మాయవతి అంతే.. ఈసారి మేనల్లుడికే షాకిచ్చారు!
బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆమె
బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు గతం తాలుకు ఘనంగానే నిలుస్తారు. నిజానికి సమకాలీన రాజకీయాల్లో తన తీరును మార్చుకోకుండా.. కాలానికి తగ్గట్లు మారకుండా ఉన్న అతి కొద్దిమంది అధినేతల్లో ఆమె ఒకరు. ముక్కుసూటిగా వ్యవహరించటం.. మిగిలిన అధినేతలు పడిపోయే పొగడ్తల విషయంలో కఠినంగా ఉండటం.. మాటలతో మాయ చేసే వారి తోక కత్తిరించటమే కాదు.. అవసరానికి మించిన చనువును ప్రదర్శించిన వారికి సైతం వాతలు పెట్టే విషయంలో మాయవతి ట్రాక్ రికార్డు రోటీన్ కు భిన్నమని చెబుతుంటారు. తాజాగా ఆమె తన తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని చేతలతో చెప్పేశారు.
తన రాజకీయ వారసుడిగా.. పార్టీ జాతీయ సమన్వయకర్తగా ప్రకటించిన తన మేనల్లుడు (సోదరుడి కుమారుడు) పక్కన పెట్టేయటమే కాదు.. పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. బీజేపీ మీద అతగాడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వేటుతో బదులిచ్చారు. అంతేకాదు.. పూర్తి స్థాయి పరిపక్వత సాధించే వరకు ఆయన్ను పార్టీలో కీలక బాధ్యతలకు దూరంగా ఉంచుతున్నట్లుగా ప్రకటించారు. ఇంతకూ అసలేమైందంటే?
మాయవతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్. తన తర్వాత పార్టీకి అతనే ఫ్యూచర్ అంటూ నెత్తిన పెట్టుకున్న మేనల్లుడ్ని.. హటాత్తుగా నేల మీదకు తీసుకురావటమే కాదు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చేయటం మాయవతికి మాత్రమే చెల్లుతుందని చెప్పాలి. ఇక.. ఆకాశ్ విషయానికి వస్తే.. లండన్ లో ఎంబీఏ పూర్తి చేశాడు. 2017లో బీఎస్పీలో చేరాడు. 2019లో ఎంపీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన అతను పార్టీలో అంచలంచెలలుగా ఎదగటమే కాదు.. మాయవతి తర్వాత పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నేతగా మారారు.
అలాంటి అతను ఇటీవల కాలంలో బీజేపీ మీద ఘాటు విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ సర్కారుగా అభివర్ణిస్తూ.. యువతను ఆకలితో ఉంచుతూ పెద్దల్ని బానిసలుగా మార్చుకుంటుందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అతడికి నోటీసులు జారీ చేసింది. అతడితో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపైనా కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాల తర్వాత స్పందించిన బీఎస్పీ.. ఆయన ర్యాలీలను రద్దు చేసింది. తాజాగా పార్టీలో ఆయన పోస్టును పీకేసి.. ఆయన స్థానంలో అతడి తండ్రి అంటే.. మాయవతికి సోదరుడికి పార్టీ బాధ్యతలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎంతోమంది పార్టీ అధినేతలు ఉండొచ్చు కానీ మాయవతి మాదిరి కరాఖండీ అధినేత్రి మాత్రం అరుదుగా చెప్పక తప్పదు.