నేనేం సమర్ధించలేదు.. కావాలనే అలా చేశారు: నట్టి కుమార్

అదే సమయంలో నిర్మాత నట్టి కుమార్.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సమర్ధించినట్లు వార్తలు వచ్చాయి.

Update: 2024-10-03 13:21 GMT

టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంతో పాటు నటి సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె వ్యాఖ్యలపై అనేక మంది టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాజకీయాల్లోకి సినీ నటులను లాగడం కరెక్ట్ కాదని హితవు పలికారు. అదే సమయంలో నిర్మాత నట్టి కుమార్.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సమర్ధించినట్లు వార్తలు వచ్చాయి.

దీంతో ఇప్పుడు నట్టి కుమార్ స్పందించారు. సమంతతో పాటు నాగార్జున ఫ్యామిలీ గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించినట్లు కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. తాను ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివిధ రకాల అంశాలు మాట్లాడానని తెలిపారు. ఆ సమయంలో వారు కొండా సురేఖ వ్యాఖ్యల కోసం ప్రస్తావించినప్పుడు, తాను బదులిచ్చానని చెప్పారు.

మంత్రి చేసిన ఆరోపణల్లో వాస్తవాలు తనకు తెలియవని, ఆ విషయం గురించి తాను మాట్లాడనని స్పష్టంగా చెప్పానని నట్టి కుమార్ తెలిపారు. ఏమైనా ఆధారాలు ఉంటే వారు లీగల్ గా చూసుకోవాలని చెప్పానని అన్నారు. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించి మ్యాటర్ కు.. హెడ్డింగ్ కు సంబంధం లేకుండా కొందరు వార్తలు రాశారని మండిపడ్డారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించినట్లు క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ వార్తలు రాశారని తెలిపారు.

తనకు జర్నలిస్టులు అన్నా, మీడియా వ్యవస్థలు అన్నా ఎంతో గౌరవం ఉందని నట్టి కుమార్ చెప్పారు. పొద్దున్న లేచినప్పటి నుంచి మీడియా వారితో కలసి మెలసి ఉండటం, వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడం తనకు ఎన్నో ఏళ్లుగా అలవాటు అని చెప్పుకొచ్చారు. అయితే తాను ఎప్పుడు ఏ మాటలు అన్నా దానికి కట్టుబడి ఉంటానని మీడియా వారికి తెలుసుని అన్నారు. ఇప్పుడు తన మాటలను వక్రీకరించి, తప్పుగా హెడ్డింగ్ పెట్టడం తనకు బాధను కలిగించిందని తెలిపారు.

వెంటనే వారు తమ వెబ్ సైట్స్ లో ప్రచురించిన తప్పుడు వార్తలను తొలగించి, తాను ఖండించిన వార్తను వేయాలని నట్టి కుమార్ కోరారు. దీనిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా లీగల్ చర్యలకు కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తో పాటు పలు వెబ్ సైట్స్ లో మ్యాటర్ కు, హెడ్డింగ్ కు సంబంధం ఉండటం లేదని అన్నారు. ఎక్కువమంది చూడాలనే తపనతో వక్రీకరించడం కరెక్ట్ కాదని అన్నారు. అలా అని మీడియా వారందరినీ తాను అనడం లేదని చెప్పారు. అలా వ్యవహరిస్తున్న వారు మాత్రమే తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

Tags:    

Similar News