తెలంగాణ కొత్త CM రేవంత్‌తో మెగాస్టార్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు. కొత్త సీఎంకు చిరు పూల బోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో చిరు బ్లూ జీన్స్ - తెల్లటి చొక్కా ధరించి కనిపించాడు. అయితే సీఎం రెడ్డి తెల్లటి చొక్కా ధరించి నల్ల ప్యాంటుతో ఫార్మల్ లుక్ లో కనిపించారు. కొత్త సీఎం బ్రౌన్ శాలువాని ధరించి చిరునవ్వులు చిందించారు.
అయితే కొత్త సీఎంని కలిసిన చిరు ఏం ముచ్చటించారు? అనేదానిపై ఎలాంటి స్పష్ఠత లేదు. దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న చిరు సినీఇండస్ట్రీ సమస్యలను సీఎంతో ప్రస్థావించి ఉంటారని భావిస్తున్నారు. టికెట్ ధరలు సహా భారీ చిత్రాలకు టికెట్ పెంపు వెసులుబాటు వంటి అంశాలను సీఎంకి విఫులంగా వివరించి ఉంటారనే ఊహాగానాలు సాగుతున్నాయి. మునుముందు టాలీవుడ్ లో పలు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం గేమ్ ఛేంజర్ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకి దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు.
మునుముందు ఎన్టీఆర్ నటించిన- దేవర, మహేష్ నటించిన గుంటూరు కారం, వెంకీ నటించిన సైంధవ్, రవితేజ నటించిన ఈగిల్ లాంటి పెద్ద సినిమాలు విడుదలకు రానున్నాయి. తొలి వీకెండ్ టికెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటు వీటికి అవసరం. మరోవైపు సినిమా షూటింగులను సరళతరం చేసేందుకు మరింత వెసులుబాటు కలిగేలా, సినీపరిశ్రమపై అనవసర రాజకీయ ఆర్భాటాలేవీ లేకుండా ఉండేందుకు కూడా ఈ భేటీ సహకరిస్తుందని భావిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. చిరంజీవి 'మెగా 156' అనే ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ తొలిసారి సంతకం చేసిన ఈ ఫాంటసీ చిత్రానికి 'బింబిసార'తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు.