మూవీ రివ్యూ : మిస్టర్ బచ్చన్

వేరే భాషల నుంచి కథలు అరువు తెచ్చుకున్నా.. వాటికి తనదైన టచ్ ఇచ్చి మంచి కమర్షియల్ సినిమాలుగా మలిచే దర్శకుడు హరీష్ శంకర్.

Update: 2024-08-15 02:22 GMT

'మిస్టర్ బచ్చన్' మూవీ రివ్యూ

నటీనటులు: రవితేజ-భాగ్యశ్రీ బోర్సే-జగపతిబాబు-తనికెళ్ల భరణి-సచిన్ ఖేద్కర్-గౌతమి-సత్య-శుభలేఖ సుధాకర్-ఆడుగళం నరేన్-చమ్మక్ చంద్ర-ప్రభాస్ శీను తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

ఛాయాగ్రహణం: అయానాంకా బోస్

కథ: రితీష్ షా

స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి-సతీశ్ వేగేశ్న-ప్రవీణ్ వర్మ-దత్తాత్రేయ-తన్వి కేసరి

నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్

మాటలు-మార్పులు-దర్శకత్వం: హరీష్ శంకర్

వేరే భాషల నుంచి కథలు అరువు తెచ్చుకున్నా.. వాటికి తనదైన టచ్ ఇచ్చి మంచి కమర్షియల్ సినిమాలుగా మలిచే దర్శకుడు హరీష్ శంకర్. 'దబంగ్'ను 'గబ్బర్ సింగ్'గా.. 'జిగర్ తండ'ను 'గద్దలకొండ గణేష్'గా అతను మలిచిన తీరు ప్రశంసలందుకుంది. ఇప్పుడు హిందీ హిట్ 'రైడ్'ను తెలుగులో 'మిస్టర్ బచ్చన్' పేరుతో రీమేక్ కాని రీమేక్ చేశారు హరీష్. రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హరీష్ మరోసారి మెప్పించాడా.. చూద్దాం పదండి.

కథ:

80వ దశకంలో ఆదాయపు పన్ను అధికారిగా 70కి పైగా రైడ్స్ చేసి మంచి పేరు సంపాదిస్తాడు బచ్చన్ (రవితేజ). అతడి అసలు పేరు ఆనంద్ అయినప్పటికీ.. 'షోలే' సినిమాతో అమితాబ్ బచ్చన్ వీరాభిమానిగా మారిన తన తండ్రి బచ్చన్ అని పేరు మార్చేస్తాడు. ఆ పేరుతోనే అతను పాపులర్ అవుతాడు. ఐతే ఒక ఐటీ రైడ్ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య అతను సస్పెండ్ అవుతాడు. దీంతో తన ఊరికి వచ్చేసి ఒకప్పటి వ్యాపకమైన ఆర్కెస్ట్రాలో సింగర్ గా కొనసాగుతుంటాడు. ఈ క్రమంలోనే తన ఊరికే చెందిన జిక్కి (భాగ్యశ్రీ బోర్సే)తో ప్రేమలో పడతాడు. నెమ్మదిగా జిక్కి కూడా బచ్చన్ ను ప్రేమిస్తుంది. వీళ్లిద్దరి పెళ్లికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో బచ్చన్ మీద సస్పెన్షన్ ఎత్తేసిన ప్రభుత్వం.. అతణ్ని ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) అనే పవర్ ఫుల్ పొలిటీషియన్ ఇంటి మీదికి ఐటీ రైడ్ కు పంపిస్తుంది. అప్పటికే జగ్గయ్య తమ్ముడితో వైరం పెట్టుకున్న బచ్చన్.. రైడ్ కు వెళ్లాక అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నింటినీ అతనెలా అధిగమించాడు.. మరోవైపు జిక్కితో తన పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

