'ది కేరళ స్టోరి' మేకర్స్ మరో సంచలనం?
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన `ది కేరళ స్టోరి` వెండితెరపై విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన `ది కేరళ స్టోరి` వెండితెరపై విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేరళ నుంచి ప్రేమ పేరుతో మోసపోయి విదేశాలకు తరలిపోయే అందమైన యువతుల కథను ఆద్యంతం రక్తి కట్టించేలా మేకర్స్ తెరకెక్కించారు. హిందూ యువతులను దారి మళ్లించే ముస్లిమ్ తీవ్రవాదుల కథను తెరపై చూపడంతో వివాదం రేకెత్తింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విపుల్ అమృతలాల్ షా నిర్మాత. ఇప్పుడు త్రయం మరోసారి సంచలనాలకు రెడీ అవుతోంది.
ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం `బస్తర్` నక్సలిజంలోని లోతుపాతుల్ని అసలైన నిజాల్ని తెరపై ఆవిష్కరించనుంది. ది కేరళ స్టోరి తర్వాత ఇది మరో అసాధారణ ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ వివాదాస్పద అంశాలను ధైర్యంగా ప్రస్తావిస్తోంది. నక్సలిజం కారణంగా భారత సైనికుల మరణాల గురించి భయంకరమైన గణాంకాలను హైలైట్ చేసే IPS నీర్జా మాధవన్ పాత్రలో అదా శర్మ నటించింది. ఇది ఎలాంటి న్యాయం? నక్సల్స్ ఇలాంటి దురాగతాలకు పాల్పడడం సరైనదేనా? అని నీర్జా ప్రశ్నిస్తోంది. దీనివెనక నక్సల్స్ మనస్తత్వాన్ని ఆమె ప్రశ్నిస్తుంది. పెద్ద నగరాల్లోని సూడో మేధావుల గురించిన ప్రశ్న ఆలోచింపజేస్తుంది.
ఇలాంటి సూడో మేధావులను తుపాకీతో కాల్చివేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఉరి వేయడానికి సిద్ధమేనని నీర్జా టీజర్ లో ప్రకటిస్తుంది. దీనిని బట్టి అదా శర్మ మరో సాహసోపేతమైన పాత్రలో నటించిందని అర్థమవుతోంది. ది కశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ లాంటి చిత్రాలు వివాదాస్పద అంశాలతో ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. మొదటిది పెద్ద సక్సెసైతే, రెండోది ఫెయిలైంది. అదే సమయంలో అదా శర్మ నటించిన ది కేరళ స్టోరి పెద్ద విజయం సాధించింది. వివాదాలతో ఇవన్నీ కావాల్సిన ప్రచారం కొట్టేసాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు బాగా రాణించేందుకు ఈ వివాదాలు కలిసి వచ్చాయి. అయితే ఇప్పుడు ది కేరళ స్టోరి తరహాలో బస్తర్ కూడా విజయం సాధిస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి. మార్చి 15న బస్తర్ విడుదల కానుంది.