కుబేరకు కింగ్ తోడైతే!

ధనుష్ కు తోడుగా నాగార్జున స్టార్ డమ్ కూడా ఈ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఆయన ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

Update: 2024-07-29 23:30 GMT

తమిళ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడుగా టాలీవుడ్ కు పరిచయమైన ధనుష్.. వైవిధ్యమైన సినిమాలతో విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'సార్' మూవీతో డైరెక్ట్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. ఆ తర్వాత వచ్చిన 'కెప్టెన్ మిల్లర్' సినిమా ఇక్కడ పెద్దగా ఆడకపోయినా, ఇప్పుడు లేటెస్టుగా 'రాయన్' చిత్రంతో మరోసారి ఆకట్టుకున్నారు.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''రాయన్''. ఇది ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ 50వ సినిమా. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. గత శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 75 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, 100 కోట్ల దిశగా పయనిస్తోంది. విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా హైప్ క్రియేట్ అవ్వకపోయినా బీ, సీ సెంటర్స్ లో ఆదరణ దక్కుతోంది. టాలీవుడ్ లో ధనుష్ కు పెద్దగా స్టార్‌డమ్ లేనప్పటికీ, సందీప్ కూడా యాడ్ అవ్వడం ఈ సినిమాకు ప్లస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

'రాయన్' మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ధనుష్ నుంచి రాబోయే 'కుబేర' సినిమా గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో కింగ్ అక్కినేని నాగార్జున ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన క్యారక్టర్ పోస్టర్లు, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ కూడా ఆకట్టుకుంది. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల.. ఈసారి తన పంధా మార్చి విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు అర్థమవుతోంది.

తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందుతున్న 'కుబేర' సినిమాపై సినీ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ధనుష్ కు తోడుగా నాగార్జున స్టార్ డమ్ కూడా ఈ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఆయన ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 'నా సామిరంగా' సక్సెస్ తో నాగ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ఇది కచ్చితంగా కుబేర చిత్రానికి హెల్ప్ అవుతుంది. ఇక శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసే ఆడియన్స్ ఉన్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఉండనే ఉంది. కాబట్టి ధనుష్ సినిమా ఓపెనింగ్స్ కు ఇబ్బంది లేదు. కంటెంట్ జనాలకు కనెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ కు చేరే అవకాశం ఉంటుంది.

'కుబేర' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లుగా వర్క్ చేస్తున్నారు. 2025 ప్రథమార్థంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News