మలయాళ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. తెలుగులో ఎప్పుడంటే?

2024 ఏప్రిల్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Update: 2024-03-26 14:48 GMT

మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్'. ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు అందుకున్న చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. అలాంటి సెన్సేషనల్ మూవీని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

 

2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన నుండి ప్రేరణ పొంది తీసిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ 'మంజుమ్మెల్ బాయ్స్'. టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ ను థియేటర్లలోకి తీసుకురాబోతోంది. 2024 ఏప్రిల్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

చిదంబరం ఎస్ పొడువల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రంలో.. సౌబిన్ షాహిర్, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్, దీపక్, అర్జున్ కురియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పరవ ఫిలింస్ బ్యానర్‌ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు.

'మంజుమ్మేల్‌ బాయ్స్‌' మూవీ తెలుగులోనూ అదే టైటిల్‌తో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు వెర్షన్‌కు మద్దతు ఇవ్వడంతో, రెండు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అవ్వడానికి ఆస్కారం లభించింది. ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతం సమకూర్చారు. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. వివేక్ హర్షన్ ఎడిటర్ గా వ్యవహరించారు.

కథేంటంటే.. 2006లో కేరళకు చెందిన కొంతమంది స్నేహితుల బృందం తమిళనాడు కొడైకెనాల్ లోని నిషేధిత ప్రాంతమైన గుణ గుహలకు టూర్ కు వెళ్తారు. వారిలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. స్నేహితుడిని కాపాడుకోవడం కోసం మిగతా ఫ్రెండ్స్ చేసిన ప్రయత్నాలే ఈ సినిమా. పోలీసులు సైతం చేతులెత్తిన ఈ ఘటనలో తమ స్నేహితుడిని రక్షించుకోడానికి ఎర్నాకులం మంజుమ్మాళ్ బాయ్స్ ఏం చేసారు? ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? చివరకు అతన్ని కాపాడుకున్నారా లేదా? అనేది తెలియాలంటే 'మంజుమ్మేల్‌ బాయ్స్‌' మూవీ చూడాల్సిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాకి తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.

Tags:    

Similar News