థియేటర్ల వద్ద యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించాలి: కోలీవుడ్ కీలక నిర్ణయం
అయితే అలాంటి వారిని నియంత్రించడానికి తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కాలంలో ఏ కొత్త సినిమా రిలీజైనా, ఉదయాన్నే థియేటర్ల వద్ద కొందరు మైకులు పట్టుకొని పబ్లిక్ టాక్ తెలుసుకోడానికి రెడీగా ఉంటున్నారు. సినిమా హాలు నుంచి బయటకు వచ్చే జనాల అభిప్రాయాలను తెలుసుకొని, వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో వ్యూస్ కోసం రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి, మరికొందరు సినిమా రివ్యూ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో లిమిట్స్ క్రాస్ చేసి రివ్యూల పేరుతో హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే అలాంటి వారిని నియంత్రించడానికి తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది.
పబ్లిక్ టాక్ పేరుతో థియేటర్ల వద్ద యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే రివ్యూలు.. సినిమా ఫలితంపై ప్రభావం చూపుతున్నాయని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది. ఈ ఏడాదిలో అనేక పెద్ద సినిమాలు ఈ విధంగానే నష్టపోయాయని పేర్కొంటూ.. దానిని కంట్రోల్ చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకోడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా థియేటర్స్ ప్రాంగణాల్లో యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించాలని తాజాగా కఠిన కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో పబ్లిక్ టాక్ తెలుసుకోడానికి యూట్యూబ్ ఛానల్స్ కు అవకాశం కల్పించకూడదని థియేటర్ యజమానులను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సినిమా రివ్యూల పేరుతో వ్యక్తిగత దాడులు, విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.
''సినిమా రివ్యూల పేరుతో వ్యక్తిగత దాడులు, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి చర్యలను మన సమాజం ఖండించాలి. సినిమాల్లోని లోపాలను విమర్శించే హక్కు జర్నలిస్టులందరికీ ఉంది. అయితే ఇది కేవలం సినిమాకి మాత్రమే పరిమితం అవ్వాలి. కానీ ఇటీవలి కాలంలో కొన్ని మీడియాలు దర్శక నిర్మాతలు, హీరోపై వ్యక్తిగత దాడులకు, వారిపై తమ ద్వేషాన్ని వెళ్లగక్కడానికి సినిమా రివ్యూలను ఒక సాధనంగా ఉపయోగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఫిలిం క్రిటిక్స్.. సినిమాలోని లోపాలను, తప్పులను ఎత్తిచూపే ప్రమాణాల వంటివారు. కానీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే క్రమంలో సినిమా మొత్తాన్ని విమర్శించడం, వ్యక్తిగత దాడులు చేయడం సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేయడమేనని మా అసోసియేషన్ భావిస్తోంది. అలా చేస్తున్న జర్నలిస్టులను మా అసోసియేషన్ ఖండిస్తోంది''
''సినిమా గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. విమర్శకులు తమ అభిప్రాయాలను సార్వజనీనంగా ప్రజలకు అందించడం మానుకోవాలి. సినిమాని మూడు గంటల వినోదంగా మాత్రమే చూడకుండా, మొత్తం సమాజానికి అన్యాయం చేసినట్టు మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని భావిస్తున్నాం. సినిమాలను సమీక్షించే హక్కు విమర్శకులకు ఉంటుంది. అయితే వ్యక్తిగత దురుద్దేశంతో మీడియాలో సినిమాపై ద్వేషం వెళ్లగక్కకుండా జర్నలిస్టులందరూ సినిమా రివ్యూలు రాయవలసిందిగా కోరుతున్నాము. ఈ సినీ పరిశ్రమను బతికించడానికి జర్నలిస్టులు తగినవిధంగా విమర్శలు చేస్తారని ఆశిస్తున్నాం.''
