ఆ సినిమాకి సైడ్ ఇవ్వడం కోసమే నాని, నితిన్..
ఈ సినిమాతో నితిన్ కచ్చితంగా హిట్ కొడతాడు అంటూ యూనిట్ సభ్యులతో పాటు, కొందరు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ చిత్రాన్ని ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాతో నితిన్ కచ్చితంగా హిట్ కొడతాడు అంటూ యూనిట్ సభ్యులతో పాటు, కొందరు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక నాని హాయ్ నాన్న సినిమా కూడా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఈ రెండు సినిమాలు కూడా మొదట క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్మాతలు భావించారు. అందుకు తగ్గట్లుగానే డేట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికే విడుదల అవ్వాల్సిన సలార్ సినిమా ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ నిర్ణయానికి వచ్చాడు. దాంతో సలార్ తో పోటీ వద్దనే ఉద్దేశ్యంతో ఈ ఇద్దరు హీరోలు ముందే వచ్చేస్తున్నారు.
తాజాగా ఈ విషయం గురించి నితిన్ తండ్రి, ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా నిర్మాత అయిన సుధాకర్ రెడ్డి స్పందించాడు. నాని హాయ్ నాన్న సినిమా మొదట డిసెంబర్ 22న ఉంది. మా సినిమాను డిసెంబర్ 23న అనుకున్నాం. కానీ ప్రభాస్ సలార్ సినిమాను ఆ తేదీల్లో విడుదల చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది.
భారీ బడ్జెట్ సినిమాతో పోటీ వద్దు అనే ఉద్దేశ్యంతో మా సినిమా ను ముందుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. పండుగ తర్వాత విడుదల చేయడానికి మంచి సమయం లేదు. అందుకే ముందుగానే విడుదల చేయడం బెటర్ అనే ఉద్దేశ్యంతో కొత్త విడుదల తేదీని ప్రకటించాం. మాలాగే నాని హాయ్ నాన్న సినిమా విడుదల తేదీని కూడా మార్చారని సుధాకర్ రెడ్డి అన్నారు.
రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో రాబోతున్నాయి. అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అని, రెండు సినిమాలకు సమన్యాయం అన్నట్లుగా థియేటర్లు లభించాయని కూడా సుధాకర్ రెడ్డి అన్నారు. కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం ఉండక పోవచ్చు అని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.