ఓపెన్ హైమర్- జోకర్ 2 నచ్చలేదన్న మ్యాడీ
తన కొత్త చిత్రం హిజాబ్ బరాబర్‌ను ప్రమోట్ చేస్తున్న సమయంలో హాలీవుడ్ (వెస్ట్) మంచి కథాంశాన్ని అందించడంలో విఫలమైందని మాధవన్ అభిప్రాయపడ్డారు.
ఆర్.మాధవన్ (మ్యాడీ) దాదాపు 7 భాషల్లో నటించిన ఏకైక భారతీయ నటుడు. 25 సంవత్సరాలుగా నటనారంగంలో తిరుగు లేని కెరీర్ ని సాగిస్తున్నాడు. అతడి విలక్షణ నటనకు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. మాధవన్ నటుడు మాత్రమే కాదు రచయిత.. దర్శకనిర్మాత.. క్రీడా ఔత్సాహికుడు.. ఆల్ రౌండర్.
అలాంటి ప్రతిభావంతుడు ఏదైనా సినిమాని సమీక్షిస్తే, తన అభిప్రాయం వ్యక్తం చేస్తే అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవల కొన్ని సినిమాల విషయంలో హాలీవుడ్ తనను నిరాశపరిచిందని .. తనకు ఓపెన్‌హైమర్, జోకర్ 2 నచ్చలేదని చెప్పారు. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం `ఓపెన్‌హైమర్` కూడా అతడికి నచ్చలేదు. అది ఎందుకు నచ్చలేదో వివరించాడు. తన కొత్త చిత్రం హిజాబ్ బరాబర్‌ను ప్రమోట్ చేస్తున్న సమయంలో హాలీవుడ్ (వెస్ట్) మంచి కథాంశాన్ని అందించడంలో విఫలమైందని మాధవన్ అభిప్రాయపడ్డారు.
జాతీయ మీడియాతో మాట్లాడిన మ్యాడీ.. జోకర్ 2 భయంకరంగా ఉందని అన్నాడు. ఇటీవల హాలీవుడ్ నన్ను చాలా నిరాశపరిచింది. పాత సినిమాలు చాలా గొప్పగా ఉంటాయి. ది షావ్‌శాంక్ రిడంప్షన్, ది యూజువల్ సస్పెక్ట్స్, ఎ బ్యూటిఫుల్ మైండ్, యాస్ గుడ్ యాజ్ ఇట్ గెట్స్ వంటి పాత సినిమాలు... చాలా కాలం పాటు మనతోనే ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఏ సినిమా కూడా నాపై అంతటి ప్రభావాన్ని చూపలేదు. నేను జోకర్ సినిమా చూశాను. పాశ్చాత్యుల అభిరుచికి తగ్గ సినిమా అని భావించాను. కానీ జోకర్ 2 భయంకరంగా ఉంది. ఆ సినిమా యోగ్యత ఏమిటో అర్థం కాలేదు.. క్షమించండి! అని మ్యాడీ అన్నారు.
తనకు `ఓపెన్‌హైమర్` కూడా నచ్చలేదని మాధవన్ అన్నారు. ఒక వ్యక్తి అణు బాంబును రూపొందించాడు. అది ఒక్క క్షణంలో చరిత్ర చూసిన దానికంటే ఎక్కువ మందిని చంపింది. అణుబాంబ్ ప్రయోగించిన ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా మనుగడలో ఉన్న ఒక జాతిని, సంస్కృతిని నాశనం చేసింది. దానిని కనిపెట్టిన వ్యక్తిపై దాని ప్రభావాన్ని తెరపై చూపించలేదు... అది చాలా ముఖ్యమైనది.. అని అభిప్రాయపడ్డారు.
ఆ వార్త విన్న ఉదయం ఓపెన్‌హీమర్ ఎలా ఫీలయ్యాడో చూడాలనుకున్నాను.. అతడు బయటకు వచ్చి తన వార్తాపత్రికను తీసుకుని, తన పొరుగువారు అతడిని విలన్‌లా చూస్తున్నారా? లేక అతడు సంతోషంగా ఉన్నాడా? లేదా తనను రాక్షసుడిగా చూస్తున్నాడా? ఇలాంటి భావోద్వేగ అంశాలను వారు చూపించలేదు. భావోద్వేగాల విషయంలో పాశ్చాత్యులు సుఖంగా ఉండకపోవచ్చు లేదా బహుశా వారు దానిని చిత్రీకరించలేకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. గాంధీపై సినిమా తీసినప్పుడు ఆయన మనకు స్వేచ్ఛను ఎలా సాధించాడో వదిలేస్తే ఏమవుతుందో ఊహించండి.. అని కూడా మాధవన్ అన్నారు. మ్యాడీ నటించిన తాజా చిత్రం `హిజాబ్ బరాబర్` ప్రస్తుతం జీ5లో ప్రసారం అవుతోంది.