శోభితలో ఆ టాలెంట్ ను ఎవరూ చూడలేకపోతున్నారట!
పెళ్లి తర్వాత జీవితం, అదృష్టం అన్నీ మారతాయంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైతం దీనికి అతీతులు కాదు.;
పెళ్లి తర్వాత జీవితం, అదృష్టం అన్నీ మారతాయంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైతం దీనికి అతీతులు కాదు. గత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్య వరుస ఫ్లాపులతో కెరీర్ లో బాగా వెనుకబడిన విషయం తెలిసిందే. ఫ్లాపుల్లో ఉన్న చైతన్య, శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత తండేల్ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తండేల్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని లేకపోతే ఇంట్లో పరువు పోతుందని సభా ముఖంగా చైతూ చెప్పిన విషయం తెలిసిందే. ఆఖరికి తండేల్ హిట్ అవడంతో రిలాక్స్ అయ్యాడు.
చైతన్య, శోభిత ప్రేమించుకుని డిసెంబరులో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తండేల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండటం వల్ల పెళ్లయ్యాక వారిద్దరూ ఎక్కడికీ వెళ్ళింది కూడా లేదు. రీసెంట్ గా హనీమూన్ కోసం మెక్సికో వెళ్లొచ్చిన ఈ జంట రీసెంట్ గా వోగ్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చైతన్య శోభిత గురించి పలు విషయాలను వెల్లడించాడు.
శోభిత తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతుందని, ఆ విషయం తనకు బాగా నచ్చుతుందని చెప్పాడు చైతన్య. తమ ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడతారని, కానీ తాను చెన్నైలో ఉండి చదువుకోవడం వల్ల తమిళం ఎక్కువగా అలవాటైందని, బయటకు వెళ్తే తమిళం, ఇంగ్లీష్ లోనే ఎక్కువగా మాట్లాడతానని, ఇంట్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడతానని చైతూ తెలిపాడు.
అంతేకాదు శోభిత తెలుగు ముందు తన భాష దేనికీ పనికిరాదని, తనకు తెలుగు నేర్పించమని శోభితను అడుగుతుంటానని చైతూ చెప్పుకొచ్చాడు. శోభిత ఎంతో తెలివైందని, ఆ తెలివిని తనక్కూడా ఇవ్వమని చెప్తుంటానని అంటున్న చైతన్య, తన భార్య ఫోటోల్లో పెద్దగా నవ్వదని, ఎందుకలా ఉంటావ్, కాస్త నవ్వుతూ ఫోటోలు దిగొచ్చుగా అంటే లోపల నేను నవ్వుతూనే ఉన్నాను, మీరెవరూ దాన్ని చూడలేకపోతున్నారంటుదని, తమ పెళ్లి తంతు మొత్తాన్ని శోభితనే దగ్గరుండి ప్లాన్ చేసిందని చైతన్య వెల్లడించాడు.