షిహాన్ హుసైని.. ఈ స్టంట్ మాస్టర్ గ్రేట్ నెస్ తెలిస్తే గుండె ఝల్లే
60 ఏళ్ల వయసులో హుసైని తాజాగా చెన్నైలో బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయారు. కరాటే లెజండ్ అయిన హుసైని.. పవన్ కల్యాణ్ కు చెన్నైలో కరాటే నేర్పించారు.;
చేతులపై కార్లు ఎక్కించుకోవడం..అదే చేతులతో ఇటుకలు పగుల కొట్టడం.. దట్టంగా అలముకున్న మంటల్లోంచి దూసుకురావడం.. అహో మార్షల్ ఆర్ట్స్ అంటే మామూలూ విన్యాసాలు కాదు.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని.. లేదా అప్పటికే మర్చిపోయిన ఈ మార్షల్ ఆర్ట్స్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చాక మళ్లీ తెరపై కనిపించాయి. మరి ఈ మార్షల్ ఆర్ట్స్ వెనుక ఉన్న ఆ మాస్టర్ ఎవరు..?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. కెరీర్ మొదట్లో పవన్ కల్యాణ్ సొంతంగా తన ముద్ర చాటేందుకు సాయం చేసినవి మార్షల్ ఆర్ట్స్. అలాంటి మార్షల్ ఆర్ట్స్ ను ఆయనకు నేర్పినది షిహాన్ హుసైని.
60 ఏళ్ల వయసులో హుసైని తాజాగా చెన్నైలో బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయారు. కరాటే లెజండ్ అయిన హుసైని.. పవన్ కల్యాణ్ కు చెన్నైలో కరాటే నేర్పించారు. అయితే, హుసైనీ స్టంట్ మాస్టర్ కూడా. ఆర్టిస్ట్ మాత్రమే కాక.. ఆర్చరీలోనూ ఆయనకు ప్రవేశం ఉంది. హుసైని ఎందరికో శిక్షణ ఇచ్చారు. అలాంటివారిలో పవన్ కల్యాణ్ ఒకరు.
కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుడికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వడమే కాదు.. సినిమాల్లోనూ నటించిన హుసైనీ అత్యంత ప్రమాదకర స్టంట్ లతో జీవితాన్ని వెళ్లదీశారు. ప్రాణాలకు తెగించిన చేసిన ఇలాంటి స్టంట్ లు ఆయనకు ఎంతగానో పేరు తెచ్చాయి.
50 ఏళ్ల వయసులో ఎవరైనా కాస్త బరువు మోయడానికైనా వెనుకాడతారు. హుసైనీ మాత్రం ఏసు క్రీస్తు మాదిరిగా.. 2015లో ఏకంగా 300 కేజీల చెక్క శిలువను మోశారు. చేతులు, కాళ్లకు మేకులు కొట్టించుకున్నారు. హుసైనీకి తమిళనాడు మాజీ సీఎం జయలలిత అంటే విపరీతమైన అభిమానం. అందుకనే ఈ పని చేశారు. జయ జన్మదినం సందర్భంగా అయితే రక్తంతో ఆమె 56 చిత్రాలను గీశారు. తన రక్తంతో పాటు మరికొందరిది కలిపి 2013లో 11 లీటర్ల రక్తాన్ని గడ్డకట్టించి జయలలిత ఆకృతిని రూపొందించారు.
అప్పట్లో సోషల్ మీడియా లేదు కానీ.. ఇప్పుడైతే హుసైనీ స్టంట్ లు చూసి ఎంతమంది అట్రాక్ట్ అయ్యేవారో..? తన ప్రమాదకర స్టంట్ లలో ఒకటి.. కుడి చేతిపై 101 కార్లను పోనిచ్చికుని అదే చేత్తో 5 వేల టైల్స్, వెయ్యిపైగా ఇటుకలను పగులగొట్టడం. ఓసారి ఏకంగా 140 లీటర్ల పెట్రోల్‌తో మంటలు వెలిగించి అందులోంచి బయటకు వచ్చారు హుసైనీ.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స చిత్రాన్ని పంది రక్తంతో గీసిన హుసైనీని యువకుడిగా ఉండగా 1980లో శ్రీలంక మిలిటెంట్ అనుకుని పోలీసులు అరెస్టు చేసి తీహాడ్ జైలుకు పంపడం గమనార్హం.
కరాటేలో తన గురువు అయిన హుసైనీ మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.