AMMAకు ఇక రాను..మోహన్ లాల్ మనస్తాపం..!
అయితే తాజా ప్రకటనలో లాల్ స్పందించారు. సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాను మళ్లీ `అమ్మ` అధ్యక్షుడిగా ఉండబోనని ధృవీకరించారు.
మలయాళ చిత్రసీమలో గత కొంతకాలంగా గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమైన అనంతర పరిణామాలు సంచలనానికి తెర తీసాయి. ఆర్టిస్టుల సంఘం AMMA అధ్యక్షుడి రాజీనామా సహా కమిటీ కూడా రద్దయింది. పలువురు నటులపై నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, కీలకమైన నటులు `పవర్ గ్రూప్`గా మారి అంతర్గత విషయాలను బయటకు రానివ్వడం లేదని నటీమణులు ఆరోపించడం తెలిసినదే. రాధిక లాంటి సీనియర్ నటీమణి మలయాళ చిత్రసీమలో షూటింగుల వ్యవహారంపై తీవ్రంగా ఆరోపించారు. ఆన్ లొకేషన్ సరైన వసతులు ఉండవని ఆవేదనను వ్యక్తం చేసారు. ముఖ్యంగా చాలామంది హీరోలు పవర్ పాలిటిక్స్ ని ప్లే చేస్తారని నటీమణులు వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
అయితే ఇలాంటి సమయంలో AMMA ఎన్నికలకు సమయమాసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడైన మోహన్ లాల్ పోటీ చేస్తారా? అంటూ చర్చ సాగుతోంది. అయితే తాజా ప్రకటనలో లాల్ స్పందించారు. సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాను మళ్లీ `అమ్మ` అధ్యక్షుడిగా ఉండబోనని ధృవీకరించారు. హేమా కమిషన్ నివేదిక తర్వాత ఆగస్టులో ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పరిశ్రమపై నివేదిక పెను దుమారానికి తెర తీసింది. మోహన్ లాల్ సహా ఇతర AMMA సభ్యుల రాజీనామాకు దారితీసింది. ఆధారాలు ఉంటే తప్పు చేసిన వారిని శిక్షించాలని మోహన్‌లాల్ అభిప్రాయపడ్డారు. మలయాళ చిత్ర పరిశ్రమ భవిష్యత్తు సమస్యల్లో పడిందని ఆయన అంగీకరించాడు. ఈ క్లిష్ఠ సమయంలో 2025 జూన్‌లో అమ్మ జనరల్ బాడీ సమావేశం, ఎన్నికలు జరగనున్నాయి.
తాజా అప్‌డేట్‌ల ప్రకారం.. మోహన్‌లాల్ ఆ పదవికి తిరిగి రాలేనని ధృవీకరించారు. మలయాళ మనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్‌లాల్ తన వైఖరిపై గట్టిగానే ఉన్నాడు. తాను అమ్మ ఆఫీస్ బేరర్ పాత్రకు తిరిగి రావడం లేదు. జూన్‌లో జనరల్ బాడీ మీటింగ్, అమ్మ ఎన్నికలు జరగనున్నందున దీనికి చాలా ప్రాధాన్యత ఉండటంతో ఆయన వ్యాఖ్య చర్చగా మారింది.
అయితే పాత ఎగ్జిక్యూటివ్ కమిటీని పునరుద్ధరించాలని సినీనటుడు సురేష్ గోపి, అమ్మా మాజీ ఉపాధ్యక్షుడు జయన్ చేర్యాల ఇదివరకే సూచించారు. మోహన్‌లాల్ ఆ పదవిని చేపట్టడానికి నిరాకరించడంతో సంస్థకు ఎవరు నాయకత్వం వహిస్తారనే ప్రశ్నపైనే అందరి దృష్టి ఉంది. హేమా కమిషన్ నివేదికను బహిర్గతం చేసిన తర్వాత పరిశ్రమలో కొంత గందరగోళం నెలకొంది. ఈ ఆగస్టులో మోహన్‌లాల్ అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. . లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిక్ గతంలో కేరళ చలనచిత్ర అకాడమీ, అమ్మలో వరుసగా తమ నాయకత్వ పాత్రల నుండి వైదొలిగారు.
గతంలో మీడియాతో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. పక్కా ఆధారాలు ఉంటే తప్పు చేసిన వారిని శిక్షించాలని అన్నారు. ఈ సమస్యలు తప్పకుండా మలయాళ చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపుతాయని మోహన్‌లాల్ అన్నారు.
ఇండస్ట్రీ భవిష్యత్ పై భయాందోళనలు ఉన్నాయని, దానిని రక్షించడానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని అన్నారు. `పవర్ గ్రూప్` అనే పదాన్ని ప్రస్తావిస్తూ, చిత్ర పరిశ్రమలో అలాంటి గ్రూపు ఏదీ లేదని ఆయన అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... మోహన్‌లాల్ ఇటీవల తన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఎల్ 2: ఎంపురాన్` విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం 27 మార్చి 2025లో విడుదలవుతుంది.