మూవీ రివ్యూ : మార్కో
'జనతా గ్యారేజ్'.. 'భాగమతి'.. లాంటి తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న మలయాళ నటుడు ఉన్ని ముకుందన్.. తన మాతృభాషలో హీరోగా నటించిన సినిమా.. మార్కో. అక్కడ బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'మార్కో' మూవీ రివ్యూ
నటీనటులు: ఉన్ని ముకుందన్-యుక్తి తరేజా-సిద్ధిఖ్-జగదీష్-అభిమన్యు తిలకన్-కబీర్ సింగ్ దుల్హన్-ఇషాన్ షౌకత్-అన్సాన్ పాల్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్
ఛాయాగ్రహణం: చంద్రు సెల్వరాజ్
నిర్మాత: షరీఫ్ మహ్మద్
రచన-దర్శకత్వం: హనీఫ్ అదేని
'జనతా గ్యారేజ్'.. 'భాగమతి'.. లాంటి తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న మలయాళ నటుడు ఉన్ని ముకుందన్.. తన మాతృభాషలో హీరోగా నటించిన సినిమా.. మార్కో. అక్కడ బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
జార్జి (సిద్దిఖ్) ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని నడిపించే డాన్. అతడి భాగస్వాముల్లో ఒకడైన టోనీ ఐజాక్ (జగదీష్)కు తనంటే హడల్. కానీ తన శత్రువులను జార్జితో తెలివిగా చంపించి.. అతడికి మిత్రుడిలాగా మెలుగుతుంటాడు. ఐతే టోనీ కొడుకు రసెల్ ఐజాక్ (అభిమన్యు తిలకన్) చేసిన ఒక హత్యను గుడ్డివాడైన జార్జి తమ్ముడు విక్టర్ (ఇషాన్ షౌకత్) పసిగట్టి ఈ కేసులో సాక్షిగా మారతాడు. రసెల్.. విక్టర్ ను చంపేయడంతో జార్జి కుటుంబం విషాదంలో మునిగిపోతుంది. అప్పుడే వేరే దేశంలో ఉన్న విక్టర్ దత్త సోదరుడు మార్కో (ఉన్ని ముకుందన్) తన ఇంటికి వస్తాడు. తనను ప్రాణంగా ప్రేమించే తమ్ముడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. చివరికి తాను అనుకున్నది సాధిచాడా లేదా అన్నది తెరపై చూడాలి.
కథనం-విశ్లేషణ:
ప్రపంచ స్థాయిలో మోస్ట్ వయొలెంట్ ఫిలిమ్స్ గా 'సా' సిరీస్ ను చెప్పుకుంటుంటాం. సామ్ పెకిన్పా.. క్వింటన్ టొరంటినో.. లాంటి దర్శకులను వరల్డ్ సినిమాలో మోస్ట్ వయొలెంట్ డైరెక్టర్లుగా పేర్కొంటారు. ఇండియన్ సినిమా విషయానికి వస్తే గత ఏడాది వ్యవధిలో ఒకదాన్ని మించిన వయొలెంట్ మూవీ ఇంకొకటి అన్నట్లుగా రెండు సినిమాలొచ్చాయి. అవే.. యానిమల్.. కిల్. 'యానిమల్' సినిమాలో చచ్చే వాళ్ల నంబర్ పెద్దదిగా కనిపిస్తుంది కానీ.. హింసను అత్యంత తీవ్రంగా చూపించిన సినిమాగా 'కిల్' మూవీనే చెప్పుకోవాలి. ఇప్పుడు దాన్ని తలదన్నే సినిమా వచ్చింది. అదే.. మార్కో. ఇండియాస్ మోస్ట్ వయొలెంట్ మూవీ అనే ట్యాగ్ మరో ఆలోచన లేకుండా 'మార్కో'కు ఇచ్చేయొచ్చు. సమీప భవిష్యత్తులో దీన్ని మించిన వయొలెంట్ మూవీ వస్తుందా అన్నది కూడా సందేహమే. ఇందులో హింస మోతాదు అంత ఎక్కువగా.. అంత తీవ్రంగా ఉంటుంది ఇందులో మరి. అంత హింసకు సరిపడా ఎమోషన్ కూడా ఉన్నప్పటికీ ఇందులో సన్నివేశాలను చూసి జీర్ణించుకోవడం మాత్రం అంత తేలిక కాదు. హింసను తెర మీద ఇలా చూపించొచ్చు అనే ఊహ కూడా ఇప్పటిదాకా వచ్చి ఉండకపోవచ్చు అనే స్థాయిలో ఉన్న సన్నివేశాలను చూసి తట్టుకోవాలంటే.. ఆస్వాదించాలంటే చాలా గట్టి గుండె ఉండాలి.
ఇండియన్ సినిమా హీరో విలన్ల గుంపు మీద పడిపోయి పదుల సంఖ్యలో శవాలు లేపడం కొత్తేమీ కాదు. తెరంతా రక్తంతో తడిసిపోవడం చాలాసార్లు చూశాం. కానీ 'మార్కో' చూసే హింస వేరే లెవెల్. హీరోను విలనో.. లేదంటే విలన్ని హీరోనో కత్తితో ఒంటి మీద లెక్కలేనన్ని పోట్లు పొడవడం చూశాం. కానీ శరీరాన్ని చీల్చి గుండెను తీసి చేతిలో పట్టుకోవడం 'మార్కో'లో మాత్రమే చూస్తాం. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ. ఇలాంటి నమ్మశక్యం కాని అత్యంత హింసాత్మక.. ఒళ్లు గగుర్పొడిచే.. ఒకింత జుగుప్సకు కూడా గురి చేసే సన్నివేశాలు 'మార్కో'లో లెక్కలేనన్ని ఉన్నాయి. అవయవాలు తెగిపడడం.. రక్తం చిమ్మడం.. ఒక దశ దాటాక సర్వ సాధారణం అయిపోయి.. ఇంకెంత వయొలెన్స్ చూడాల్సి వస్తుందో అని భయపడే స్థాయికి ఇందులో వయొలెన్స్ డోస్ పెరుగుతూ పోతుంది. ఇంకా ఇంకా వయొలెంటుగా ఏం చూపించగలం అని ఆలోచిస్తూ ప్రతి సన్నివేశం తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. మామూలుగా చాలా వయొలెంటుగా సినిమాలు తీసే దర్శకులు పిల్లల్ని చంపే సన్నివేశాలను తెర మీద చూపించడానికి ఇష్టపడరు. కానీ ఆ సన్నివేశాలను కూడా భయంకరంగా తీసి వదిలేశాడు 'మార్కో' దర్శకుడు హనీఫ్ అదేని. మహిళలను కూడా ఘోరాతి ఘోరంగా హింసించే సన్నివేశాలుంటాయిందులో.
'మార్కో' కథగా చెప్పుకోవడానికి అంత కొత్తదేమీ కాదు. తన సోదరుడిని చంపిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకునే ఓ వ్యక్తి కథ ఇది. ఐతే ఒక్క మరణానికి బదులు తీర్చుకునే క్రమంలో.. ప్రత్యర్థులు చేసే దాడిలో అతడి కుటుంబమంతా ఛిద్రమవుతుంది. చివరికి అంతిమంగా హీరోనే పైచేయి సాధించడం కామన్. ఈ దాడులు.. ప్రతిదాడులే 'మార్కో' సినిమా. ఐతే ఈ దాడులు ఎప్పుడూ చూసే తరహాలో ఉండవు. కొంచెం కొత్తగా.. స్టైలిష్ గా సన్నివేశాలను ప్రెజెంట్ చేయడం ఇందులో ప్రత్యేకత. ఇక వయొలెన్స్ ఎంత పీక్స్ లో ఉంటుందే ఇప్పటికే చెప్పుకున్నాం. 'పుష్ప-2' సినిమా చివర్లో చేతులు కట్టేసిన హీరో అలాగే ప్రత్యర్థుల మీదికి దాడి చేసి నోటితోనే విధ్వంసం చేసే ఎపిసోడ్ ఇందులోనూ ఒకటి ఉంది. అలాగే కొరియన్ కల్ట్ మూవీ 'ఓల్డ్ బాయ్'లో మాబ్ ఫైట్ స్ఫూర్తితోనూ మోస్ట్ వయొలెంట్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి పెట్టారు. యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులు ఊహించని విధంగా సాగుతూ యాక్షన్ ప్రియులను అలరిస్తాయి. అంతకంతకూ పెరిగే