హనుమాన్ చిరంజీవికి ఎంత సాయపడ్డారు?
తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సినిమా హను-మాన్ ఈ సంక్రాంతి బరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సినిమా హను-మాన్ ఈ సంక్రాంతి బరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హనుమాన్ ప్రచార ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ వేదికపై చిరు స్పీచ్ ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది. ఆయన తనకు హనుమంతుడితో ఉన్న అనుబంధం భక్తి భావం గురించి అద్భుతంగా మాట్లాడారు. తన జీవితంలో హనుమంతుడు ఎలా భాగమయ్యారో, తన కుటుంబానికి స్వామివారు ఎలాంటి సహాయం అందించారో కూడా ఈ వేదికపై వెల్లడించారు. ఈ సందర్భంగా చిరు ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు.
చిరంజీవి మాట్లాడుతూ-``నిజానికి హనుమాన్ ఈవెంట్ కి రావడానికి నాలుగు కారణాలున్నాయి. నా ఆరాధ్య దైవం నేను చిన్నప్పటి నుంచి అన్నీ తానే అని నమ్మిన స్వామివారి కోసం.. అమ్మా నాన్నల తర్వాత అన్నీ ఆంజనేయుడే.. అనుక్షణం నేను ప్రార్థించే హనుమాన్ ని సెంట్రిక్ గా తీసుకుని ఆయన గురించి తెలిపే సినిమా హను-మ్యాన్. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్ ని పంచుకునే స్థాయికి వచ్చిన యంగ్ హీరో తేజ సజ్జా ఒక కారణం. ఈ మధ్య టీజర్ ట్రైలర్ చూసాక వీఎఫ్ ఎక్స్ కథ సౌండింగ్ ప్రతిదీ నచ్చాయి. తొలిసారి ఎవరు ఈ డైరెక్టర్? అని అడిగి తెలుసుకున్నాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒక కారణం.
కొద్దిరోజుల క్రితం వీరు నా దగ్గరకు వచ్చి హనుమాన్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావాలని కోరారు. ఏమాత్రం సమయం తీసుకోకుండా అన్నిరకాలుగా ప్రోత్సహిస్తానని వారికి చెప్పాను. ఎప్పుడూ నా ఆరాధ్య దైవం హనుమంతుడి గురించి నేను చెప్పుకునే సందర్భాలు తారస పడలేదు. ఒక్కోసారి మనలోని భక్తిని చెప్పుకోవాలా? అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పాలనిపించింది. చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆంజనేయుడిని తలుచుకుంటూ ఒక నిబద్ధత లక్ష్యంతో నేను ఇక్కడికి ఎలా వచ్చానో.. ఎవరి ఆశీస్సులు ఉన్నాయని బలీయంగా నమ్ముతానో ఆ స్వామి కథతో సినిమా వస్తోంది అంటే.. ఆయనతో నా అనుబంధాన్ని చెప్పుకోవాల్సిన సందర్భమిది. ఈ వేదికపై చెబితే అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇది హిందూత్వనో మరో మతం గురించో ప్రచారం కాదు. యువతరానికి స్ఫూర్తినివ్వడానికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఆయన(ఆంజనేయుడు)నే నమ్ముకున్నాను. మీరు కూడా నమ్ముకుంటే ఎదుగుతారు అని చెప్పాలనిపించింది.
మనసు అంతరంతరాల్లోంచి ఈ మాటల్ని వెలిబుచ్చుతున్నాను. నాన్నగారు కమ్యూనిస్ట్. ఆయన దేవుళ్లకు దండం పెట్టేది అరుదు. అమ్మ శనివారం వెంకటేశ్వర స్వామికి దణ్ణం పెట్టేది. అంతకుమించి ఎవరూ స్వాములను దేవుళ్లను కొలవలేదు. నేను 7వ తరగతి చదువుతుండగా పొన్నూరులో ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకునేవాడిని. బాపట్లలో స్కూల్ ఉండేది. చీకటి దారిలో వెళ్లేవాడిని. భయంగా ఉండేది. కానీ హనుమంతుని టెంపు ల్ లో ప్రసాదం తీసుకుని ధైర్యంగా వెళ్లేవాడిని. అక్కడ పూజారి చెప్పే విషయాలు శ్రద్ధగా వినేవాడిని. హనుమాన్ చాలీసా ప్రాక్టీస్ చేసేవాడిని. ఆయన మీద భక్తి భావం అలా కుదిరిపోయింది. అక్కడి నుంచి మొగల్తూరులో 8, 9 క్లాస్ లు చదివాను.
గ్రామీణులకు ఇది తెలుస్తుంది. రోడ్ పైన చెక్స్ ఆటలో ఒక నంబర్ వస్తుంది. అది చూస్తే నాకు ఒక క్యాలెండర్ గిఫ్ట్ గా వచ్చింది. చూస్తే అది హనుమంతుని కేలండర్. ఆరోజు నుంచి ఇప్పటికీ నేను ఆంజనేయ స్వామిని ఫ్రేమ్ కట్టి పూజిస్తూనే ఉన్నాను. నేను హనుమంతుని వెంటపడ్డానా? లేదా ఆయన మీద ఒక గురి కుదిరాక ఆయనే నా వెంటపడ్డారో తెలీదు. నేను పదో తరగతి చదివేప్పటికి.. ఎక్కడో పేరాల చీరాల వద్ద నాన్నగారు పని చేసేవారు. అక్కడి నుంచి మాడుగుల - ఉత్తరాంధ్రకు సడెన్ గా విధినిర్వహణ ట్రాన్స్ ఫర్ అయింది. కానీ అక్కడికి వెల్లడం నాన్నకు ఇష్టం లేదు. లాంగ్ లీవ్ పెట్టారు. నాన్నను చూస్తే దిగాలు గా కనిపించేవారు. నాన్నకు నేను 15 ఏళ్ల కుర్రాడిగా సందేహిస్తూనే.. ఆంజనేయుడిని నమ్మితే అనుకున్నది అవుతుందని అన్నాను. ``అవునంటావా? జరుగుతుందా? చేద్దామా?`` అన్నారు నాన్న. నేను హనుమాన్ చాలీసా రాసి ఇచ్చాను. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ చదివారు. నెలరోజుల లోపు ఏ ఊరు నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యారో అదే ఊరికి తిరిగి ట్రాన్స్ ఫర్ అయ్యారు. అప్పటి నుంచి నాన్నగారు ఆంజనేయునికి పర్మినెంట్ భక్తుడు అయ్యారు. మా కుటుంబం అంజనీ పుత్రుడిని ప్రార్థిస్తుంది .. అని చిరు తెలిపారు.