స్టార్ హీరో దాదాగిరిని నిలదీసిన నటి
సల్మాన్ ప్రత్యర్థి అయిన వివేక్ ఒబేరాయ్ ని ప్రశంసిస్తూ.. సల్మాన్ పేరు ప్రస్థావించకుండానే కవితా కౌశిక్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చనీయాంశమైంది.
బిగ్ బాస్ 14 ఇంటి సభ్యురాలిగా కవితా కౌశిక్ సుపరిచితురాలు. ఇంటిలో ముగ్గురితో జరిగిన గొడవల విషయంలో తన పేరు మార్మోగింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ తాను చెప్పేది వినలేదని ఆవేదన చెందిన వారిలో కవిత ఉన్నారు. ఈ మాజీ టీవీ నటి ఇప్పుడు పరోక్షంగా సల్మాన్ పై పంచ్ లు వేయడం చర్చనీయాంశమైంది. సల్మాన్ ప్రత్యర్థి అయిన వివేక్ ఒబేరాయ్ ని ప్రశంసిస్తూ.. సల్మాన్ పేరు ప్రస్థావించకుండానే కవితా కౌశిక్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చనీయాంశమైంది.
కవిత తాజా ట్వీట్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌పై ప్రశంసలు కురిపించింది. అలాగే తమ రూపం తో మెప్పు పొందే నటులెవరూ వ్యక్తిత్వం విషయంలో ఒక స్థాయిని పొందలేరని కూడా విమర్శించారు కవిత. అలాంటి నటులు దాదాగిరిని ఆపాలని కూడా వ్యాఖ్యానించారు. సల్మాన్ పేరును సూటిగా ప్రస్థావించకపోయినా ఆమె అతడిపైనే పంచ్ వేసిందని రెడ్డిటర్లు విశ్లేషించారు. ఒబెరాయ్ ని ప్రశంసిస్తూనే సల్మాన్‌ని కించపరచడం అంటే ఇదేనని నెటిజనులు భావించారు. వివేక్ ఒబెరాయ్ నికర ఆస్తి గురించి ఎక్స్ లో వచ్చిన పోస్ట్‌పై ఇటీవల కవిత స్పందించారు. కవితా కౌశిక్ రీ-షేర్ చేసిన ఒరిజినల్ పోస్ట్ ప్రకారం.. ``వివేక్ ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ రూ. 1200 కోట్లు.. ఇది రణబీర్ కపూర్, అల్లు అర్జున్‌ల కంటే ఎక్కువ`` అనే పోస్ట్‌పై స్పందించిన కవితా కౌశిక్ వివేక్ ఒబెరాయ్‌ను `అతడు అద్భుతమైన నటుడు` అంటూ ప్రశంసించారు. ఒబెరాయ్ అద్భుతమైన నటుడు, తనను నమ్మిన స్త్రీకి అండగా నిలిచాడు.. అని అన్నారు. అతడు తన సూత్రాలకు కట్టుబడి ఉన్నందుకు మెచ్చుకుంటూ అదే ట్వీట్‌లో ఆమె `స్వాగ్` పేరుతో దాదాగిరి చేసే నటులను ఆరాధించే ప్రజల దురభిమానాన్ని విమర్శించింది.
ఈ పోస్ట్ క్షణాల్లో రెడ్డిట్‌లో వైరల్ అయ్యింది. అయితే కవిత గతంలో సల్మాన్ ని ప్రశంసించిన వీడియోలను నెటిజనులు వెతికారు. కానీ కొందరు బిగ్ బాస్ 14లో పని చేసిన తర్వాత సల్మాన్ పై ఆమె అభిప్రాయాలు మారిపోయి ఉండవచ్చని విశ్లేషించారు. కవితా కౌశిక్ బిగ్ బాస్ 14లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఉన్నారు. షోలో తనను కార్నర్ చేసారని కలత చెందింది. ఇంటి సభ్యులతో వివాదాల సమయంలో సల్మాన్ ఖాన్ తన దృక్పథాన్ని వినడానికి ఆసక్తి చూపలేదని ఆమె పేర్కొంది. ``అతడు వినడు. అతడికి ఆసక్తి లేదు`` అని విమర్శించింది. తోటి కంటెస్టెంట్స్ ఐజాజ్ ఖాన్, అభినవ్ శుక్లా , రుబినా దిలాక్‌లతో గొడవలకు దిగిన కవిత పేరు హెడ్ లైన్స్ లో నిలిచింది.
ఆసక్తికరంగా సల్మాన్, అతడి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం గురించి గతంలో కవితా కౌశిక్ ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. సలీంఖాన్, సల్మాన్ సహా అతడి కుటుంబం నేను (కవిత) నటించిన ఎఫ్ఐఆర్ చూశారు. సలీం అంకుల్ నన్ను లంచ్‌కి ఆహ్వానించారు. నిజంగా మీ నటప్రదర్శనను ఆస్వాధించామని అన్నారు. షోను ఇష్టపడి వారు నా కోసం విందును నిర్వహించడం ద్వారా నాకు ప్రియతమ వ్యక్తులు అయ్యారు.. అని కవిత అన్నారు.