కొండా సురేఖపై నాగ్ పరువు నష్టం దావా.. తీర్పు ఎప్పుడంటే?

అయితే ఇరుపక్షాల వాదనలను విన్న నాంపల్లి కోర్టు.. నవంబర్ 28వ తేదీన తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది.

Update: 2024-11-22 06:02 GMT

టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం అందరికీ తెలిసిందే. హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి కారణం భారాస నేత కేటీఆర్ అని కొద్ది రోజుల క్రితం మీడియా ముందు సురేఖ వ్యాఖ్యానించడంతో పెను దుమారం రేపింది.

దీంతో నాగార్జున ఫ్యామిలీ, సమంత.. కొండా సురేఖపై తీవ్రంగా మండిపడ్డారు. అనేక మంది సినీ ప్రముఖులు కూడా స్పందించారు. అదే సమయంలో నాగార్జున.. తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే నాగార్జునతో పాటు ఆయన కుటుంబసభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.

అయితే పరువు నష్టం కేసులో ఇటీవల నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున వేసిన దావాకు సంబంధించిన కౌంటర్‌ ను కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ దాఖలు చేశారు. కేటీఆర్‌ వల్ల కొంతమంది ఆడపిల్లలు ఇబ్బందిపడ్డారనే కోణంలో సమంతను సురేఖ ఉదాహరించారని న్యాయవాది గురుప్రీత్ సింగ్ తెలిపారు.

అంతకుమించి కొండా సురేఖ వ్యాఖ్యల్లో మరో కోణం లేదని తన వాదనలో పేర్కొన్నారు. పిటిషనర్ వేరొకరి అభిప్రాయాలతో పిటిషన్‌ వేశారని ఆరోపించారు. దావాను కొట్టివేయాలని వాదనలో భాగంగా కోర్టును కోరారు. అయితే కోర్టులో నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

ఆ తర్వాత ఎక్స్‌ లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారని చెప్పారు. మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును కూడా ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు సరైంది కాదని అశోక్‌ రెడ్డి కోర్టుకు తెలిపారు. అందుకే కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు.

సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా చాలా కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు చెప్పారు. అయితే ఇరుపక్షాల వాదనలను విన్న నాంపల్లి కోర్టు.. నవంబర్ 28వ తేదీన తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది. మరి నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో వేచి చూడాలి.

Tags:    

Similar News