''అదే సమయంలో, థియేటర్‌ల బయట అనేక యూట్యూబ్ ఛానల్స్ సినిమా మొదటి రోజు ప్రేక్షకుల కామెంట్స్ ను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాయి. అది సినిమా చూసిన వాళ్ళందరి సమిష్టి అభిప్రాయంగా జనాల్లోకి తీసుకెళ్లడం ఖండించదగిన విషయం. రీసెంట్ గా 'కంగువ' రివ్యూ పేరుతో ఓ పెద్ద మనిషి థియేటర్ బయట వ్యక్తిగత దాడులు చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలను రికార్డ్ చేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లిన యూట్యూబ్ ఛానెల్‌లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్‌లో తిండి సరిగా లేకుంటే, ఎవరైనా బయటకు వచ్చి ఆ రెస్టారెంట్ గురించి మీడియాలో మాట్లాడి తమ జీవితాన్ని నాశనం చేస్తారా?''
''థియేటర్ల బయట ప్రేక్షకుల అభిప్రాయం అడిగి యూట్యూబ్ ఛానళ్లలో రికార్డింగ్ చేసే పద్ధతి కొనసాగడంతో, చాలా మంది వీక్షకులు ఇలాంటి వీడియోల ద్వారా పాపులారిటీ పొందేందుకు, సినీ పరిశ్రమ మేధావులుగా మాట్లాడి ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. టాక్ అనేది సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారికి బాగా తెలుసు కాబట్టి, చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నాయి. ఎలాంటి ఎడిటింగ్‌లు చేయకుండా వెంటనే అలాంటివి ప్రచురించి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేస్తున్న ఈ చర్యలను తక్షణమే ఆపాల్సిన అవసరం సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికీ అవసరం''
''2024 సంవత్సరంలో పబ్లిక్ రివ్యూ/టాక్ ద్వారా 'ఇండియన్ 2', 'వేట్టయన్' 'కంగువ' సినిమాలపై యూట్యూబ్ ఛానెళ్లు భారీ ప్రభావాన్ని చూపాయి. ఇకనైనా వారిని ప్రోత్సహించకుండా సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని సంఘాలు ఏకమై ఈ వ్యవహారానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. తక్షణ చర్యగా, థియేటర్ యజమానులందరూ తమ ప్రాంగణంలో అభిమానులను ఇంటర్వ్యూలు చేసే యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించాలని కోరుతున్నాం. థియేటర్ ప్రాంగణానికి సమీపంలో FDFS పబ్లిక్ రివ్యూ/టాక్ తెలుసుకునే ప్రక్రియను పూర్తిగా ఉపసంహరించుకోవడంలో సహకరించాలని మేము అభ్యర్థిస్తున్నాము''
''తమిళనాడులోని అన్ని థియేటర్ యజమానులు తమ ప్రాంగణంలో మాత్రమే కాకుండా సమీపంలోని ప్రదేశంలో అయినా సరే, కొత్త సినిమాల గురించి అభిమానులను ఇంటర్వ్యూ చేయడానికి ఏ యూట్యూబ్ ఛానెల్‌ని అనుమతించకూడదు. పబ్లిక్ రివ్యూ/పబ్లిక్ టాక్ పేరుతో ద్వేషాన్ని పెంచే ఈ ట్రెండ్‌ని తక్షణమే నిషేధించాలని థియేటర్ యజమానులందరినీ కోరుతున్నాం. సినిమాలను నైతికంగా విమర్శించకుండా మీడియా ద్వారా వ్యక్తిగత దాడులకు, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులపై/అభిమానులపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా అసోసియేషన్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని మేము తెలియజేస్తున్నాం. వీక్షకులు/అభిమానులు తమ మతోన్మాద వ్యాఖ్యలు సినిమా పరిశ్రమను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో గ్రహించి, ఇకనైనా తమ విమర్శలను బాధ్యతాయుతంగా చెబుతారని ఆశిస్తున్నాము'' అని తమిళ సినీ నిర్మాతల మండలి లేఖలో పేర్కొంది.