మరో హిట్ కోసం పెన్ను పట్టిన నాని
నానితో సినిమా అంటే 50 కోట్ల బడ్జెట్ అయిన నిర్మాతలు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు.
నాచురల్ స్టార్ నాని కెరియర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలకి వర్క్ చేసాడనే సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత ఇంద్రగంటి దృష్టిలో పడి అష్టాచెమ్మా సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తరువాత బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ వేల్యూ ఉన్న స్టార్ గా మారిపోయాడు. నానితో సినిమా అంటే 50 కోట్ల బడ్జెట్ అయిన నిర్మాతలు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు.
నానితో మూవీ చేస్తే మినిమమ్ గ్యారెంటీ అనే అభిప్రాయం నిర్మాతలలో ఉంది. నష్టాలు వచ్చే పరిస్థితి ఉండదు. అలాగే నాని కథల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆడియన్స్ ఎలాంటి అంశాలు ఇష్టపడతారో అవన్నీ తన సినిమాలలో ఉండేలా చూసుకుంటాడు. అందుకే బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటున్నాడు. గత ఏడాది దసరాతో వందకోట్ల క్లబ్ లో నాని చేరిపోయాడు. అలాగే హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఆగష్టు 29న సరిపోదా శనివారం సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లోనే మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇదిలా ఉంటే నాచురల్ స్టార్ నాని తనలోని రైటర్ ని ఇప్పుడు బయటకి తీసుకొచ్చాడంట. నాని హోమ్ బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాలో శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్ చేస్తున్నారు.
ఇప్పటికే హిట్ సిరీస్ లో రెండు సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు హిట్ 3లో అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ లో తానే లీడ్ రోల్ లో నటించబోతున్నాడు. ఈ మూవీ కథని స్వయంగా నాని రాశారంట. స్టోరీ లైన్ ని శైలేష్ కొలనుకి నాని నెరేట్ చేసి ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని సూచించారంట. ఇప్పటికే మేగ్జిమమ్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
నిజానికి నాని సరిపోదా శనివారం మూవీ తర్వాత సుజిత్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే ఈ మూవీ ఆలస్యం కానుంది. దీంతో హిట్ 3 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదంట. త్వరలో మూవీ గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.