అక్కినేని హీరో సినిమాని ప్రకటించిన కిరణ్ అబ్బవరం!
అయితే ఇప్పుడు హీరో కిరణ్ అబ్బవరం వాళ్ళని ఆనందపరిచే ఓ న్యూస్ తో వచ్చారు.
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇంకా తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. 'ఏజెంట్' సినిమా వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంతవరకూ నెక్స్ట్ మూవీ #Akhil6ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారని, ఫలానా డైరెక్టర్స్ తో చేస్తున్నాడని, వందల కోట్ల బడ్జెట్ అంటూ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి కానీ.. అధికారికంగా ఏదీ అనౌన్స్ చెయ్యలేదు. దీంతో అక్కినేని అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు హీరో కిరణ్ అబ్బవరం వాళ్ళని ఆనందపరిచే ఓ న్యూస్ తో వచ్చారు. అక్కినేని వారసుడి తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించారు.
'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. కానీ అక్కినేని కాంపౌండ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. మేకర్స్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించకముందే, కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్ ని కంఫర్మ్ చేసేసారు. 'క' సక్సెస్ మీట్ లో తనతో వర్క్ చేసిన దర్శకుల కెరీర్ బాగుందని చెప్పిన కిరణ్.. అఖిల్ తో మురళీ కిశోర్ సినిమా చేస్తున్నాడని తెలిపారు. అలానే విజయ్ దేవరకొండతో 'రాజా వారు రాణి గారు' డైరెక్టర్ రవికిరణ్ కోలా సినిమా చేస్తున్నాడని, 'సమ్మతమే' 'ఎస్ఆర్ కల్యాణమండపం' దర్శకులకు కూడా ఆఫర్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉందని కిరణ్ చెప్పారు.
ఇలా #Akhil6 గురించి అధికారిక ప్రకటన రాకముందే, దర్శకుడు ఎవరనే విషయాన్ని కిరణ్ అబ్బవరం బయటపెట్టేసారు. మురళీ కిశోర్ తోనే అఖిల్ సినిమా ఉంటుందని స్పష్టం చేసారు. అయ్యగారి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందో అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కు, 'క' హీరో గుడ్ న్యూస్ అందించారనే చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. 'హలో' తర్వాత హోమ్ బ్యానర్ లో అఖిల్ చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది.
అఖిల్ కోసం మురళీ కిశోర్ ఒక రూరల్ యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇది అనంతపురం బ్యాక్ డ్రాప్ స్టోరీ అని, దీంట్లో అఖిల్ ఒక ఊర మాస్ క్యారక్టర్ లో నటిస్తారని, న్యూ లుక్ లో కనిపించబోతున్నాడని టాక్. మోస్ట్ డిమాండబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తారని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి, నవంబర్ మూడో వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి కింగ్ అక్కినేని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈసారి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన తర్వాతే అభిమానుల ముందుకు రావాలని గట్టిగా నిర్ణయించుకున్న అఖిల్ అక్కినేని.. మురళీ కిశోర్ ప్రాజెక్ట్ తో పాటుగా యూవీ క్రియేషన్స్ సినిమాని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేస్తారని సమాచారం. ఇదొక పీరియాడిక్ మూవీ అని, వంద కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకి 'ధీర' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. సో రాబోయే రోజుల్లో అక్కినేని యూత్ కింగ్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ రెండు క్రేజీ అనౌన్స్ మెంట్స్ రాబోతున్నాయన్నమాట.