ఎన్టీఆర్ ఫాన్స్ అది ఇంకా మర్చిపోలేదు!
'దేవర' పార్ట్-1 చిత్రాన్ని విజయదశమికి విడుదల చేస్తున్నందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''దేవర''. రెండు భాగాలుగా రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ప్లాన్ చేసిన విధంగా జరగకపోవడంతో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. దసరా కానుకగా 2024 అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
'దేవర' పార్ట్-1 చిత్రాన్ని విజయదశమికి విడుదల చేస్తున్నందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 4 రోజుల లాంగ్ వీకెండ్ ఉండటం, పైగా ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ వీరవిహారం చూడబోతున్నామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. RRR తర్వాత తమ ఫేవరెట్ హీరో నుంచి వస్తోన్న సినిమా కాబట్టి, కచ్ఛితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఆ తేదీ తారక్ కు కలిసిరాలేదనే విషయం తెలిస్తే మాత్రం ఆందోళన చెందడం గ్యారంటీ. ఎందుకంటే అదే రోజున గతంలో తారక్ మూవీ ఒకటి డిజాస్టర్ అయ్యింది.
ఎన్టీఆర్ కెరీర్ లో భారీ పరాజయాల్లో 'రామయ్యా వస్తావయ్యా' సినిమా ఉంటుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏ విధంగానూ అభిమానులని ఆకట్టుకోలేదు. అది వాళ్ళకి ఒక నైట్ మేర్ గా మిగిలిపోయింది. ఆ సినిమా 2013 అక్టోబర్ 10న రిలీజైంది. సరిగ్గా 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే తేదీకి 'దేవర' చిత్రం విడుదల కాబోతోంది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కాస్త కలవర పడుతున్నారు. ఏ సినిమాకైనా కంటెంట్ ముఖ్యం కానీ, డేట్ కాదని ఎంత సర్దిచెప్పుకున్నా.. ఆ రోజున అభిమానులకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటే మాత్రం ఖంగారు పడకతప్పదు.
కాకపోతే గతంలో దసరా పండుగ సందర్భంగా రిలీజైన ఎన్టీఆర్ చిత్రాల్లో రెండు మంచి హిట్లు ఉన్నాయనే విషయం ఫ్యాన్స్ ను ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తారక్ నటించిన 'బృందావనం' మూవీ 2010 అక్టోబర్ 14న విడుదలైంది. తదుపరి ఏడాదిలో అక్టోబర్ 6న రిలీజైన 'ఊసరవెల్లి' చిత్రం కాస్త నిరాశ పరిచినా.. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేసిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా అక్టోబర్ 11న వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు 'దేవర 1' కూడా హిట్ లిస్టులో చేరాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే 'దేవర' డేట్ మళ్లీ మారే అవకాశాలు లేకపోలేదనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ముందుగా అనుకున్నట్లు అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా ఆగస్టు 15కి రాకపోతే, అదే డేట్ కు ఎన్టీఆర్ చిత్రాన్ని దించాలని మేకర్స్ భావిస్తున్నారట. సో ఇప్పుడు అక్టోబర్ 10 అని అఫిషియల్ గా ప్రకటించినా.. 'పుష్ప 2' డేట్ మారితే, 'దేవర 1' డేట్ కూడా మారే ఛాన్స్ వుందనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
'దేవర' సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.