సినిమాల్లోకి అందుకే రాలేద‌న్న కాంతారావు డాట‌ర్!

పాత త‌రం న‌టుల్లో ఎన్టీఆర్..ఏఎన్నార్ త‌ర్వాత బ‌లంగా వినిపించిన మ‌రో లెజెండ‌రీ న‌టుడు కాంతారావు అలియాస్ క‌త్తి కాంతారావు

Update: 2024-07-15 17:30 GMT

పాత త‌రం న‌టుల్లో ఎన్టీఆర్..ఏఎన్నార్ త‌ర్వాత బ‌లంగా వినిపించిన మ‌రో లెజెండ‌రీ న‌టుడు కాంతారావు అలియాస్ క‌త్తి కాంతారావు. క‌త్తి ప‌ట్టి యుద్ధాలు చేయ‌డంలో కాంతారావు అప్ప‌ట్లో స్పెష‌లిస్ట్. క‌త్తి దూయ‌డంలో ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. కాంతారావు క‌త్తి స‌న్నివేశాలు ఉన్నాయంటే? ఆ సినిమా హిట్టే అన్నంత పేరు సంపాదించుకున్నారు. ఆ ర‌కంగా క‌త్తి కాంతారావు ఇంటి పేరుగా మారిపోయింది.

తెలుగు సినిమా కళామతల్లికి ఎన్టీఆర్ - ఏఎన్నార్ రెండుకళ్లు అయితే- నుదుటున తిలకం గా కాంతారావుని ప‌రిశ్ర‌మ భావిస్తుంది. అయితే ఆయ‌న త‌దానంత‌రం వార‌సులెవ‌రు! ఇండ‌స్ట్రీలో లేరు. తాజాగా ఆయ‌న కుమార్తె సుశీల అలా రాక‌పోవ‌డానికి గ‌ల కొన్ని కార‌ణాల‌ను ప్ర‌స్తావించే ప్ర‌య‌త్నం చేసారు.

`1964లోనే మద్రాసులో నాన్న పెద్ద బంగ్లా కొన్నారు. 3 కార్లు , 8 మంది నౌకర్లు ఉండేవారు. మాకు ఎలాంటి కష్టం తెలియకుండా పెంచారు. సొంతంగా తీసిన 5 సినిమాల కారణంగా ఆస్తిపాస్తులను పోగొట్టుకోవలసి వచ్చింది. నాన్న‌ చాలా మొండిమనిషి. ఎవరు చెప్పినా వినేవారు కాదు. తాను ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నట్టు నాన్న ఎవరికీ చెప్పుకోలేదు. తెలిసినా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు.

`నాన్నకి జాగ్రత్తపడటం తెలియదు. ఆయన్ని గైడ్ చేసేవారు కూడా లేరు. అందువలన ఆయ‌న తోచింది చేసుకుంటూ వెళ్లేవారు డ‌బ్బుల‌న్నంత కాలం ఎన్నో స‌హాయాలు చేసేవారు. కానీ ఆయనకి ఇల్లు కూడా లేకుండా కష్టపడుతున్నాడనీ, చిన్నచిన్న వేషాలు వేస్తున్నారని తెలిసినా త‌ర్వాతి కాలంలో ఎవరూ పట్టించుకోలేదు. నాన్న‌కి భ‌రోసా క‌ల్పించే వారే క‌రువ‌య్యారు. మేమున్నామ‌ని నాన్నకి సాయం చేసేంత మంచి మనసున్న హీరోలు లేర‌నిపించింది. హీరోలు మాత్రమే కాదు సాయం పొందిన ఏ ఆర్టిస్టు కూడా కనీస ఆద‌ర‌ణ చూపలేదు. నాన్న చ‌నిపోయిన త‌ర్వాత పూర్తిగా క‌నిపించ‌డం మానేసారు. అందుకే మా ఫ్యామిలీ నుంచి ఎవ‌రు సినిమా రంగంలో లేకుండా పోయారు` అని తెలిపారు.

Tags:    

Similar News