మరో బాలీవుడ్ సినిమాలో తారక్.. అందుకేనా పార్టీ?
వార్-2 మూవీతో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
వార్-2 మూవీతో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు తారక్. వార్-2 షూటింగ్ కోసం ఇటీవల ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. బీ టౌన్ స్టార్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. ఆదివారం రాత్రి అక్కడి స్టార్లతో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్లారు. ఇక నైట్ నుంచి ఆ ఫొటోలు, వీడియోలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.
అయితే వార్-2 మూవీని బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్ 'రా ఏజెంట్' గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా విడుదలవ్వనున్నట్లు సమాచారం. ఇక నిన్న డిన్నర్ పార్టీకి హృతిక్ రోషన్, అయాన్ ముఖర్జీ, బ్రహ్మస్త్ర మూవీ హీరోహీరోయిన్లు రణబీర్, ఆలియా, నిర్మాత కరణ్ జోహార్ కూడా వచ్చారు.
మొత్తానికి అటు బ్రహ్మస్త్ర, ఇటు వార్ 2 మూవీ టీమ్స్ కలయికగా ముంబైలో నిన్న రాత్రి డిన్నర్ పార్టీ సాగింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త టాక్ మొదలైంది. అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన బ్రహ్మస్త్రకు సీక్వెల్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా 2025లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు బ్రహ్మస్త్ర-2లో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ నార్త్ లో కూడా భారీ హిట్ అయింది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అక్కడ ఓ రేంజ్ లో పెరిగింది. దీంతో వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ కు ఆపోజిట్ క్యారెక్టర్ కోసం తారక్ ను మేకర్స్ ఎంపిక చేసుకున్నారు.
ఇక ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఫొటోగ్రాఫర్లు కూడా తెగ వెంట పడుతున్నారు. మరి బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు పెరుగుతున్న స్టార్ డమ్ ను చూసి అక్కడి మేకర్స్.. మరిన్ని సినిమాలకు ఆయన్ను తీసుకోవడం పక్కా అని చెప్పవచ్చు. మరి బ్రహ్మస్త్ర-2 వార్తలపై ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.