వయొలెన్స్.. చచ్చే మనుషులను చూశాక హీరో ఒక ఒక్క చావు విషయంలో రాజీ పడిపోయి ఉంటే ఇంత విధ్వంసం జరిగేది కాదు కదా అనిపిస్తుంది. చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాల గురించి మాటల్లో చెప్పడం కూడా కష్టం. వయొలెన్సుని ఇష్టపడేవారికి కూడా మింగుడు పడని సన్నివేశాలవి. మరీ ఇంత పచ్చిగా.. ఘోరంగా సన్నివేశాలు తీయడం అవసరమా అనిపిస్తుంది. సినిమా చూశాక చాన్నాళ్ల పాటు ఇందులోని సన్నివేశాలు వెంటాడతాయి. ఐతే ట్రైలర్ చూస్తేనే ఇది ఎలాంటి సినిమా అన్నది అర్థమైపోతుంది కాబట్టి.. అన్నింటికీ సిద్ధపడే థియేటర్లోకి అడుగుపెట్టాలి.
నటీనటులు:
తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఉన్ని ముకుందన్ ఇందులో కనిపించడు. అతడిలో ఇంత మాస్ యాంగిల్ ఉందా అనిపించేలా నటించాడు. సూపర్ స్టైలిష్ గా కనిపించిన ఉన్ని.. నటనలోనూ స్టైల్ చూపించాడు. తన లుక్ అదిరిపోయింది. పెర్ఫామెన్స్ కూడా బాగుంది. పతాక స్థాయిలో విధ్వంసం సృష్టించడానికి సరిపోయే బాడీతోనే అతను కనిపించాడు. సీనియర్ నటుడు సిద్ధిఖ్ పాత్ర.. నటన బాగానే సాగాయి. రసెల్ అనే విలన్ పాత్రలో అభిమన్యు తిలకన్ అదరగొట్టాడు. 'జిల్' ఫేమ్ కబీర్ సింగ్ దుల్హన్ స్క్రీన్ టైం తక్కువే కానీ.. అతను ప్రేక్షకులను భయపెట్టేలా నటించాడు. 'రంగబలి' ఫేమ్ యుక్తి తరేజాకు ఇందులో లిమిలెడ్ రోల్ దక్కింది. జగదీష్.. ఇషాక్ షౌకత్.. మిగతా నటీనటులు ఓకే.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా 'మార్కో' బ్రిలియంట్ అనిపిస్తుంది. రవి బస్రూర్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. చాలా స్టైలిష్ గా.. సన్నివేశాలను ఎలివేట్ చేసేలా సాగుతుంది బీజీఎం. చంద్రు సెల్వరాజ్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ఎసెట్. విజువల్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించాడు. ద్వితీయార్ధంలో వచ్చే లెంగ్తీ యాక్షన్ సీక్వెన్స్ లో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. రైటర్ కమ్ డైరెక్టర్ హనీఫ్ అదేని టేకింగ్ చాలా బాగుంది. తన కథ సాధారణంగానే అనిపించినా.. టేకింగ్ లో వైవిధ్యం చూపించాడు. నెవర్ బిఫోర్ అనిపించేలా వయొలెంట్ మూవీ తీయాలని టార్గెట్ పెట్టుకుని ప్రతి సన్నివేశాన్నీ అతను తీర్చిదిద్దినట్లు అనిపిస్తుంది. కథలో ఎమోషన్ కూడా ఉన్నప్పటికీ.. ఇది అందరికీ రుచించే సినిమా అయితే కాదు.
చివరగా: మార్కో.. వయొలెన్స్ నెవర్ బిఫోర్
రేటింగ్- 2.5/5