మోహన్‌బాబుపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

నీ చుట్టూ ఉండటానికి వేచి ఉండలేకపోతున్నాను నాన్నా, నిన్ను ప్రేమిస్తున్నాను.' అంటూ ఆయన భావోద్వేగంతో పోస్ట్ చేశారు.;

Update: 2025-03-19 12:10 GMT

తెలుగు చిత్రపరిశ్రమలో మోహన్‌బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన తన క్రమశిక్షణతో కూడా అందరికీ గుర్తుండిపోయారు. అలాగే నిర్మాతగా, విద్యాసంస్థల అధిపతిగా మోహన్‌బాబు తనదైన ముద్ర వేశారు. నేటి టాలీవుడ్‌లో ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక నేడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు అభిమానులు ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు.

అయితే, గత కొన్ని నెలలుగా మంచు కుటుంబంలో పరిస్థితులు అంత గొప్పగా లేవు. మనోజ్, మోహన్‌బాబుల మధ్య ఉన్న విభేదాలు గట్టిగానే చర్చనీయాంశమయ్యాయి. ఆస్తి వివాదాలు బయటకొచ్చిన తర్వాత, వీరి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై అనేక రకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి. ఇటీవల మోహన్‌బాబు తన కొడుకు మనోజ్‌పై ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాను సంపాదించిన ఆస్తిని అక్రమంగా ఆక్రమించాడంటూ అధికారులకు ఫిర్యాదు చేయడం పెద్ద వివాదంగా మారింది.

అలాంటి పరిస్థితుల్లోనే మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా మనోజ్ పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. 'పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. ఈ వేడుకల రోజున నీ పక్కన ఉండాలి. ఆ క్షణాలను మేము చాలా మిస్ అవుతున్నాం. నీ చుట్టూ ఉండటానికి వేచి ఉండలేకపోతున్నాను నాన్నా, నిన్ను ప్రేమిస్తున్నాను.' అంటూ ఆయన భావోద్వేగంతో పోస్ట్ చేశారు. మనోజ్ మాటల్లో తండ్రిపై ప్రేమ మాత్రమే కాదు, మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలనే కోరిక కూడా స్పష్టంగా కనిపించింది.

అంతే కాకుండా మనోజ్ చిన్నప్పుడు తండ్రితో ఉన్న సినిమా సీన్స్ అలాగే కూతురు తండ్రి ఫొటోను ముద్దాడుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే యానిమాల్ సినిమాలోని నాన్న పాటను కూడా వీడియోలో జత చేయడం చూస్తుంటే అతని ప్రేమ అర్ధమవుతుంది. ఈ సందేశం మనోజ్, మోహన్‌బాబుల మధ్య పరిస్థితులు మెరుగుపడతాయేమో అనే అంచనాలను తెస్తోంది.

మరోవైపు, మంచు లక్ష్మీ కూడా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘హ్యాపీ బర్త్‌డే నాన్న.. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని ఆ దేవుడిని ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటా’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో మోహన్‌బాబు తన పుట్టినరోజును ఎలా జరుపుకుంటున్నారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి, మనోజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. తండ్రితో కలిసిపోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ మెసేజ్ పెట్టారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News