2 శాతాన్ని వేరే మార్గాల్లో తీయొచ్చు: ఏపీ ఫిలింఛాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్
ఎందుకంటే ఇప్పటికే ధియేటర్ కు వెళితే ఖర్చు ఎక్కువ అవుతుందన్న ఆలోచనతో ప్రేక్షకులు థియేటర్ కు దూరం అవుతున్నారు.
చిత్ర పరిశ్రమలో పనిలేక, పని దొరకక ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల, కళాకారుల సంక్షేమం పట్ల కర్ణాటక ప్రభుత్వం చూపుతున్న ప్రేమ సరియైనదే అయినప్పటికీ టికెట్ పై వసూలుచేసి ఇవ్వాలనే ఆలోచన సరియైనది కాదు అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కర్నాటక బిల్లు ఇప్పుడు టాలీవుడ్ లోను ప్రకంపనలు రేపుతోంది. దీనిపై ఇక్కడా ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ-''కర్నాటక ప్రవేశ పెట్టిన బిల్లు సరియైనది కాదు. ఎందుకంటే ఇప్పటికే ధియేటర్ కు వెళితే ఖర్చు ఎక్కువ అవుతుందన్న ఆలోచనతో ప్రేక్షకులు థియేటర్ కు దూరం అవుతున్నారు. ఈ భారం కూడా పడితే ధియేటర్ల మనుగడ మరింత కష్టం అవుతుంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు రాక ఇబ్బందిపడుతున్న నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు పరిస్థితి ఇంకా ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. OTT ల పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో అంతంత మాత్రంగానే ఉంది.
ఇబ్బందిపడుతున్న కార్మికులకు, కళాకారులకు సహాయం చేయాలంటే నాదో సూచన...
1.రాష్ట్రప్రభుత్వానికి సినిమా టికెట్ పై వచ్చే వినోదపు పన్ను GST వాటాలోంచి 2శాతాన్ని, అది సినిమాపై వస్తుంది కాబట్టి దానిని ఇబ్బందులలో ఉన్నవారి సంక్షేమం గురించి ఖర్చు పెట్టవచ్చు. (లేదా)
2.కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొనే ఆర్టిస్టుల దగ్గరనుంచి, పెద్ద టెక్నీషియన్స్ నుంచి కొంత వాటా వసూలుచేసి దానిని పేద కార్మికుల, కళాకారుల సంక్షేమానికి ఖర్చు పెట్టవచ్చు.
(లేదా)
3.గవర్నమెంట్ తరుపున పెద్ద ఆర్టిస్టులతో ఈవెంట్స్ నిర్వహించి వచ్చిన డబ్బును వారికి ఖర్చుపెట్టవచ్చు.
అంతే కానీ ఇప్పటికే ఇబ్బందులలో ఉన్న థియేటర్ వ్యవస్థను
ఇంకా ఇబ్బంది పెట్టవద్దు..
అని జేవి మోహన్ గౌడ్ సూచించారు.
టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే కర్నాటక బిల్లుపై చాలా చర్చ జరుగుతోంది.. ఈ కొత్త బిల్లు విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్న థియేటర్ల వ్యవస్థను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే చర్యగా దీనిని చూస్తున్నారు.
కర్నాటక కొత్త బిల్లు:
జూలై 19న కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల (సంక్షేమం) బిల్లు- 2024ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని సినిమా మరియు సాంస్కృతిక కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు కర్ణాటక సినీ సాంస్కృతిక కార్యకర్తల సామాజిక భద్రత - సంక్షేమ నిధి పేరుతో ఒక నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదించింది.
ప్రతి సినిమా టిక్కెట్టుపై 2 శాతం రుసుమును వసూలు చేసి సినీరంగంలోని కార్మికులు, పేద కళాకారుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే అది వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని కర్నాటక ప్రభుత్వం తాజా బిల్లులో ప్రతిపాదించింది. పరిశ్రమలో అసంఘటితంగా వదిలి వేసిన లేదా విసిరివేయబడిన కార్మికులను ఆదుకునే అద్భుత తరుణోపాయం అవుతుందనేది ప్రభుత్వ ఆలోచన.