రాబిన్ హుడ్ తరువాత మరో హ్యాట్రిక్ మూవీ: నితిన్
నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.;
నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రచార కార్యక్రమాలు కూడా అందుకు తగ్గట్టే జరగడంతో, విడుదల ముందే హైప్ ఎక్కువైంది. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్‌కు సాలీడ్ రెస్పాన్స్ వచ్చాయి. ఇక ఆ అంచనాల స్థాయిని మరింత పెంచేలా ట్రైలర్ వచ్చేసింది. నితిన్ కొత్త లుక్, వెంకీ మాస్ ట్రీట్, శ్రీలీల ఎనర్జీ అన్నీ కలసి ఒక మంచి ప్యాకేజీగా కనిపిస్తున్నాయి.
ఇక సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో స్పెషల్ గెస్ట్‌గా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ హాజరయ్యారు. ఆయన ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో వెంకీ కుడుముల మాట్లాడుతూ, “భీష్మ తర్వాత ఐదేళ్ల క్రితమే ఈ కథ మొదలైంది. నితిన్ నాకు ప్రతి అడుగులో బలంగా నిలిచాడు. ఈ సినిమా కోసం మైత్రి మేకర్స్ భారీగా ఖర్చు పెట్టడం చూసి నిజంగా గౌరవంగా ఫీలయ్యాను” అని అన్నారు.
డేవిడ్ వార్నర్ విషయానికి వస్తే, వెంకీ మాట్లాడుతూ “ఒక ఇంటర్నేషనల్ గెస్ట్ తీసుకుందామనుకున్నప్పుడు సరదాగా వార్నర్ పేరు చెప్పాం, కానీ మైత్రి టీమ్ అది నిజం చేసింది” అని చెప్పాడు. అలాగే శ్రీలీల, మిగతా నటీనటుల కృషిని ప్రశంసించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రిలీజైన పాటలు చార్ట్‌బస్టర్‌గా మారిన నేపథ్యంలో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ప్రధాన బలంగా నిలవబోతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
ఈవెంట్‌కు హాజరైన డేవిడ్ వార్నర్ తన స్పీచ్‌ను తెలుగులో మొదలుపెట్టారు. “మీ అందరి ప్రేమ చూసి మొదటి నుంచి ఆశ్చర్యపోతున్నాను. ఇప్పటికీ నన్ను 'డేవిడ్ భాయ్' అని పిలవడం నాకు గొప్ప గౌరవంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నటించాలన్న ధైర్యం నన్ను దర్శకుడు వెంకీ, నిర్మాతలు ఇచ్చారు” అన్నారు. నితిన్‌తో కలిసి పని చేయడం ఒక గొప్ప అనుభవంగా అభివర్ణించారు.
నితిన్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో ఆదిధా సర్ ప్రైజ్ పాట కోసం కెతికా శర్మ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం సినిమాకు అదనపు బజ్ తెచ్చింది” అన్నారు. మైత్రి మేకర్స్‌కు తమ నమ్మకాన్ని పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. “శ్రీలీల, నేను కలిసి హిట్ పెయిర్‌గా మారబోతున్నాం. వెంకీ కుడుముల ఇప్పుడు నా తమ్ముడు లా మారిపోయాడు. త్వరలో మేమిద్దరం హ్యాట్రిక్ సినిమా చేయాలనుకుంటున్నాం. డేవిడ్ వార్నర్ చేసిన పాత్ర చిన్నదైనా చాలా ఇంపాక్ట్ ఫుల్. మార్చి 28న థియేటర్లలో ఇది బ్లాస్టింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతుంది” అంటూ సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.