'మా ఊరి పొలిమేర-2' మూవీ రివ్యూ

Update: 2023-11-03 10:27 GMT

'మా ఊరి పొలిమేర-2' మూవీ రివ్యూ

నటీనటులు: సత్యం రాజేష్-కామాక్షి భాస్కర్ల-బాలాదిత్య-రాకేందుమౌళి-గెటప్ శీను-సాహితి దాసరి తదితరులు

సంగీతం: జ్ఞాని

ఛాయాగ్రహణం: కుషేందర్ రమేష్ రెడ్డి

నిర్మాత: గౌర్ కృష్ణ

రచన-దర్శకత్వం: అనిల్ విశ్వనాథ్

రెండేళ్ల కిందట హాట్ స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న సినిమా 'మా ఊరి పొలిమేర'. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. 'మా ఊరి పొలిమేర' తీసిన అనిల్ విశ్వనాథే.. ఆ కథకు కొనసాగింపుగా చేసిన 'మా ఊరి పొలిమేర-2' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

జాస్తి పల్లిలో ఆటో డ్రైవర్ గా పని చేసుకుంటూ.. ఇంకోవైపు చేతబడులు చేసే కొమిరి (సత్యం రాజేష్).. కొందరి చావుకు కారణమవుతాడు. చివరికి తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించి.. భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి తన ప్రేయసి కవితతో కలిసి కేరళకు వెళ్లిపోతాడు. అతణ్ని వెతుక్కుంటూ వెళ్లిన తమ్ముడు జంగయ్య (బాలాదిత్య) కనిపించకుండా పోతాడు. ఈలోపు కొమిరి భార్య-కొడుకు ఊర్లో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇంతలో జాస్తిపల్లికి వచ్చిన కొత్త ఎస్ఐ రవీంద్ర నాయక్ (రాకేందుమౌళి).. కొమిరితో పాటు జంగయ్యల గురించి ఆరా తీయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే అతడికి కొమిరి కేరళలో ఉన్న సంగతి తెలుస్తుంది. ఈ కేసును ఛేదిస్తూ వెళ్లిన అతడికి కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి.. కొమిరి చేసే క్షుద్రపూజలకు జాస్తిపల్లి పొలిమేరలో ఉండే పురాతన గుడికి సంబంధం ఉన్నట్లు కూడా తేలుతుంది. మరి ఆ సంబంధమేంటి.. కొమిరి లక్ష్యమేంటి.. అది సాధించే క్రమంలో అతడికి ఎదురైన పరిణామాలేంటి అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

సత్యం రాజేష్ హీరో.. మిగతా నటీనటులూ అంతగా పేరు లేని వాళ్లే.. పెద్దగా బడ్జెట్ ఏమీ లేకుండా ఒక పల్లెటూరిలో షూటింగ్.. సాధారణమైన ప్రొడక్షన్ వాల్యూస్.. భరించలేని కొన్ని బూతులు.. అలాగే కొన్ని అభ్యంతకర సన్నివేశాలు.. ఇలాంటి నేపథ్యంలో ఓ సినిమా ప్రేక్షకాదరణకు నోచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. రెండేళ్ల కిందట హాట్ స్టార్ ఓటీటీలో పెద్దగా సౌండ్ లేకుండా రిలీజైన 'మా ఊరి పొలిమేర' నెమ్మదిగా ప్రేక్షకాదరణ పెంచుకుని అందులో మోస్ట్ వ్యూడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. పైన చెప్పుకున్న ప్రతికూలతల్ని దాటి ఆ సినిమా అంతలా ఆదరణ పొందడానికి ప్రధాన కారణం.. అందులో ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా సాగే కథ.. అందులోని ట్విస్టులే. ఒక దశ వరకు మామూలుగానే అనిపించే సినిమా.. చివర్లో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తుంది. ముగింపులో సెకండ్ పార్ట్ దిశగా ఇచ్చిన హింట్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. అప్పట్నుంచో సాగుతున్న ఎదురు చూపులకు ఇప్పుడు 'మా ఊరి పొలిమేర-2'తో తెరపడింది. ఫస్ట్ పార్ట్ కు ఏదైతే సెల్లింగ్ పాయింట్ అయిందో.. దాన్నే ఇందులో నమ్ముకున్నాడు రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్. ట్విస్టుల మీద ట్విస్టులిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడమే లక్ష్యంగా సాగుతుంది 'మా ఊరి పొలిమేర-2'. కాకపోతే ఈ క్రమంలో లాజిక్ కొండెక్కేయడం.. కొన్ని సీన్లు జీర్ణించుకోలేని విధంగా ఉండటం మైనస్ అయింది.

