మలయాళ సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులో మెప్పించేనా?

డబ్బింగ్ వెర్షన్ ను మార్చ్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Update: 2024-03-04 09:14 GMT

ఇటీవల కాలంలో మళయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో 'మంజుమ్మెల్ బాయ్స్' ఒకటి. చిదంబరం ఎస్ పొడువల్ ఈ సర్వైవల్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, రూ. 100 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతూ, మాలీవుడ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అలాంటి చిత్రాన్ని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డబ్బింగ్ వెర్షన్ ను మార్చ్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'మంజుమ్మెల్ బాయ్స్' అనేది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్. 2006లో కేరళకు చెందిన పది మంది స్నేహితుల బృందం తమిళనాడు కొడైకెనాల్ లోని నిషేధిత ప్రాంతమైన గుణ గుహలకు టూర్ కు వెళ్తారు. ప్రమాదవశాత్తు వారిలో ఒక వ్యక్తి లోయలో పడిపోతాడు. అతన్ని కాపాడుకోవడం కోసం మిగతా ఫ్రెండ్స్ చేసిన ప్రయత్నాలే ఈ సినిమా. పోలీసులు సైతం చేతులెత్తినా ఈ ఘటనలో తమ స్నేహితుడిని రక్షించుకోడానికి వాళ్ళు ఏం చేసారు? ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరకు అతన్ని కాపాడుకున్నారా లేదా? అనేది ఈ చిత్రంలో చూపించారు.

కమల్ హాసన్ నటించిన 'గుణ' మూవీని చిత్రీకరించిన తర్వాత డెవిల్స్ కిచెన్ గుహలకు 'గుణ కేవ్స్' అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని ప్రమాదాలు జరగడంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని నిషేధించింది. గతంలో ఆ లోయలో పడిపోయిన వారెవరూ తిరిగి రాలేదు. అలాంటి ప్రదేశానికి వెళ్లిన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకరు లోయలో పడిపోతే, మిగిలిన స్నేహితులు అతన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశారనేది 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమాలో ఎంతో ఉత్కంఠకు గురి చేసేలా చూపించారు. ఇది ఆనందం నుంచి బాధ వరకు విభిన్నమైన భావోద్వేగాలను స్పృశిస్తుంది. ఈ అంశాలే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకులకు సరికొత్త అనుభూతుని పంచుతున్నాయి.

'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా మొత్తం చాలా సహజంగా ఉంటుంది. ఫ్రెండ్ షిప్ గురించి, సర్వైవల్ గురించి తెలియజేస్తుంది. ఆశ, ధైర్యం, మానవ స్ఫూర్తి వంటి అంశాలను రేకెత్తిస్తుంది. కథగా చెప్పుకుంటే మాములుగా అనిపించవచ్చు కానీ, దర్శకుడు చిదంబరం తన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను దాదాపు రెండున్నర గంటల పాటు నిమగ్నమై ఉంచడంలో సక్సెస్ అయ్యారు. మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను, వాటి వల్ల కలిగే భావోద్వేగాలను ఈ చిత్రంలో అందంగా చిత్రీకరించారు. ప్రతీ సన్నివేశాన్ని నేచురల్ గా ఉండేలా డిజైన్ చేయడంతో, ఎక్కడ కూడా సినిమా చూస్తున్న ఫీలింగ్ రాకుండా.. నిజంగానే మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ అంశాలే ఆడియన్స్ ను ఈ సినిమాకు ఈజీగా కనెక్ట్ చేస్తున్నాయని చెప్పాలి.

స్నేహితుల గ్యాంగ్ గుహలలోకి ప్రవేశించిన తర్వాత ఈ సినిమా ఆసక్తికరంగా మారుతుంది. అక్కడి నుంచి చివరి వరకూ ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇందులో శోభున్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్, దీపక్, అర్జున్ కురియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీరంతా తమ పాత్రల్లో మంచి నటన కనబరిచారు. కీలక పాత్ర పోషించిన శోభున్ షాహిర్ ఒక నిర్మాతగానూ వ్యవహరించడం గమనార్హం.

'మంజుమ్మెల్ బాయ్స్' మలయాళ సినిమా అయినప్పటికీ కథంతా కొడైకెనాల్ లో జరుగుతుంది. దీనికి తోడు 'గుణ' చిత్రంలోని ఇళయరాజా స్వరపరిచిన “ప్రియతమా నీవచత కుశలమా” పాటను టైటిల్ కార్డ్స్ లో, క్లైమాక్స్‌లో ఉపయోగించిన విధానం ఆకట్టుకుంటుంది. అందుకే తమిళ్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఓన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ అంశాలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ ఈ మధ్య కాలంలో తెలుగులో ఇలాంటి సర్వైవల్ థ్రిలర్స్ రాలేదు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News