సస్పెన్స్ మాస్టర్ హిచ్‌కాక్ సినీ జీవితంపై పుస్తకం!
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రసిద్ధ దర్శకులు వంశీ ఆవిష్కరించి తొలి ప్రతిని దర్శకులు హరీష్ శంకర్‌కు, రెండో ప్రతిని సీనియర్ నటులు నాజర్‌కు అందజేశారు.
''నేను 'అన్వేషణ' సినిమా తీయడానికి హిచ్‌కాక్ కూడా ఓ ప్రేరణ. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వీసీఆర్ కొన్నప్పుడు అందులో 'సైకో' చూశా. హిచ్‌కాక్ తీసిన మొత్తం 53 సినిమాలు చూసిన వ్యక్తిని నేను. ఆ విషయం పులగం చిన్నారాయణకు తెలుసు. నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్ గుర్తులు ఉన్నాయి. సినిమాకు అవసరమైనవి మూడు... స్క్రిప్ట్, స్క్రిప్ట్, స్క్రిప్ట్ అని చెప్పాడు హిచ్‌కాక్. ఆయన మీద పులగం చిన్నారాయణ, రవి పాడి గొప్ప పుస్తకం తీసుకొచ్చారు. ఇదొక అద్భుతం. రచయితలు ఇద్దరూ నాకు సన్నిహితులు. ఈ పుస్తకం తొలి ప్రతిని చూసి థ్రిల్ అయ్యాను!'' అన్నారు సుప్రసిద్ధ దర్శకులు వంశీ. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి.. ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. ఇందులో 45 మంది దర్శకులు, ఏడుగురు రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రసిద్ధ దర్శకులు వంశీ ఆవిష్కరించి తొలి ప్రతిని దర్శకులు హరీష్ శంకర్‌కు, రెండో ప్రతిని సీనియర్ నటులు నాజర్‌కు అందజేశారు. తొలి ప్రతిని 'సంతోషం' మ్యాగజైన్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి రూ.5000 ఇచ్చి అందుకున్నారు. ఈ బుక్ కవర్ పేజీని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ఈశ్వర్ డిజైన్ చేశారు. ఈ బుక్ కవర్ పేజీ ఫ్రేమ్‌ని దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి ఆవిష్కరించారు. పుస్తకాన్ని పబ్లిష్ చేసిన అక్షౌహిణి మీడియా లోగోని దర్శకులు హరీష్ శంకర్ ఆవిష్కరించారు.
'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నటుడు నాజర్, దర్శకులు మెహర్ రమేష్, మోహనకృష్ణ ఇంద్రగంటి, వీరశంకర్ (తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు), చంద్రసిద్ధార్థ, శివ నాగేశ్వరరావు, కరుణ కుమార్, వర ముళ్ళపూడి, దేవి ప్రసాద్, సునీల్ కుమార్ రెడ్డి, సాయి కిషోర్ మచ్చా, రమేష్ సామల, శ్రీమన్ వేముల తదితరులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ రచయిత తోట ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, సుబ్బారావు, ప్రసన్న ప్రదీప్, వడ్డి ఓం ప్రకాశ్, జలపతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకులు వంశీ మాట్లాడుతూ... ''నేను హిచ్‌కాక్‌ను విపరీతంగా ప్రేమిస్తాను. ఆయన మీద ఇటువంటి పుస్తకం వేయాలని ఆలోచన రావడం ఒక అద్భుతం. నాకు తెలిసి భారతీయ భాషల్లో ఎవరూ ఇటువంటి ప్రయత్నం చేయలేదు. పుస్తకం కూడా అద్భుతంగా వచ్చింది'' అని చెప్పారు. దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ... ''మనందరి దురదృష్టం ఏమిటంటే... హిచ్‌కాక్ సినిమాలు చూశాం కానీ ఆయన్ను చూడలేదు. మన అదృష్టం ఏమిటంటే... వంశీ గారి సినిమాలతో పాటు ఆయన్ను చూశాం. ఆయనతో టైమ్ స్పెండ్ చేస్తున్నాం. చాలా మంది వంశీ గారిని హిచ్‌కాక్‌తో పోలుస్తారు. ఆంధ్ర హిచ్‌కాక్ అంటారు. నా దృష్టిలో హాలీవుడ్‌లో ఉన్న వంశీ హిచ్‌కాక్. ఆయన నుంచి పుస్తకం తొలి ప్రతిని అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం. నేను కూడా ఈ పుస్తకంలో ఒక సినిమా గురించి రాశా.
ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ రాజ్యం ఏలుతున్న ఇటువంటి సమయంలో పుస్తకాలు చదివే వాళ్ళు గంధర్వులతో సమానం. ఎందుకంటే... అరుదుగా ఉంటారు. ఇక పుస్తకం రాసే వాళ్లు నిజంగా దేవుళ్ళు. పులగం చిన్నారాయణ గారు ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతారు. ఆయన గత జన్మలో దర్శకుడు అయ్యి ఉంటారు. వచ్చే జన్మలో కచ్చితంగా డైరెక్టర్ అవుతారు. బుక్స్ ఎంత మంది చదువుతారని కొందరికి సందేహం ఉండొచ్చు. వంశీ గారు రాసిన పసలపూడి కథలు పుస్తకం మీద ఒక వ్యక్తి పీహెచ్‌డి చేసి ఒక బుక్ రాశారు. ఆ బుక్ రీ ప్రింట్ చేశారంటే పుస్తకాలు చదివేవారు ఎంత మంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అంతా దాసోహం అనే సినిమాలు హాలీవుడ్ తీయడానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న నవలలు, బుక్ బ్యాంకు. హ్యారీ పోటర్ కానివ్వండి, మరొకటి కానివ్వండి... బుక్ బేస్డ్ తీశామని చెబుతారు. అక్కడ సాహిత్యానికి పెద్దపీట వేశారు కాబట్టే సినిమాకు అంత ఆదరణ వచ్చింది. న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ అని అంటుంటారు కదా. అలా హైదరాబాద్ బెస్ట్ సెల్లర్ అని 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' అని వేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ... ''మూకీ నుంచి మాటల సినిమా వరకు తనదైన ముద్ర వేసిన అతికొద్ది మంది దర్శకుల్లో హిచ్‌కాక్ ఒకరు. విజువల్‌తో చెప్పలేనప్పుడు డైలాగ్ ఉపయోగించాలని ఆయన చెప్పారు. ఆయన వర్టిగో, సైకో, బ్లాక్ మెయిల్ సినిమాలు అద్భుతం. సౌండ్ ఎలా వాడాలో కూడా చెప్పిన దర్శకుడు ఆయన. బర్డ్స్ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ లేదు. తనకు తాను కొత్త సవాళ్లు ఏర్పరుచుకుని అధిగమించే దర్శకుడు హిచ్‌కాక్. ఆయనకు ఒక్క ఆస్కార్ కూడా రాలేదు. అది గమ్మత్తైన విషయం. అటువంటి గొప్ప దర్శకుడి మీద టెక్స్ట్ బుక్ లాంటి పుస్తకం తీసుకు రావడం గొప్ప విషయం'' అని చెప్పారు.
సీనియర్ నటులు నాజర్ మాట్లాడుతూ... స''సినిమా గురించి మన దగ్గర పెద్దగా పుస్తకాలు లేవు. నేను ఫిలిం స్కూల్ లో చదివినప్పుడు ఒక బుక్ ఉండేది. అది మాకు బైబిల్. హిచ్‌కాక్‌ను ఫ్రెంచ్ క్రిటిక్ ట్రూఫో ఇంటర్వ్యూ చేశారు. అది బెస్ట్ బుక్'' అని అన్నారు.
జంధ్యా మారుతం, ఆనాటి ఆనవాళ్లు', 'సినీ పూర్ణోదయం', 'స్వర్ణయుగ సంగీత దర్శకులు', 'పసిడితెర', 'సినిమా వెనుక స్టోరీలు', 'మయా బజార్ మధుర స్మృతులు', 'వెండి చందమామలు', 'జై విఠలాచార్య', 'పడమటి సినిమా పరిమళం' - పులగం చిన్నారాయణ మొత్తం పది పుస్తకాలు రాశారు. 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' ఆయన రాసిన పదకొండో పుస్తకం. ఉత్తమ సినీ గ్రంథకర్తగా రెండు నంది అవార్డులు, ఉత్తమ సినీ విమర్శకుడిగా ఓ నంది అవార్డు అందుకున్నారు పులగం చిన్నారాయణ.