'మా ఊరి పొలిమేర'కైనా.. ఇప్పుడొచ్చిన రెండో భాగంలో అయినా.. కథ పరంగా జీర్ణించుకోలేని విషయాలు చాలా కనిపిస్తాయి. ఈ రోజుల్లో చేతబడులు.. క్షుద్రపూజలు.. నరబలులు లాంటి విషయాలను తెర మీద చూపిస్తే చాలా ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఒకట్రెండు సీన్లలో ఈ సన్నివేశాలు చూడటమే ఏదోలా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా అంతా ఆ విషయాల చుట్టూనే తిరుగుతుంది. దేవుళ్లు-దయ్యాల కథల్లో మాదిరి పూర్తిగా ఫిక్షన్.. ఫాంటసీతో కథను నడిపిస్తే అది వేరే విషయం. కానీ ఇందులో అలా ఉండదు. ప్రస్తుత సమాజంలో ఇవన్నీ జరుగుతున్నట్లుగా చూపించడమే విడ్డూరంగా అనిపిస్తుంది. అందుకే ఆలోచనల పరంగా ప్రేక్షకులను వెనక్కి తీసుకెళ్లే సినిమాలా కనిపిస్తుంది. కాబట్టి 'మా ఊరి పొలిమేర-2' చూడాలనుకునేవారు.. 'మా ఊరి పొలిమేర' కాస్త చూసి ఓకే అనుకున్నాకే థియేటర్లలోకి అడుగుపెట్టాలి.

పైన చెప్పుకున్న అభ్యంతరాలన్నీ పక్కన పెట్టి థ్రిల్ అవడం కోసమే 'మా ఊరి పొలిమేర-2' చూడాలనుకుంటే.. ఇది ఆకట్టుకునే సినిమానే. ఫస్ట్ పార్ట్ ను మించి ఇందులో బోలెడన్ని ట్విస్టులున్నాయి. ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం.. ప్రతి విషయంలో రెండో కోణం చూపించడమే లక్ష్యంగా ఇందులో కథనం నడుస్తుంది. ఆరంభ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా అనిపించినా.. కొమిరి పాత్ర రంగప్రవేశం చేశాక అసలేం జరిగిందో చెప్పడం మొదలయ్యాక వచ్చే ఒక్కో మలుపు ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తుంది. ఒక వెర్షన్ చూసి సర్ప్రైజ్ అయిన ప్రేక్షకులు.. తర్వాత ఇంకో వెర్షన్ తెలుసుకుని షాకవుతారు. క్షుద్రపూజల చుట్టూ కథ కావడంతో దర్శకుడి ఊహలకు హద్దే లేకుండా పోయింది. ఒక తాయిత్తు కట్టినంత మాత్రాన ఒక మనిషి అనుకుని ఇంకో మనిషిని తీసుకెళ్లిపోవడం.. ఆ మనిషితోనే జీవనం సాగించడం విడ్డూరంగా అనిపిస్తుంది. అలాగే తనెంతో ఇష్టంగా పెంచుకున్న అమ్మాయి చనిపోతుందని తెలిసి కూడా ఆమెను పెంచిన వ్యక్తి తనే ఒక చోటికి పంపించడం లాంటి సీన్లు కూడా లాజికల్ గా అనిపించవు. ఇక తనను ఎంతో ప్రేమించిన మనిషిని చంపి.. ఆ రక్తాన్ని తాగుతూ పూజలు చేసే తరహా సీన్లు చూసి జీర్ణించుకోవడం చాలా కష్టమే. కానీ ఈ 'మా ఊరి పొలిమేర' కథా వస్తువే అదో టైపు కాబట్టి.. ఇలాంటివన్నీ సర్దుకోవాలి. ఇలా ఎన్ని అభ్యంతరాలున్నప్పటికీ.. కథ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు మాత్రం సాగదు. రెగులర్ ఇంటర్వెల్స్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతాయి. ఒక ప్రశ్న తలెత్తడం.. దానికి జవాబు రావడం.. ఇంతలోనే కొత్త ప్రశ్నలు రేకెత్తడం.. మళ్లీ వాటికి జవాబు తెలుసుకోవాలన్న ఆసక్తి కలగడం.. ఇలా చివరి వరకు మంచి టెంపోతోనే సాగుతుంది 'మా ఊరి పొలిమేర-2'. చివరికి ఈ కథకు కూడా ఒక ముగింపు ఇవ్వకుండా.. మూడో పార్టుకి హింట్ ఇచ్చి వదిలి పెట్టారు. 'పొలిమేర-1' చూసి అన్నింటికీ ప్రిపేరైన వాళ్లకు ఇది కూడా ఓకే అనిపిస్తుంది. లాజిక్కులు పక్కన పెట్టి ట్విస్టుల కోసం చూస్తే ఇది ఎంగేజ్ చేస్తుంది.

