శంకర్ 'గేమ్‌'పై మెగా ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ వచ్చినట్లేనా..?

అయితే రెండున్నర నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియో.. శంకర్ గత చిత్రాలను గుర్తుకు తెస్తుంది. అయినప్పటికీ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ముఖ్యంగా అభిమానులను బాగా అలరిస్తుంది.

Update: 2025-01-03 06:53 GMT

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'గేమ్‌ ఛేంజర్‌'. రామ్ చరణ్ హీరోగా ఎస్. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకూ రిలీజ్ ప్రమోషనల్ కంటెంట్ సినిమాకి పెద్దగా బజ్ క్రియేట్ చెయ్యలేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో గురువారం రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేసారు. లవ్‌, ఎమోషన్‌, ఎలివేషన్స్, యాక్షన్‌, కామెడీ, సెంటిమెంట్, గ్రాండ్ విజువల్స్, భారీ హంగులు, పవర్ ఫుల్ డైలాగ్స్.. ఇలా అన్ని అంశాలు ఉండేలా కట్ చేసిన ఈ ట్రయిలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

'గేమ్‌ ఛేంజర్‌' అనేది కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని క్లారిటీ వచ్చేసింది. నిజాయతీ గల ప్రభుత్వ అధికారి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడి మధ్య యుద్ధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇందులో అప్పన్న, రామ్ నందన్ గా రామ్ చరణ్ రెండు పాత్రలు పోషించారు. కథానుగుణంగా చెర్రీ చాలా లుక్స్ లో కనిపించారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించగా.. ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, బ్రహ్మానందం, నవీన్ చంద్ర, సునీల్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.

శంకర్ కు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది. ముందు నుంచీ దర్శకుడు చెబుతున్నట్లే ఒక్కడు, పోకిరి సినిమాల మాదిరిగా అన్ని ఎలిమెంట్స్ తో కూడిన పక్కా కమర్షియల్ ప్యాకేజ్ గా 'గేమ్‌ ఛేంజర్‌' ను రూపొందించినట్లు ట్రైలర్ తో స్పష్టమైంది. అయితే రెండున్నర నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియో.. శంకర్ గత చిత్రాలను గుర్తుకు తెస్తుంది. అయినప్పటికీ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ముఖ్యంగా అభిమానులను బాగా అలరిస్తుంది. ఓవరాల్ గా గేమ్ పాతదే కానీ, ఈ సినిమాలో కొత్తగా అన్ ప్రిడిక్టబుల్ గా ఎలా ఆడించాడనేదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం అని చెప్పాలి.

నిజానికి శంకర్ గత కొంతకాలంగా ఫామ్ లో లేడు. 'గేమ్‌ ఛేంజర్‌' సెట్స్ మీద ఉండగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసిన 'భారతీయుడు 2' సినిమా డిజాస్టర్ గా మారింది. రిజల్ట్ సంగతి పక్కన పెడితే దర్శకుడి కెరీర్ లోనే తొలిసారిగా విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకరకంగా దీని కారణంగానే రామ్ చరణ్ సినిమాపై అంచనాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఫ్యాన్స్ సైతం దర్శకుడి చివరి సినిమా ఎఫెక్ట్ 'గేమ్ ఛేంజర్' మీద పడుతుందేమోనని టెన్షన్ పడ్డారు. కానీ నిన్న రిలీజైన ట్రైలర్ తో వారంతా హ్యాపీగా ఉన్నారు. కచ్చితంగా సక్సెస్ సాధిస్తామనే నమ్మకంతో ఉన్నారు.

'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటి దాకా ఈ సినిమా గురించి తమిళనాట, నార్త్ లో పెద్దగా చర్చలు జరగలేదు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఓవర్ సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసి చాలా రోజులైనా, అడ్వాన్స్ సేల్స్ ఆశించిన విధంగా లేవనేది వాస్తవం. ట్రైలర్ కు వచ్చిన స్పందన చూస్తుంటే ప్రీసేల్స్ పెరుగుతాయని అనిపిస్తోంది. రేపు జనవరి 4న రాజమండ్రిలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. అబ్బాయ్ - బాబాయ్ ఒకే స్టేజ్ మీద కనిపించిన తర్వాత ఈ సినిమా 'గేమ్' మరింతగా మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News