పుష్ప 2 బుకింగ్స్.. మైత్రి మరో కొత్త స్ట్రాటజీ..
ప్రస్తుతం అంతా ఆన్ లైన్ మూవీ టికెట్ బుకింగ్స్ మ్యానియా నడుస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అంతా ఆన్ లైన్ మూవీ టికెట్ బుకింగ్స్ మ్యానియా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉండగా.. వాటిలో బుక్ మై షో కొన్నేళ్లుగా టాప్ లో కొనసాగుతోంది. ఇప్పుడు దానికి పోటీగా జొమాటో.. డిస్ట్రిక్ యాప్ ను తీసుకొచ్చింది. దాని ద్వారా సినిమాలు, డైరెక్ట్ షోలు, క్రీడా ఈవెంట్ ల కోసం టిక్కెట్ బుకింగ్ లను చేసుకోవచ్చు.
గత ఆగస్టులో రూ. 2వేల కోట్లకుపైగా డీల్ తో పేటీఎం ఎంటర్టైన్మెంట్, టికెటింగ్ బిజినెస్ ను కొనుగోలు చేసిన జొమాటో.. ఇప్పుడు వినోద రంగంలో సత్తా చాటాలని చూస్తోంది. సరైన టైమ్ చూసి రంగంలోకి దిగింది. మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప సీక్వెల్ తో టికెట్స్ బుకింగ్ సర్వీస్ ను మొదలు పెట్టింది. సినిమాను ప్రమోట్ చేస్తూ తన బిజినెస్ తో అదరగొడుతోంది.
అదే సమయంలో డిస్ట్రిక్ యాప్ తో టాలీవుడ్ ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ కు సంబంధించిన మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వేరే లెవెల్ లో పెయిర్ అప్ అయినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున డీల్ కూడా కుదుర్చుకున్నట్లు అర్థమవుతోంది. డిస్ట్రిక్ యాప్ లోనే తొలుత పుష్ప 2 టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. పుష్పను మైత్రీ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
నిజానికి.. టికెటింగ్ ప్లాట్ ఫామ్స్ బుకింగ్ ఛార్జ్ ను రూ.12 నుంచి రూ.36 మధ్య వసూలు చేస్తుంటాయి. దానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. రూ.74 లోపు టికెట్ ధరకు రూ.12 బుకింగ్ ఛార్జ్ తీసుకుంటాయి. రూ.400 కన్నా ఎక్కువ ధరకు రూ.36 రుసుము వసూలు చేస్తాయి. అందులో కొంత మొత్తాన్ని థియేటర్లకు చెల్లిస్తాయి. అది కూడా అడ్వాన్స్ గానే చెల్లిస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు.
అయితే బుక్ మై షో.. థియేటర్స్ కు బుకింగ్ ఛార్జీల్లో 30-40 శాతం ఇస్తుందట. ఆ విషయంలో థియేటర్స్ సంతృప్తి చెందడం లేదని సమాచారం. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదే భావనలో ఉందట. దీంతో ఇప్పుడు డిస్ట్రిక్ యాప్ తో బుకింగ్ ఫీజులో 50% పొందేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో అడ్వాన్స్ ను ఇప్పటికే డిస్ట్రిక్ యాప్ చెల్లించదట. అందుకే డిస్ట్రిక్ యాప్ లో మైత్రీ సంస్థ సొంత థియేటర్లు, లీజుకు తీసుకున్న థియేటర్ల టికెట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి.
అదే సమయంలో బుక్ మై షో రేటింగ్ ఫీచర్ పై కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. అవి సినిమాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మైత్రీ సంస్థ.. బుక్ మై షో కాకుండా ఇప్పుడు డిస్ట్రిక్ యాప్ ను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసిందని వినికిడి. మరి రానున్న రోజుల్లో బుక్ మై షోకి డిస్ట్రిక్ యాప్ బీట్ చేస్తుందో వేచి చూడాలి.