అందరికీ అన్ని రుచులూ నచ్చవు. కొందరికి రుచి లేకపోయినా.. చప్పగా ఉన్నా సరే ఆరోగ్యకరమైన వంటకమే నచ్చుతుంది. కొందరేమో ఆ చప్పిడి కూడేం తింటాం.. ఆరోగ్యం సంగతి తర్వాత రుచే ముఖ్యం అంటారు. ఎవరి అభిరుచి వారిది. సినిమాను ఓ వంటకం భావిస్తే.. మనకు అంత రుచిగా అనిపించదు అనుకునే వేరే వాళ్ల వంటకానికి తనదైన శైలిలో మసాలా అద్ది దాన్ని మన వాళ్లకు రుచించేలా తయారు చేస్తాడని దర్శకుడు హరీష్ శంకర్ కు పేరుంది. దబంగ్.. జిగర్ తండ లాంటి పరభాషా సినిమాలను అతను మన వాళ్లకు నప్పేలా మార్చి మంచి మార్కులే కొట్టేశాడు. ఐతే దబంగ్.. జిగర్ తండ చిత్రాలను చెడగొట్టాడు అనే వాళ్లు కూడా లేకపోలేదు. కానీ ఆ సినిమాలు ఎక్కువమందికి నచ్చాయి. ఇప్పుడు అదే శైలిలో హరీష్ శంకర్ 'రైడ్'కు తెలుగు మసాలాలు అద్దడానికి ట్రై చేశాడు. కానీ ఈసారి అతను అద్దిన మసాలాలు ఆ వంటకానికి సరిగా పట్టలేదు. ఒరిజినల్ వంటకం రూపు రేఖలు పూర్తిగా మారిపోయి.. కొత్తగా మసాలాలూ సరిగా కలవక.. టేస్టు సోసోగా తయారైంది.

రీమేక్ సినిమా అన్నాక మాతృకతో పోలికల గురించి మాట్లాడుకుండా ఉండలేం. అందులోనూ హరీష్ శంకర్ టైటిల్ క్రెడిట్స్ లో 'మార్పులు' అని ప్రత్యేకంగా వేసుకుంటాడు కూడా. మరి ఆ మార్పులు ఎంతమేర పని చేశాయన్నదే తన రీమేక్ సినిమాల ఫలితాలను నిర్ధేశిస్తాయి. ఈ సినిమాకు ఆధారమైన 'రైడ్' హరీష్ శంకర్ చెప్పినట్లే ఒక డాక్యుమెంటరీ లాగే అనిపిస్తుంది. వాస్తవంగా జరిగిన ఘటనలనే ఆధారంగా చేసుకుని సాధ్యమైనంత వరకు రియలిస్టిగ్గా సినిమా తీశారు 'రైడ్' మేకర్స్. 80వ దశకంలో పేరొందిన ఓ బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్ మీద ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన రైడ్ ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దుకున్నారు. సినిమాకు తగ్గట్లుగా ఆ రైడ్లో దొరికిన డబ్బుల మొత్తాన్ని మల్టిప్లై చేశారు.. కొంత డ్రామా జోడించారు కానీ.. అందులో హీరోయిక్ ఎలివేషన్లు.. ఫైట్లు.. సవాళ్లు.. పంచ్ డైలాగులు ఏమీ ఉండవు. అంతా సటిల్ గా నడిచిపోతుంది. మొత్తం సినిమా కేవలం ఆ ఒక్క రైడ్ మీదే నడుస్తుంది. అంటే ఆరంభ సన్నివేశం నుంచి ముగింపు వరకు ప్రతిదీ ఆ రైడ్ తో ముడిపడే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రవితేజ ఓ డైలాగ్ లో చెప్పినట్లు.. 'అసలు రైడ్' ఇంటర్వెల్ దగ్గర కానీ మొదలు కాదు. అంతకుముందు వచ్చేదంతా హరీష్ శంకర్ కల్పితం అన్నమాట. కానీ ఆ కల్పిత కథలో పెద్దగా సృజనాత్మకత అయితే కనిపించదు. కొన్ని కామెడీ మెరుపులు.. కొత్త కథానాయిక భాగ్యశ్రీ బోర్సే అందాన్ని ఎలివేట్ చేసే రొమాంటిక్ సీన్లు-పాటలు.. హీరో ఎలివేషన్లతో రొటీన్ కాలక్షేపమే అన్నమాట. ఈ అడిషన్ల వల్ల అసలు కథ పలుచన అయిపోయింది. మాతృకలో చూసిన మొత్తం సినిమాను ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చూస్తాం. ఇక్కడ కూడా హరీష్ స్టైల్లోనే కథ నడుస్తుంది తప్ప ఒరిజినల్లో ఉన్న ఇంటెన్సిటీ కనిపించక ఆ వ్యవహారం కూడా ఏదో అలా అలా అలా సాగిపోతూ ఉంటుంది తప్ప పెద్దగా ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు.

