలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని, తెలుగులో తన నటనకు ఆయన గాత్రం, భావోద్వేగాలు ప్రాణం పోశాయని సూర్య ఎమోషనల్ అయ్యారు. శ్రీనివాస మూర్తి మరణించిన తర్వాత సూర్య వేరే డబ్బింగ్ ఆర్టిస్టులతోనే వాయిస్ ఇప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఎందుకనో సూర్యకు ఎవరు డబ్బింగ్ చెప్పినా, తెలుగు ప్రేక్షకులు ఆయన యాక్టింగ్ ను ఫీల్ అవ్వలేకపోతున్నారు.


నిజానికి 'ఆకాశం నీ హద్దురా' సినిమాలో సూర్య పాత్రకు తెలుగులో టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ వాయిస్ ను ట్రై చేశారు. డబ్బింగ్ బాగా చెప్పాడనే పేరు తెచ్చుకున్నాడు కానీ, సత్యదేవ్ మరోసారి ఇతర హీరోలకు గాత్రదానం చేయటానికి ఆసక్తి చూపించలేదు. దీంతో 'జై భీమ్', 'ఈటీ' వంటి చిత్రాలకు మరో ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించారు. కానీ శ్రీనివాస మూర్తి చెప్పిన వాయిస్ స్థాయిలో లేదనే కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు 'కంగువ' సినిమాలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపించిందని అంటున్నారు.

AI సాయంతో సూర్య చెప్పిన డబ్బింగ్ ఎబ్బెట్టుగా అనిపించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కంగువ క్యారక్టర్ కు శ్రీనివాస మూర్తి గాంభీర్యమైన వాయిస్ అయితే సరిగ్గా ఉండేదని అంటున్నారు. లౌడ్ డైలాగ్స్ కు ఆయన బేస్ వాయిస్ తోడైతే చాలా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు సూర్య చెప్పిన డబ్బింగ్ ఏదో ఇంగ్లీష్ మూవీకి చెప్తున్న ఫీలింగ్ కలిగిందని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. మరి రాబోయే సినిమాల డబ్బింగ్ విషయంలో సూర్య ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News