ఓటీటీ గుప్పిట్లో సినీ ఇండస్ట్రీ.. 3 వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్స్!
డిజిటల్ వేదికలు వచ్చిన తర్వాత, థియేటర్ వ్యవస్థ మీద ప్రభావం పడే ప్రమాదం ఉందంటూ కోవిడ్ పాండమిక్ టైంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి
డిజిటల్ వేదికలు వచ్చిన తర్వాత, థియేటర్ వ్యవస్థ మీద ప్రభావం పడే ప్రమాదం ఉందంటూ కోవిడ్ పాండమిక్ టైంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే డిజిటల్ రైట్స్ రూపంలో ఓటీటీ సంస్థలు భారీ డీల్స్ ఇస్తుండటంతో, ఫిలిం మేకర్స్ అందరూ అదనపు ఇన్ కమ్ వస్తుందని భావించారు. థియేటర్లలో రెవెన్యూ రాబట్టలేకపోయినా, ఓటీటీ హక్కులతో నష్టాల నుంచి బయటపడొచ్చని అనుకున్నారు. అందుకే సినిమాలను ఎర్లీ స్ట్రీమింగ్ కి ఇస్తూ వచ్చారు. మొదట్లో ఇది బాగానే ఉంది కానీ, రాను రానూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సినీ ఇండస్ట్రీని తమ కంట్రోల్ లోకి తీసుకున్నాయి.
పాండమిక్ తర్వాత థియేట్రికల్ రిలీజైన సినిమాలు నెల రోజులు తిరక్కండానే ఓటీటీలోకి వచ్చేస్తుండంతో.. జనాలు సినిమా హాళ్ళకు రావడం తగ్గించేసారు. చాలా సెలెక్టివ్ గా ఈవెంట్ సినిమాలు, టాక్ బాగున్న సినిమాలను మాత్రమే థియేటర్లలో చూస్తున్నారు. దీంతో మన టాలీవుడ్ పెద్దలు మీటింగ్ పెట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధియేటర్ సిస్టమ్ ను బతికించుకోడానికి 50 రోజుల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలనే రూల్ పెట్టుకున్నారు. కానీ రియాలిటీలో మాత్రం అది ఆచరణ సాధ్యం కాలేదు.
థియేట్రికల్ రిలీజైన 8 వారాల తరవాత సినిమాలను ఓటీటీలోకి తీసుకురావాలని నిబంధనలు పెట్టుకున్నప్పటికీ, మూడు నాలుగు వారాలకే స్ట్రీమింగ్ చేయడం స్టార్ట్ చేశారు. 'కృష్ణమ్మ' లాంటి కొన్ని తెలుగు సినిమాలైతే మరీ వారం రోజుల్లోనే డిజిటల్ వేదికల మీదకు వచ్చాయి. చిన్న సినిమాలే కాదు.. మీడియం రేంజ్ మూవీస్, స్టార్ హీరోల చిత్రాలు కూడా ఎర్లీ స్ట్రీమింగ్ చేయడం ఇండస్ట్రీలో కొన్నాళ్ళు హాట్ టాపిక్ గా నడిచింది.
కట్ చేస్తే, ఇప్పుడు టాలీవుడ్ పూర్తిగా ఓటీటీ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఓటీటీ సంస్థలు నిర్ణయించిన స్లాట్స్ కు అనుగుణంగా థియేట్రికల్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. మంచి రేటుకి డిజిటల్ అగ్రిమెంట్ జరగాలంటే, వాళ్ళు చెప్పిన తేదీలకు విడుదల చేయాల్సిందే. ఎక్కువ రెవెన్యూ ఓటీటీ హక్కుల రూపంలో వస్తోంది కాబట్టి, ఫిలిం మేకర్స్ సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం కేవలం ఓటీటీ కోసమే సినిమాని ఫాస్ట్ గా రెడీ చేసి, థియేటర్లలో రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇటీవల కాలంలో సినిమాలన్నీ డిజిటల్ డీల్స్ ప్రకారమే థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి.. విడుదలైన నెల రోజుల్లోపే OTTలోకి వచ్చేస్తున్నాయి. వరుణ్ తేజ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'మట్కా' నవంబర్ 14న రిలీజైంది. అయితే 21 రోజుల్లోనే సైలెంట్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అంతకముందు నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా కూడా మూడు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ చేయబడింది.
దీపావళికి విడుదలైన దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్'.. కిరణ్ అబ్బవరం 'క' సినిమాలు 28 రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేశాయి. శివ కార్తికేయన్ నటించిన 'అమరన్' మూవీ మాత్రం 35 రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. నవంబర్ 14న థియేటర్లలో రిలీజైన సూర్య 'కంగువ' సినిమా డిసెంబరు 8న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. అంటే ఈ సినిమా 28 రోజుల్లోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వస్తోందన్నమాట.
ఇలా ఇటీవలి కాలంలో హిట్టయిన సినిమాలు, ఫ్లాప్ అయిన చిత్రాలు నెల రోజుల లోపలే OTTలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే సినీ ప్రియులు థియేటర్లకు రావడం చాలా తగ్గించారు. ఇప్పుడు హిట్ సినిమాలను కూడా ఎర్లీగా స్ట్రీమింగ్ చేసే విధానం ఇలాగే కొనసాగితే, ఎలాగూ మూడు నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుందిలే అనే భావన జనాల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే రాను రాను థియేటర్ల ఆక్యుపెన్సీ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.