లాపతా లేడీస్‌ కి చేతు అనుభవం ఎందుకు ?

2025 ఆస్కార్‌కి ఇండియా నుంచి అధికారికంగా ఎంపిక అయిన 'లాపతా లేడీస్‌' సినిమాకు జర్నీ ముగిసింది.

Update: 2024-12-18 05:30 GMT

2025 ఆస్కార్‌కి ఇండియా నుంచి అధికారికంగా ఎంపిక అయిన 'లాపతా లేడీస్‌' సినిమాకు జర్నీ ముగిసింది. కిరణ్‌ రావు దర్శకత్వంలో రూపొంది విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని ఆస్కార్‌ వేట మొదలు పెట్టిన ఈ సినిమాకు షార్ట్‌ లిస్ట్‌లో చోటు దక్కలేదు. డిసెంబర్‌ 17న అకాడమీ ప్రకటించిన ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ చిత్రాల జాబితాలో మన సినిమా లాపతా లేడీస్ లేక పోవడంతో మొత్తం ఇండియన్ సినీ ప్రేమికులు నిరాశకు గురి అయ్యారు. చిన్న సినిమాగా రూపొందిన లాపతా లేడీస్‌ను ఆస్కార్‌ వరకు తీసుకు వెళ్లడం కోసం మేకర్స్‌ చాలా ప్రయత్నాలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు చేశారు, అయినా ఫలితం దక్కలేదు.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్ రావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. లాపతా లేడీస్ సినిమా నిర్మాణంలో ఆమిర్‌ ఖాన్‌ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మహిళల యొక్క ఆర్థిక స్వాతంత్య్రం, భవిష్యత్తు, స్వేచ్చ ఇలా పలు సామాజిక అంశాలను తీసుకుని కిరణ్ రావు ఈ సినిమాను రూపొందించారు. మంచి సందేశంతో రూపొందిన సినిమా కావడంతో పాటు, చక్కని స్క్రీన్‌ప్లే ఉండటంతో సినిమాను ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్‌ నామినేషన్స్‌కి ఎంపిక చేశారు. కానీ షార్ట్‌ లిస్ట్‌లో సైతం చోటు సంపాదించుకోలేక పోవడం తీవ్రంగా నిరాశకు గురి చేస్తోంది.

గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను భారత్‌ నుంచి అధికారికంగా నామినేషన్స్‌కి పంపించక పోవడంతో సొంతంగానే ఆస్కార్‌ బరిలో జక్కన్న అండ్ టీం నిలిచిన విషయం తెల్సిందే. పలు విభాగాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ బరిలో నిలిస్తే నాటు నాటు పాట మాత్రం షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. చివరకు ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకోవడంతో దేశం మొత్తం గర్వించింది. అలాగే 2025 ఆస్కార్‌లోనూ ఇండియన్‌ సినిమా జయ కేతనం ఎగుర వేస్తుందని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా లాపతా లేడీస్‌ కి చేతు అనుభవం ఎదురు అయ్యింది. ఆస్కార్‌ రేసు నుంచి లాపతా లేడీస్‌ తప్పుకున్నా ఒక ఇండియన్ మూవీ మాత్రం ఇంకా బరిలో ఉంది, ఆ సినిమా షార్ట్‌ లిస్ట్‌ అయ్యింది.

లాపతా లేడీస్ ఆస్కార్‌ జర్నీ ముగిసినా ఒక ఇండియన్‌ సినిమా 'సంతోష్‌' షార్ట్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. షహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించి సంతోష్ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌ జాబితాలో షార్ట్‌ లిస్ట్‌ అయ్యింది. సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన సమయంలో విమర్శకుల ప్రశంసలు దక్కాయి. చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండానే ఆస్కార్ బరిలో నిలిచింది. పెద్దగా హడావిడి చేయకుండానే షార్ట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించింది. పలు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్న ఈ సినిమా ఆ చివరి మెట్టు ఎక్కి ఇండియాకు ఆస్కార్‌ను మరోసారి తెచ్చేనా చూడాలి

Tags:    

Similar News