ఇంకో కమెడియన్ హీరోగా..
అలా ఈ జనరేషన్ లో ఇప్పటికే కమెడియన్ సత్య హీరోగా మారి మంచి సక్సెస్ అందుకున్నాడు
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోగా మారడం సర్వసాధారణమే. అయితే కొంతమంది కమేడియన్స్ హీరోగా మారి సక్సెస్ అందుకుంటే.. మరకొంతమంది అనవసరంగా ప్రయోగాలు చేసి ఉన్న కెరియర్ పాడు చేసుకున్నారు. ఇక ఈ తరంలో యంగ్ కమెడియన్స్ తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కొద్దిమంది హీరోలుగా మారుతున్నారు.
అలా ఈ జనరేషన్ లో ఇప్పటికే కమెడియన్ సత్య హీరోగా మారి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇటీవల వెన్నెల కిషోర్ కూడా హీరోగా మారి ఓ క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో ఒక ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ లిస్టులో మరో కమెడియన్ అభినవ్ గోమఠం కూడా చేరిపోయాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమాతో కమెడియన్ గా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు అభినవ్.
ఈ సినిమాలో తన కామెడీ, డైలాగ్ డెలివరీతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత అభినవ్ కి భారీ పాపులారిటీ వచ్చింది. దాంతో స్టార్ హీరోల సినిమాల్లోనూ కమెడియన్గా మెప్పించాడు. ఈ నగరానికి ఏమైంది తర్వాత మీకు మాత్రమే చెప్తా, సేవ్ ది టైగర్స్ వంటి సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఓవైపు కమెడియన్గా నటిస్తూనే ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ నగరానికి ఏమైంది సినిమాలోని తన డైలాగ్ నే తన ఫస్ట్ మూవీకి టైటిల్ గా పెట్టుకున్నాడు.' మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' అనే టైటిల్ తో అభినవ్ గోమటం కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో అక్కడి స్టూడెంట్స్ తో కలిసి తరుణ్ భాస్కర్ టైటిల్ లోగోని రిలీజ్ చేశారు. తిరుపతిరావు ఇండ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై భవానీ కాసుల, ఆర్ఎం రెడ్డి, ప్రశాంత్. వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టైటిల్ లోగో రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.." కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో ప్రశంసలు అందుకున్న అభినవ్ గోమటంలోని మరో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. అయోధ్యలోని శ్రీ సీతారాముల ప్రాణ పతిష్ట రోజే మా సినిమా లోగోను ఆవిష్కరించడం ఎంతో లక్కీగా భావిస్తున్నాం. అన్నిభావోద్వేగాల మేళవింపుతో లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. ఫిబ్రవరి ద్వితియార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు.