మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో సాయి ప‌ల్ల‌వి?

తాజా ఈవెంట్లో మణిర‌త్నం చేసిన ఓ వ్యాఖ్య ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-10-21 10:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ట్యాలెంటెడ్ సాయిప‌ల్ల‌వి న‌టించ‌నుందా? అంటే అవున‌నే సంకేతం అందింది. తాజా ఈవెంట్లో మణిర‌త్నం చేసిన ఓ వ్యాఖ్య ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్య‌ల‌కు సాయిప‌ల్ల‌వి త‌న ఆనందం వ్య‌క్తం చేసింది. వివ‌రాల్లోకి వెళితే...

మ‌ల‌యాళంలో 'ప్రేమమ్' (2015) బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సాయి పల్లవి కెరీర్ జ‌ర్నీ ఎలా సాగిందో గురించి తెలిసిందే. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌ల్లో క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగింది. ప్రేమ‌మ్‌ కేరళలోనే కాకుండా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోను గొప్ప విజ‌యం సాధించింది. సాయి పల్లవి తమిళ సంతతికి చెందిన అమ్మాయి అయినా తమిళంలో దియా (2018) చిత్రంతో అరంగేట్రం చేయడానికి ముందు మరో మలయాళ చిత్రం (కాళి), రెండు తెలుగు చిత్రాలు (ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి) చేసింది. అయితే దర్శకుడు మణిరత్నం ఆమెను తన 2017 చిత్రం `కాట్రు వెలియిడై`తో తమిళంలో లాంచ్ చేయాలనుకున్నారు.

కానీ సాయిప‌ల్ల‌వికి ఆ ల‌క్ చిక్క‌లేదు. ఆ పాత్రను అదితి రావ్ హైదరీ పోషించింది. యాధృచ్ఛికంగా.. శివకార్తికేయన్ -సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన `అమరన్` ఆడియో ఆవిష్కరణకు మణిరత్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదిక‌పై ``నేను సాయిప‌ల్ల‌వికి పెద్ద అభిమానిని. ఏదో ఒక రోజు మీతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను`` అని మణిరత్నం అన్నారు. ఈ ప్రశంసలపై సాయి పల్లవి స్పందిస్తూ.. తన సినిమాల ఎంపికకు దర్శకనిర్మాతల ప్రాధాన్య‌త‌ ఎలా ఉంటుందో మాట్లాడింది. సినిమాల్లోకి రాకముందు నాకు మణిరత్నం గారు తప్ప చాలా మంది దర్శకుల పేర్లు తెలియదు. నిజానికి, నేను స్క్రిప్ట్‌లు, పాత్రలను ఎంచుకోవడానికి ఆయ‌న (మ‌ణిర‌త్నం) ఒక కారణం అని అంది.

దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌లో టైటిల్ పాత్రను పోషిస్తున్న శివకార్తికేయన్ గురించి మ‌ణిర‌త్నం ఈ వేదిక‌పై మాట్లాడారు. కొందరు నటీనటులు అరంగేట్రం చేసిన వెంటనే పెద్ద హీరోలు అవుతారు. మరికొందరు అంచెలంచెలుగా విజయాల మెట్లు ఎక్కాలి. ఆ ముందు, మీరు కూడా నాలాగే...! అని శివ‌కార్తికేయ‌న్ ని ప్ర‌శంసించారు.

కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ - సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ సంయుక్తంగా అమ‌ర‌న్ ని నిర్మించ‌గా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అమరన్ ఈ దీపావళికి విడుద‌ల కానుంది. జయం రవి `బ్రదర్`, కవిన్ `బ్లడీ బిచ్చగాడు` వంటి చిత్రాలతో పాటుగా అమ‌ర‌న్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News