'ఆ టైటిల్ దొరకలేదు.. అందుకే వేట్టయన్ తోనే వస్తున్నాం!'

అయితే తెలుగులో కూడా వేట్టయన్ టైటిల్ తోనే మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Update: 2024-10-10 04:16 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. వేట్టయన్ మూవీతో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. జై భీమ్‌ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ తెరకెక్కించిన ఆ సినిమా.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్‌ కౌంటర్‌ నేపథ్యంతో రూపొందిన వేట్టయన్ లో తలైవా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అది క్లారిటీ వచ్చేసింది.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న వేట్టయన్ తో రజినీ ఎలాంటి హిట్ అందుకుంటారోనని అంతా ఎదురుచూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీలో వేట్టయన్ విడుదల కానుంది. అయితే తెలుగులో కూడా వేట్టయన్ టైటిల్ తోనే మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆ విషయంపై చర్చ జరుగుతోంది. తెలుగు భాష అంటే గౌరవం లేదా అని అనేక మంది నెటిజన్లు మేకర్స్ ను ప్రశ్నించారు.

తెలుగులో కూడా రజినీకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ.. టైటిల్ ను మార్చకపోవడంపై పలువురు సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఇప్పుడు ఈ విషయంపై వేట్టయన్ మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ స్పందించింది. సోషల్ మీడియాలో రెస్పాండ్ అయింది. టాలీవుడ్ వెర్షన్ కు తెలుగులో టైటిల్ పెట్టకపోవడంపై క్లారిటీ ఇస్తూ లెటర్ ను రిలీజ్ చేసింది. తమను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

వాస్తవానికి తెలుగు వెర్షన్ కోసం వేటగాడు అనే టైటిల్ ను రిజిస్టర్ చేయిద్దామనుకున్నామని చెప్పింది. కానీ ఆ టైటిల్ అందుబాటులో లేదని తెలిపింది. అందుకే ఒరిజినల్ టైటిల్ తోనే విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. తెలుగుతోపాటు మిగతా డబ్బింగ్ వెర్షన్లకు కూడా వేట్టయన్‌ పేరుతోనే రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది. అందుకే టాలీవుడ్ సినీ ప్రేక్షకులు.. వేట్టయన్ మూవీని ఆదరించాలని కోరుతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థ లేఖలో పేర్కొంది.

అయితే తాము టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమందితో వర్క్ చేశామని చెప్పింది. బ్లాక్ బస్టర్ హిట్స్ ఆర్ఆర్ఆర్, సీతారామం సహా పలు తెలుగు సినిమాలు తమిళంలో విడుదల చేశామని తెలిపింది. తమకు ఎప్పుడూ తెలుగు భాష, తెలుగు సినీ ఇండస్ట్రీ, తెలుగు మీడియా, తెలుగు ఆడియన్స్ పై గౌరవం ఉంటుందని పేర్కొంది. అలా కొద్ది రోజులుగా వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. మరి వేట్టయన్ మూవీ తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News