3 నెలల్లో ₹500+ కోట్ల కలెక్షన్స్!
ఇప్పుడు మలయాళ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాలు
ఇప్పుడు మలయాళ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాలు, భారీ వసూళ్లు రాబడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మాస్ యాక్షన్ సినిమాలే కాదు, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా వందల కోట్లు రాబట్టగలవని నిరూపిస్తున్నాయి. గడిచిన మూడు నెలల కాలంలో మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి నాలుగు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా అవి సాధించిన కలెక్షన్లన్నీ కలిపి ₹500+ కోట్లకు పైనే ఉండటం విశేషం.
సీనియర్ మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ''భ్రమయుగం''. 'ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్' అనే ట్యాగ్ లైన్ తో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడిన విభిన్నమైన హారర్ థ్రిల్లర్ ఇది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 15న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులని సరికొత్త అనుభూతిని పంచిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు అందుకుంది. కేవలం రూ. 27 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం, దాదాపు ₹85 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. తెలుగులో ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేసింది.
కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీసు దగ్గర రూ. 135 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన మలయాళీ చిత్రం "ప్రేమలు". మమితా బైజూ, నస్లెన్ కె.గఫూర్, మ్యాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో గిరీశ్ ఎ.డి. ఈ సినిమాని తెరకెక్కించారు. ఫిబ్రవరి 9న మలయాళంలో రిలీజైన ఈ మూవీ, మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న తెలుగులోనూ విడుదలైంది. హైదరాబాద్ నేపథ్యంలో తీసిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ యూత్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగులో ఆల్ టైం హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది. ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.
మాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ చెరిపేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సినిమా ''మంజుమ్మెల్ బాయ్స్''. కేవలం ₹ 20 కోట్లతో రూపొందిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. బాక్సాఫీసు వద్ద ₹230 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 200+ కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్న మొట్టమొదటి మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించింది. వాస్తవ సంఘటన స్ఫూర్తితో చిదంబరం ఎస్ పొడువల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిన్న శనివారం (ఏప్రిల్ 6) తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ డ్రామా 'ది గోట్ లైఫ్'. పూర్తిగా ఎడారిలో తీసిన తొలి భారతీయ సినిమా ఇది. 'ఆడు జీవితం' పేరుతో మార్చి 28న పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అందించారు. వాస్తవ ఘటనల ఆధారంగా బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ.. బాక్సాఫీసు దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇలా మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి 2024లో గడిచిన మూడు నెలల్లో వచ్చిన 4 బ్లాక్ బస్టర్ సినిమాలు, ప్రపంచ వ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్నాయి. ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిన సినిమాలు కాదు. కథా కథనాలను నమ్ముకొని, చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన కంటెంట్ బేస్డ్ మూవీస్. వాటిల్లో రెండు సినిమాల్లో స్టార్ హీరోలు లేరు.. గ్లామర్ వడ్డించే హీరోయిన్లు అసలే లేరు. అయినా సరే కనీవినీ ఎరగని విజయాలు అందుకున్నాయి. నిర్మాతలకి భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. మరి రానున్న రోజుల్లో మన టాలీవుడ్ మేకర్స్ కూడా అలాంటి సినిమాలు చేసి హిట్లు కొడతారేమో చూడాలి.