నటీనటులు:

సత్యం రాజేష్ కొమిరి పాత్రలో మెప్పించాడు. ఫస్ట్ పార్ట్ ను మించి ఇందులో సినిమాను తన భుజాల మీద మోశాడు. ఫస్ట్ పార్ట్ చూసినపుడు తన పాత్ర ఒకలా అనిపిస్తుంది. సెకండ్ పార్ట్ లో ఇంకోలా నడుస్తుంది. నెగెటివ్ షేడ్స్ ను అతను బాగా క్యారీ చేశాడు. కామాక్షి భాస్కర్ల పాత్ర చాలా వరకు నామమాత్రంగా అనిపిస్తుంది కానీ.. చివర్లో తన పాత్ర ప్రత్యేకతను చాటుకుంటుంది. కథలో కీలకమైన ఆ సన్నివేశాల్లో తన పాత్రకు దక్కిన ఎలివేషన్.. ఆమె నటన ఆకట్టుకుంటాయి. కథలోకి కొత్తగా ఎంటరైన ఎస్ఐ క్యారెక్టర్లో రాకేందుమౌళి బాగానే చేశాడు. రాజేష్ పెదనాన్న పాత్రలో కనిపించిన నటుడు కూడా మెప్పించాడు. గెటప్ శీను.. మిగతా నటీనటులంతా ఓకే. బాలాదిత్యకు ఇందులో పెద్దగా స్కోప్ లేదు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'మా ఊరి పొలిమేర' జస్ట్ ఓకే అనిపిస్తుంది. జ్ఞాని నేపథ్య సంగీతం కొన్ని సీన్లలో ఉత్కంఠను పెంచడంలో ఉపయోగపడింది. పాటలకు ఇందులో ప్రాధాన్యం లేదు. ఉన్న ఒకట్రెండు పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కెమెరామన్ కుషేందర్ రమేష్ రెడ్డి విజువల్స్ కథకు తగ్గట్లుగా సాగిపోయాయి. నిర్మాణ విలువలు ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే చాలా మెరుగయ్యాయి. అయినా సరే.. కొన్నిచోట్ల రాజీ కనిపిస్తుంది. ఇక రచయిత-దర్శకుడు అనిల్ విశ్వనాథ్ పనితనమంతా కథను రకరకాల మలుపులు తిప్పడంలో కనిపిస్తుంది. ఈ విషయంలో అతను కొంచెం ఓవర్ ద టాప్ వెళ్లిపోయాడని కూడా అనిపిస్తుంది. ఐతే ప్రేక్షకులను అతను థ్రిల్ చేయడంలో విజయవంతం అయ్యాడు. 'మా ఊరి పొలిమేర' చూసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులనే అతను టార్గెట్ చేసుకున్నాడు. మిగతా ప్రేక్షకులను అనిల్ ఎంతమేర మెప్పిస్తాడన్నది సందేహమే.

చివరగా: మా ఊరి పొలిమేర-2.. ట్విస్టుల డబుల్ డోస్

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

Tags:    

Similar News