ల్యాండ్ ఇష్యూలో తారక్.. ఎన్టీఆర్ టీం ఏం చెప్పింది?
అలాంటి తారక్ పేరు ఇప్పుడో భూవివాదంతో లింక్ చేస్తూ ప్రచారం జరుగుతోంది.
నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. మిగిలిన అగ్రహీరోలకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఎప్పుడో కానీ బయటకు రారు. పార్టీలకు దూరంగా ఉంటారు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా వ్యవహరించే ఆయన.. వివాదాలకు దూరంగా ఉంటారు. తాను.. తన సినిమాలు.. తన షూటింగ్ లే తప్పించి.. అనవసర అంశాల మీద ఫోకస్ చేయటం కనిపించదు. అప్పుడెప్పుడో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం.. ఆ రంగం తనకు సూట్ కాదన్న విషయాన్ని గుర్తించి.. వెంటనే వెనక్కు వచ్చేయటం.. మౌనంగా ఉండటం తెలిసిందే.
అలాంటి తారక్ పేరు ఇప్పుడో భూవివాదంతో లింక్ చేస్తూ ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ లోని ఒక ప్లాట్ విషయంలో ఆయన పేరు వినిపిస్తోంది. సదరు ప్లాట్ విషయమై హైకోర్టును ఆశ్రయించారంటూ ఆయన పేరు మీద కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఇందుకు భిన్నంగా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ చర్చ జరుగుతోంది.
దీనిపై తాజాగా ఎన్టీఆర్ టీం స్పందించింది. తారక్ పేరు మీద జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. భూవివాదంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని.. దానిపై హైకోర్టును ఆశ్రయించినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ తారక్ పేరు మీద నడుస్తున్న వివాదం గురించి ఏం చెబుతున్నారన్నది చూస్తే..
జూబ్లీహిల్స్ లోని ఒక ప్లాట్ ను ఒక మహిళ నుంచి తారక్ కొనుగోలు చేశారని.. అయితే.. ఆ ప్రాపర్టీ మీద బ్యాంక్ నుంచి లోక్ తీసుకున్నారని చెబుతున్నారు. బ్యాంకు వద్ద లోన్ తీసుకొన్న విషయాన్ని దాచి పెట్టి.. తారక్ కు అమ్మారని.. ఆ తర్వాత ఆ విషయం బయటకురావటంతో వివాదం నెలకొందని చెబుతున్నారు. లోన్ రికవరీ అంశంపై సదరు బ్యాంకులు డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయిస్తే.. ఆ ప్లాట్ మీద బ్యాంకులకే హక్కులు ఉంటాయని చెప్పిందని.. ఈ అంశంపై తారక్ హైకోర్టును ఆశ్రయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తారక్ టీం స్పందిస్తూ.. సదరు ప్లాట్ ను 2013లోనే అమ్మేశారని.. ఇప్పుడు ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేస్తున్నారు.