కల్కి టీమ్ కు లీగల్ నోటీసులు.. ఏం జరిగిందంటే?
సినిమాను తప్పుగా చిత్రీకరించారని ప్రమోద్ కృష్ణమ్ అభ్యంతరం తెలిపారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మిస్తారని ఈ మూవీలో చూపించడంపై ఆయన మండిపడ్డారు.
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంటర్లలో దూసుకుపోతోంది. అనేక చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసి మేకర్స్ కు లాభాల వర్షం కురిపిస్తోంది.
అయితే కల్కి మూవీ చూసి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అనేక మంది ఇప్పటికే నాగ్ అశ్విన్ టాలెంట్ ను మెచ్చుకున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరుల యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. రాబోయే జనరేషన్లకు ఇలాంటి సినిమాలు కచ్చితంగా అవసరమని తెలిపారు. భారత పురాణాల స్ఫూర్తితో నాగీ తెరకెక్కించిన ఈ సినిమాలోని మహాభారతం సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ సన్నివేశాల విషయంలో కల్కి మూవీ టీమ్ కు కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ లీగల్ నోటీసులు పంపారు. దర్శకనిర్మాతలతోపాటు సినిమాలోని నటులకు కూడా లీగల్ నోటీసులు అందాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కల్కి మూవీ ఉందని ప్రమోద్ కృష్ణమ్ ఆరోపించారు. కల్కి అవతార పుట్టుక ఎలా ఉండనుందో పురాణాల్లో ఉన్న విధంగా కల్కి 2898 ఏడీ చిత్రంలో చూపించలేదని అన్నారు.
సినిమాను తప్పుగా చిత్రీకరించారని ప్రమోద్ కృష్ణమ్ అభ్యంతరం తెలిపారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మిస్తారని ఈ మూవీలో చూపించడంపై ఆయన మండిపడ్డారు. "హిందూ పురాణాల్లో ఉన్న విషయాలకు కల్కి సినిమా విరుద్ధంగా ఉంది. కల్కి అవతారం కాన్సెప్ట్ ను ఈ చిత్రం మార్చేసింది. ఇలా చేయడం కోట్లాది మంది హిందువులతోపాటు పురాణాలను అగౌరవపరచడమే" అని ప్రమోద్ కృష్ణమ్ తన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
సినిమాల కోసం పవిత్ర గ్రంథాలను వక్రీకరించడం వల్ల పురాణాలు, ఇతిహాసాలపై ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని అన్నారు. లీగల్ నోటీసులు పంపుతూ.. 15 రోజుల్లోగా మేకర్స్ స్పందించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి కల్కి 2898 ఏడీ మేకర్స్.. స్వామీజీ నోటీసులపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.