గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. 5 నిమిషాల ఫన్నీ ప్రోమో!
"మిస్టర్ భారత్" అనే టైటిల్ తో లోకేష్ కనగరాజ్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీతో భరత్ హీరోగా, నిరంజన్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'మా నగరం', 'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్', 'లియో' వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న లోకేష్.. ప్రొడ్యూసర్ గానూ రాణించే ప్రయత్నం చేస్తున్నారు. 'జీ స్కౌడ్' అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా తన బ్యానర్ లో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
"మిస్టర్ భారత్" అనే టైటిల్ తో లోకేష్ కనగరాజ్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీతో భరత్ హీరోగా, నిరంజన్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ లోకేష్ స్టైల్ లో ఏకంగా 5 నిమిషాల ఓ ప్రోమో వీడియోని విడుదల చేసారు. ఇందులో లోకేశ్ కనగరాజ్ ను ఒక గ్యాంగ్ స్టర్ గా చూపించారు. అతని గ్యాంగ్ నిరంజన్ ను కిడ్నాప్ చేసి డెన్ కు తీసుకెళ్తారు. డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని హింసిస్తూ, యూట్యూబ్ లో మనోడు వీడియోలు సరిగా రన్ అవడం లేదని గేలి చేస్తారు. అయితే అతని ఫోన్ కాల్ లిస్టులో భారత్ అని పేరు ఎక్కువగా ఉండటం చూసి, అతన్ని డెన్ కి పిలిపిస్తారు.
యూట్యూబ్ లో వీడియోలు తాను కూడా చూశానని.. ఒక మంచి వీడియో తీయడానికి ఛాన్స్ ఇస్తానని, కానీ నాలుగైదు నిముషాలు కాకుండా లెన్త్ కొంచం ఎక్కువ ఉండాలని సూచిస్తాడు లోకేష్ కనగరాజ్. దీంతో ఉత్సాహంగా బయటకు వెళ్లిన భరత్.. లోకేష్ ప్రొడక్షన్ లో తాను హీరోగా, నిరంజన్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్లు మీడియాని పిలిచి చెప్తాడు. దీంతో షాక్ అయిన లోకేష్.. నేను కొంచం నిడివి పెంచమంటే ఏకంగా 2 గంటల లెన్త్ తో సినిమా ప్లాన్ చేసారని, తాను అడ్డంగా బుక్కయ్యానని తెలుసుకుంటాడు. గన్ పక్కన పెట్టి లాలీపాప్ చేతికి తీసుకుంటాడు. అయితే చివర్లో ఈ సినిమా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే వ్యూస్, లైక్స్, కామెంట్స్ విపరీతంగా వస్తాయని భరత్ చెప్పడంతో అవాక్కవుతారు. ఫైనల్ గా "మిస్టర్ భారత్" మూవీ త్వరలో థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని ప్రకటించడంతో ఈ ప్రోమో ముగుస్తుంది.
భరత్, నిరంజన్ ఇద్దరూ యూట్యూబ్ ద్వారానే ఫేమస్ అయ్యారు. దానికి తగ్గట్టుగా ఫన్నీగా రూపొందించిన "మిస్టర్ భారత్" అనౌన్స్ మెంట్ ప్రోమో వీడియో ఆకట్టుకుంటోంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ సమర్పణలో ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్, ది స్కాడ్ బ్యానర్స్ మీద సుధన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
కొత్తవారిని ప్రోత్సహించడానికి, వారిలోని టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే సొంతంగా బ్యానర్ పెట్టినట్లు లోకేష్ తెలిపారు. ఇంతకముందు 'మైఖేల్', 'ఫైట్ క్లబ్' లాంటి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో ఆయన నిర్మాణంలో 'బెంజ్' అనే యాక్షన్ థ్రిల్లర్ ను ప్రకటించారు. రాఘవ లారెన్స్ హీరోగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. లోకేష్ దర్శకత్వంలో ప్రస్తుతం ''కూలీ'' అనే సినిమా రూపొందుతోంది. ఇందులో రజినీకాంత్, అక్కినేని నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.