శక్తిమాన్ పాత్రకు సీనియర్ నటుడి సిఫార్సు..అల్లు అర్జున్ రెడీనా?
ఈ నటుడి(అల్లు అర్జున్)కి నెక్ట్స్ `శక్తిమాన్` కావాల్సిన లక్షణాలు ఉన్నాయని ముఖేష్ ఖన్నా అభిప్రాయపడ్డారు.
శక్తిమాన్ పాత్రతో దేశవ్యాప్తంగా పాపులరైన ప్రముఖ హిందీ నటుడు ముఖేష్ ఖన్నా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన సూపర్ హీరో. అతడు 90ల నాటి మహాభారత సిరీస్‌లో భీష్మ పాత్రను కూడా పోషించాడు. ముఖేష్ ఖాన్నా తన యూట్యూబ్ ఛానెల్ `భీష్మ్ ఇంటర్నేషనల్`లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఈ వారం అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2: ది రూల్`ని ముఖేష్ ఖన్నా సమీక్షించారు. ఈ సినిమా తనకు ఎంత నచ్చిందో, అందులో అల్లు అర్జున్ అంతకుమించి తనకు నచ్చాడని అతడి నటనను ఆకాశానికెత్తేశారు ఈ వెటరన్ నటుడు. ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికి ప్రతి పైసా గిట్టుబాటు అవుతుందని, తెలుగు సినిమాలను చూసి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని కూడా కితాబిచ్చారు. వారు కేవలం డబ్బుతో సినిమా తీయలేదు. గొప్ప ప్లానింగ్ తో తీసారు. పుష్పలో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క రూపాయి తెరపై కనిపిస్తుంది అని అన్నారు.
ఈ నటుడి(అల్లు అర్జున్)కి నెక్ట్స్ `శక్తిమాన్` కావాల్సిన లక్షణాలు ఉన్నాయని ముఖేష్ ఖన్నా అభిప్రాయపడ్డారు.
పుష్ప 2 ప్రారంభ సన్నివేశం గురించి ముఖేష్ ఖన్నా విశ్లేషించారు. ఇందులో సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ తనను గాల్లో తేలేలా చేసారని .. అంత గొప్పగా నటించారని ప్రశంసించారు. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలను చూపిస్తే ఇలా చూపించాలి. అప్పుడే ప్రజలు దానిని అంగీకరిస్తారు. చూపించే విధానం చాలా ముఖ్యమని శక్తిమాన్ పాత్రధారి అయిన ముఖేష్ ఖన్నా అభిప్రాయపడ్డారు. పుష్ప పాత్ర మనల్ని లాజిక్‌ను మరచిపోయేలా చేస్తుందని అన్నారు.
ముఖేష్ ఖన్నా అల్లు అర్జున్ నటనకు 10కి 9 మార్కులు వేసారు. సౌత్ స్టార్ అల్లు అర్జున్ తన `శక్తిమాన్` పాత్రను తిరిగి పోషిస్తే చూడాలనుందని కూడా అన్నారు. అతడు మాత్రమే ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని ప్రశంసించారు. పుష్ప 2: ది రూల్ అత్యంత వేగంగా రూ. 1000 కోట్ల మార్కును అధిగమించి, కల్కి 2898 AD రికార్డును కూడా బ్రేక్ చేసి 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది.
నిజానికి `శక్తిమాన్` పాత్రలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ చాలా ప్రయత్నించారు. అతడు శక్తిమాన్ పాత్ర పేటెంట్ హక్కుదారు అయిన ముఖేష్ ఖన్నాను కలిసి ఒప్పించాలని ట్రై చేసారు. సీనియర్ నటుడు, శక్తిమాన్ పాత్రధారి అయిన ముఖేష్ ఖన్నా ఇంట గంటల కొద్దీ సమయం గడిపారు. చాలా ప్రయత్నం చేసారు. కానీ అందుకు అతడు ససేమిరా అన్నాడు. రణవీర్ అద్భుత నటుడే కానీ శక్తిమాన్ పాత్రకు సరిపోడని వ్యాఖ్యానించారు. శక్తిమాన్ పాత్రకు ఎవరు సరిపోతారో మునుముందు చెబుతానని కూడా అన్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును సిఫార్సు చేసారు. దేశవ్యాప్తంగా గొప్ప అభిమానులున్న సీనియర్ నటుడు తనకు తానుగా అల్లు అర్జున్ ని సిఫార్సు చేయడం అంటే ఆషామాషీ కాదు. దీనిని అతడు గౌరవంగా భావించి, వెంటనే ఆ పాత్రను ఛేజిక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.