'పుష్ప 2' సినిమాపై సూపర్ స్టార్ పోస్ట్ పెట్టలేదేంటి?
ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' గురించి కానీ, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఇండస్ట్రీ నుండి ఎవరూ స్పందించడం లేదనే చర్చలు జరుగుతున్న తరుణంలో.. మహేష్ బాబు ఈ సినిమాపై ఎక్స్ లో పోస్ట్ పెట్టాలని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
'పుష్ప 2' హవా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించం లేదు. వీక్ డేస్ లోనూ భారీ వసూళ్లను రాబడుతూ, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 5 రోజుల్లోనే ₹922 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ఈరోజుతో ₹1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి, అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం ఒక్క హిందీలోనే ₹350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం. నార్త్ అమెరికాలో ఇప్పటికే $10 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్నా, బాక్సాఫీస్ దగ్గర ప్రభంజన సృష్టిస్తున్నా ఇప్పటిదాకా సెలబ్రిటీలు ఎవరూ ఈ సినిమాని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టలేదు.
టాలీవుడ్ లో ఏదైనా సినిమా హిట్టయినప్పుడు హీరోలంతా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం మనం చూస్తుంటాం. ఈ ఏడాది 1000 కోట్ల క్లబ్ లో చేరిన 'కల్కి 2898 ఏడీ' సినిమాపై దాదాపు సినీ ప్రముఖులంతా ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళిందంటూ కొనియాడారు. కానీ ''పుష్ప 2: ది రూల్'' మూవీ పాన్ ఇండియాని రూల్ చేస్తున్నా, ఎందుకనో హీరోలెవరూ పెద్దగా స్పందించలేదు.
'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 'పుష్ప 1' చిత్రానికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నట్లే, సీక్వెల్ కు కూడా బన్నీ అవార్డు సాధిస్తారని ఆడియన్స్ భావిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు ఆయన నటనను మెచ్చుకుంటున్నారు. ఇంకా సినిమా చూడలేదో, చూసి కూడా సైలెంట్ గా ఉన్నారో తెలియదు కానీ.. సెలబ్రిటీలు ఎవరూ దీనిపై స్పందించలేదు. రిలీజ్ కు ముందు బెస్ట్ విషెస్ అందజేసిన హీరోలు సైతం సినిమా రిలీజ్ తర్వాత మౌనం వహించడంపై ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదైనా సినిమా నచ్చితే వెంటనే సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు. కంటెంట్ బాగుంటే, చిన్న సినిమాలను సైతం మెచ్చుకుంటూ ఎక్స్ లో రివ్యూలు పోస్ట్ చేస్తుంటారు. తనకు నచ్చితే చాలు, కొన్నిసార్లు యావరేజ్ సినిమాలను కూడా పెద్దగా పొగుడుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతారు. ఇప్పుడు "పుష్ప 2: ది రూల్" సినిమా చూసి మహేష్ రివ్యూ ఇస్తారని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు.
'పుష్ప' ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు మహేష్ బాబు సినిమా చూసి ట్వీట్ చేశారు. "పుష్ప పాత్రలో అల్లు అర్జున్ స్టన్నింగ్, సెన్సేషనల్, ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సుకుమార్ తన సినిమా రా అండ్ రస్టిక్ గా నిజాయితీతో కూడినదని మళ్లీ నిరూపించాడు. దేవిశ్రీ ప్రసాద్.. నువ్వొక రాక్ స్టార్. మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ మొత్తానికి అభినందనలు. ప్రౌడ్ ఆఫ్ యూ గైస్" అని మహేష్ పోస్ట్ చేశారు. దీనికి బన్నీతో సహా చిత్ర బృందం అంతా స్పందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలిపారు.
నిజానికి సుకుమార్ ముందుగా 'పుష్ప' సబ్జెక్ట్ ను మహేష్ బాబు వద్దకు తీసుకెళ్ళాడు. ఇద్దరూ కలిసి వర్క్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆ ప్రాజెక్ట్ ను మహేష్ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమా చేయడం జరిగింది. అలానే 'అల వైకుంఠపురములో' 'సరిలేరు నీకెవ్వరూ' ఒకేసారి రిలీజ్ అయినప్పుడు బన్నీ, మహేష్ ల మధ్య ఆధిపత్య పోరు ఉన్నట్లుగా ఫ్యాన్ వార్స్ జరిగాయి. అయినా సరే ఇవేమీ పట్టించుకోకుండా 'పుష్ప 1' సినిమా గురించి మహేశ్ ట్వీట్ చేశారు.
ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' గురించి కానీ, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఇండస్ట్రీ నుండి ఎవరూ స్పందించడం లేదనే చర్చలు జరుగుతున్న తరుణంలో.. మహేష్ బాబు ఈ సినిమాపై ఎక్స్ లో పోస్ట్ పెట్టాలని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న మహేష్.. తీరిక చూసుకొని 'పుష్ప 2' మూవీ చూసి బన్నీ పెర్ఫార్మెన్స్‌ని మెచ్చుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.