హరీష్ శంకర్ సినిమా అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లాగా నడిచిపోతుందని పేరు. కానీ 'మిస్టర్ బచ్చన్'లో మాత్రం ఆ స్పీడు కనిపించదు. మాతృకకు మసాలాలు అద్దే క్రమంలో సినిమాను సాగతీతగా తయారు చేశాడు హరీష్. ఐతే ఫస్టాఫ్ వరకు సత్య కామెడీ.. కొన్ని రొమాంటిక్ సీన్లు రిలీఫ్ ఇస్తాయి. హీరో పరిచయ సన్నివేశాలు బాగున్నాయి. హీరో ఫస్ట్ రైడ్ చూశాక సినిమాకు మూలమైన అసలు రైడ్ మీద అంచనాలు పెంచుకుంటాం. ఐతే ఆ ఎపిసోడ్ మధ్య బ్రేకిచ్చి రొమాంటిక్ ట్రాక్.. కామెడీ మీద కథను నడిపించాడు హరీష్. భాగ్యశ్రీ అందాల మీదే ఫోకస్ పెట్టిన రొమాంటిక్ ట్రాక్.. పాటలు యువతను ఆకట్టుకుంటాయి. సత్య కామెడీ కూడా టైంపాస్ చేయిస్తుంది. కానీ కామెడీ డోస్ ఇంకొంచెం పెంచాల్సిందనిపిస్తుంది. మధ్యలో వచ్చే హీరో ఎలివేషన్ సీన్ కూడా బాగానే పండింది.

విలన్ తో హీరో ఫేసాఫ్ కు దారి తీసే రైడ్ దగ్గర ఇంటర్వెల్ బ్యాంగ్ వేయడం కూడా బాగుంది. కానీ ద్వితీయార్ధం మాత్రం అంచనాలకు తగ్గట్లు సాగదు. రవితేజ ఇమేజ్ కు తగ్గట్లుగా హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం.. ఎలివేషన్ సీన్లు ఓకే అనిపిస్తాయి కానీ.. రైడ్ తాలూకు ఉత్కంఠ మాత్రం మిస్సయింది. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ లేకుండా ద్వితీయార్ధం బోరింగ్ గా తయారైంది. హీరోకు ఎదురే లేదన్నట్లు చూపించడం.. విలన్ నుంచి పెద్దగా ఛాలెంజే లేకపోవడంతో సినిమా ఏకపక్షంగా మారిపోయింది. సందర్భానుసారంగా పాటలు రావాలే కానీ.. ఇందులో పాటల కోసం సందర్భాలు సృష్టించిన దర్శకుడు వాటిని పెద్ద స్పీడ్ బ్రేకర్లలా మార్చేశాడు. ముఖ్యంగా ఒరిజినల్లో ఇంటెన్స్ గా అనిపించే రైడ్ తాలూకు ఎపిసోడ్ ఇక్కడ చాలా సాధారణంగా తయారవడానికి ఈ బ్రేకులే కారణం. సీరియస్ గా రైడ్ చేస్తున్న హీరో మధ్య మధ్యలో పాటల కోసం బ్రేక్ తీసుకుని వెళ్లిరావడం చిరాకు పెట్టిస్తుంది. ఒక దశ దాటాక ఇంకెప్పుడు ముగిస్తారనే ఫ్రస్టేషన్ ప్రేక్షకుల్లో మొదలవుతుంది. పతాక సన్నివేశాలు కూడా మామూలుగా అనిపిస్తాయి. అంతకంటే ముందు సిద్ధు జొన్నలగడ్డ క్యామియోతో కొంత హుషారు పుట్టించాడు. కానీ సినిమాను మాత్రం పైకి లేపలేకపోయాడు. మొత్తంగా చూస్తే 'రైడ్'ను మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు చేసిన మార్పులు చేర్పులు జస్ట్ ఓకే అనిపించినా.. ఒరిజినల్లో ఉన్న ఆత్మ మిస్సవడం వల్ల 'మిస్టర్ బచ్చన్' జస్ట్ ఓకే సినిమాగా తయారైంది.

