మమతా కులకర్ణి అగ్గిమీద గుగ్గిలం.. దేనికో తెలుసా?
మతపరమైన సంస్థలో ఉద్రిక్తతలను పేర్కొంటూ కిన్నార్ అఖాడా కులకర్ణి తో పాటు, ఆమె గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా బహిష్కరించింది.
తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ధృవీకరించడానికి తనకు ఇకపై మహామండలేశ్వర్ బిరుదు అవసరం లేదని మమతా కులకర్ణి వ్యాఖ్యానించారు. తన పదవిని మర్యాదగా వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల కిన్నార్ అఖాడా ద్వారా మహామండలేశ్వర్‌గా నియమితులైన మాజీ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి, కొన్ని అంతర్గత సంఘర్షణలు, సమస్యల కారణంగా ఆ పాత్ర (పదవి) నుండి వైదొలిగారు. సినీపరిశ్రమలో మమతా కులకర్ణి బోల్డ్ గ్లామరస్ ప్రయాణం, కోట్లాది రూపాయల స్కామ్ లో మమతా కులకర్ణి పేరు ముడిపడి ఉందని విమర్శలు రావడంతో కిన్నార్ మండలేశ్వర్ పదవిని కట్టబెట్టిన వారికి అది సమస్యగా మారింది. దీంతో వారు మమతాను ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా కోరారు. మతపరమైన సంస్థలో ఉద్రిక్తతలను పేర్కొంటూ కిన్నార్ అఖాడా కులకర్ణి తో పాటు, ఆమె గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా బహిష్కరించింది.
అఖాడా నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఇప్పుడు దానికి రాజీనామా చేసిన మమతా కులకర్ణి సంస్థాగతంగా అంతర్గత సమస్యలపై దుమ్మెత్తిపోసారు. రాజీనామా అనంతరం, ఘాటైన వివరణ ఇస్తూ మమతా కొన్ని వ్యాఖ్యలు చేసారు. నాకు లభించిన గౌరవం నా 25 సంవత్సరాల తపస్సుకు దక్కింది.. కానీ కొంతమందికి నేను మహామండలేశ్వర్ కావడంలో సమస్య ఉంది.. అని ఫైరయ్యారు. బాలీవుడ్‌లో తన గతాన్ని గుర్తు చేస్తూ తీర్పు చెప్పడంపై మమతా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. నేను 25 సంవత్సరాల క్రితం బాలీవుడ్‌ను విడిచిపెట్టి ఒంటరిగా అదృశ్యమయ్యాను. లేకపోతే మేకప్ -గ్లామర్‌కు ఎవరు దూరంగా ఉంటారు? అని ఆమె ప్రశ్నించారు. మమతా కులకర్ణి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో స్వచ్ఛత ప్రామాణికతను గుర్తు చేసే ప్రయత్నం చేసారు. తనను విమర్శించే వారి నుండి ధ్రువీకరణ కోరాల్సిన అవసరం లేదని అన్నారు. ``నా గురువు శ్రీ చైతన్య గగన్‌గిరి మహారాజ్ ఒక సిద్ధ మహాపురుషుడు. నేను ఆయనతో 25 సంవత్సరాలు తపస్సు చేసాను. నేను కైలాసం, మానసరోవర్ లేదా హిమాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని ప్రపంచాలు ఇప్పటికే నా ముందు ఉన్నాయి`` అని వ్యాఖ్యానించారు.
అఖాడలో అహంకార రాజకీయాలను మమతా ఈ సందర్భంగా ప్రశ్నించారు. ``ఈ వ్యక్తులు అహంకారపూరితులు.. బ్రహ్మ విద్య నుండి డిస్‌కనెక్ట్ అయ్యారు. వారు తమలో తాము కుమ్ములాడుకుంటున్నారు. నిజమైన జ్ఞానం గురించి ఎటువంటి అవగాహన వారికి లేదు`` అని విమర్శించారు. మమతా కులకర్ణి తన నియామకం చుట్టూ ఉత్పన్నమైన ఆర్థిక వివాదాలను కూడా ప్రస్తావించారు. నన్ను రెండు లక్షలు అడిగినప్పుడు ఆ డబ్బు నా దగ్గర లేదు. జై అంబగిరి మహామండలేశ్వర్ దానిని తన జేబులో నుండి ఇచ్చాడు. నా దగ్గరకి ధనం భౌతిక ప్రయోజనాల నుండి కాదు.. కఠోర తపస్సు నుండి వచ్చింది.. అని వ్యాఖ్యానించారు. జ్ఞానాన్ని షేర్ చేసుకునేందుకు ఈ పోస్ట్ ఒక సర్టిఫికేట్, కానీ నేను దూరంగా వెళ్లాలని ఇది ఒక సంకేతం అని కూడా మమతా అన్నారు.