2024లో భారీ డిజాస్టర్లుగా మారిన 10 తెలుగు సినిమాలు!
కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిస్తే, మరికొన్ని చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి.
2024 సంవత్సరం టాలీవుడ్ కు మిశ్రమ ఫలితాలను అందించింది. ఎన్ని హిట్లు ఉన్నాయో, అంతకుమించి ఫ్లాపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిస్తే, మరికొన్ని చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి. భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు ఈ ఏడాది తీవ్ర నిరాశ పరిచాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ అయ్యారేమో కానీ, థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయాయి. థియేట్రికల్ రెవెన్యూ పరంగా బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మారిన 10 సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.
సైంధవ్:
విక్టరీ వెంకటేశ్ ఈ సంవత్సరం 'సైంధవ్' సినిమాతో తన కెరీర్ లోనే అతి పెద్ద పరాజయాన్ని చవిచూశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. సంక్రాంతి సీజన్ లో రిలీజైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మాములుగా వెంకీ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉంటుంది. కానీ ఇది యాక్షన్ మూవీ కావడంతో ఆ సెక్షన్ ఆడియన్స్ దూరమయ్యారు. దీంతో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
ఈగల్:
మాస్ మహారాజా రవితేజ ఫిబ్రవరి నెలలో 'ఈగల్' సినిమాతో తీవ్ర నిరాశ పరిచారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా ముగిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో అధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. కానీ థియేటర్లలో ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. ఫస్ట్ వీకెండ్ లో పర్వాలేదనిపించినా, ఆ తర్వాత నిలబడలేకపోయింది.
ఆపరేషన్ వాలెంటైన్:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన పాన్ ఇండియన్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్' ఘోర పరాజయం చవిచూసింది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సోనీ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆధారంగా ఈ సినిమా తీశారు. మార్చి మొదటి వారంలో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవాల్సి వచ్చింది.
భీమా:
చాలా ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్టు కోసం ప్రయత్నిస్తున్న మ్యాచో స్టార్ గోపీచంద్ కు ఈ ఏడాది కూడా నిరాశ ఎదురైంది. ఆయన నటించిన 'భీమా' మూవీ బాక్సాఫీస్ పెయిల్యూర్ గా మారింది. హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందించారు. మహాశివరాత్రి స్పెషల్ గా మార్చి రెండో వారంలో థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టింది కానీ, చివరకు లాస్ ప్రాజెక్ట్ గానే మిగిలిపోయింది.
ది ఫ్యామిలీ స్టార్:
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ సైతం డిజప్పాయింట్ చేసింది. పేరులో ఫ్యామిలీ ఉంది కానీ, థియేటర్లకు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా రాలేదు. పరశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయింది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయని మేకర్స్ పోస్టర్లు వదిలారు కానీ, ట్రేడ్ వర్గాలు మాత్రం ఫైనల్ గా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అని డిసైడ్ చేశాయి.
బడ్డీ:
చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్ కు ఈ ఏడాది 'బడ్డీ' లాంటి పరాజయం ఎదురైంది. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ యాక్షన్ మూవీని కేఈ జ్ఞానవేల్ రానా నిర్మించారు. తమిళ్ లో హిట్టయిన 'టెడ్డీ' మూవీకి అడాప్షన్ ఇది. కానీ థియేటర్లో ఈ సినిమా జనాలు పెద్దగా చూడలేదు. దీంతో అల్లువారబ్బాయి ఖాతాలో మరో ఫ్లాప్ పడింది.
డబుల్ ఇస్మార్ట్:
ఉస్తాద్ రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' సినిమాతో డబుల్ డిజాస్టర్ అందుకున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఛార్మీ, పూరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని హనుమాన్ నిర్మాత భారీ రేటుకి కొనుగోలు చేశారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ.. దారుణ పరాజయం పాలైంది. పూర్ రైటింగ్, ఔట్ డేటెడ్ టేకింగ్ అంటూ పూరీని ట్రోల్ చేయడానికి అవకాశం కల్పించింది.
మిస్టర్ బచ్చన్:
ఈ ఏడాది మాస్ రాజా రవితేజ అకౌంట్ లో పడిన మరో డిజాస్టర్ 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ మూవీ తెరకెక్కింది. ఇది హిందీలో హిట్టయిన రైడ్ సినిమాకి రీమేక్. కానీ హరీశ్ తనదైన శైలిలో చాలా మార్పులు చేర్పులు చేశారు. కానీ ఇవేవీ ప్రేక్షకులను అలరించలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయంగా మిగిలిపోయింది. హరీష్ ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయబడ్డాడు.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో:
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లో ఈ ఏడాది ఓ ఫ్లాప్ పడింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో రూపొందిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా ఎలాంటి చడీచప్పుడు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. నిజానికి ఈ సినిమా అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సింది. ఓటీటీ డీల్ కారణంగా సడన్ గా థియేటర్లలోకి తీసుకురావాల్సి వచ్చింది. దీనికి ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
మట్కా:
మెగా హీరో వరుణ్ తేజ్ కి 'మట్కా' రూపంలో మరో డిజాస్టర్ పడింది. వాస్తవ సంఘటన ఆధారంగా డైరెక్టర్ కరుణ కుమార్ ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాని తెరకెక్కించారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో రూపొందించారు. ఇది వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. అయితే మినిమం ఓపెనింగ్స్ సాధించడంలో విఫలమైంది. దీంతో వరుణ్ తేజ్ అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.