నటీనటులు:

తన చివరి చిత్రాల్లో మాస్ రాజా రవితేజ అంత హుషారుగా కనిపించకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఐతే 'మిస్టర్ బచ్చన్'లో రవితేజను ఫుల్ ఎనర్జీతో చూడొచ్చు. తన అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చేలా రవితేజ కనిపించాడు. తన మార్కు అల్లరి.. హీరో ఎలివేషన్లు.. మాస్ డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. తన వరకు రవితేజ పూర్తిగా మెప్పించాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సినిమాకు ఆకర్షణ అయింది. ఆమెను చాలా అందంగా.. సెక్సీగా చూపించాడు హరీష్ శంకర్. పాటల్లో భాగ్యశ్రీ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. తన నటన పర్వాలేదు. సొంతంగా చెప్పుకున్న డబ్బింగ్ బాగుంది. విలన్ పాత్రలో జగపతిబాబు నిరాశపరిచాడు. ఆయన నటన.. హావభావాలు కృత్రిమంగా అనిపించాయి. ముఖ్యంగా మాతృకలో సౌరభ్ శుక్లా పాత్ర చూసిన వాళ్లు ఈ పాత్రను కాసేపు కూడా భరించలేదు. గెటప్ డిఫరెంటుగా ట్రై చేశారు కానీ.. ఆ పాత్రలో మాత్రం పెద్దగా వైవిధ్యం కనిపించదు. సత్య కామెడీ సినిమాలో పెద్ద రిలీఫ్. కనిపించిన ప్రతిసారీ నవ్వులు పూయించాడు. తన పాత్రను ఇంకా పెంచి ఉంటే బాగుండేదనిపిస్తుంది. సచిన్ ఖేద్కర్.. తనికెళ్ల భరణి.. మిగతా నటీనటులంతా ఓకే. సిద్ధు జొన్నలగడ్డ క్యామియో బాగుంది.

సాంకేతిక వర్గం:

మిక్కీ జే మేయర్ తాను మాస్ సినిమాలకు సూటయ్యే సంగీతాన్నివ్వగలనని మరోసారి చాటాడు. పాటలు.. బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్ అనలేం కానీ.. సినిమాకు అవసరమైన స్థాయిలో సాగాయి. సితార్ సాంగ్ అన్నింట్లోకి ప్రత్యేకంగా అనిపిస్తాయి.. మిగతా పాటలు పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఓకే. కెమెరామన్ అయానాంకా బోస్ విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. సినిమా విజువల్ గా బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ విషయానికి వస్తే.. రీమేక్ సినిమాలను మన నేటివిటీకి తగ్గట్లుగా మలచడంలో తన నైపుణ్యాన్ని అతను మరోసారి చూపించాడు. మార్పులు చేర్పుల్లో తన కృషి తెర మీద కనిపిస్తుంది. పూర్తిగా ఓ కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు. కానీ కంటెంట్ పరంగా.. ఇంటెన్సిటీ విషయంలో మాతృకతో ఇది సరితూగదు. ఇది ఒక రీమేక్ అని మరిచిపోయి మామూలుగా చూస్తే అంత ఎంగేజింగ్ గా అనిపించదు. అతను సరైన రీమేక్ ను ఎంచుకోలేదనే ఫీలింగ్ కలుగుతుంది. రచయితగా.. దర్శకుడిగా హరీష్ కష్టాన్ని తక్కువ చేయలేం. అదే సమయంలో అతను గొప్ప పనితనాన్నీ చూపించలేకపోయాడు.

చివరగా: మిస్టర్ బచ్చన్.. మసాలా పట్టలేదు

రేటింగ్- 2.25/5

Tags:    

Similar News