సర్వే రిపోర్ట్: మోస్ట్ అవైటెడ్ టాప్ 5 తెలుగు సినిమాలు
OrmaxCinematix Most-awaited Telugu films
2023-24 సీజన్ లో మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమాలేవీ? ఈ ప్రశ్నకు సమాధానం తాజాగా లభించింది. ప్రఖ్యాత ఓర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం.. ఈసారి మోస్ట్ అవైటెడ్ జాబితాలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్` మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పుష్ప 2 (ది రూల్) ద్వితీయ స్థానంలో ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న `ఓజీ` మూడో స్థానంలో నిలవగా .. మహేష్ నటిస్తున్న `గుంటూరు కారం` నాలుగో స్థానంలో ఎన్టీఆర్ నటిస్తున్న `దేవర` ఐదో స్థానంలో నిలిచాయి.
గూగుల్ సెర్చ్ సహా అభిమానుల్లో క్రేజ్.. పరిశ్రమలో టాక్ ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓర్మాక్స్ మీడియా ఈ రిపోర్ట్ ని అందించింది. ఆసక్తికరంగా ఈ సర్వేలో ప్రభాస్ సలార్ నంబర్ 1 స్థానంలో నిలవగా... ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ ఫ్లాపైనా ప్రభాస్ క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని బజ్ చెబుతోంది. సలార్ టీజర్ ఇప్పటికే రికార్డ్ వ్యూస్ తో సంచలనాలు సృష్టించింది. కేజీఎఫ్ దర్శకుడి నుంచి వస్తున్న సినిమాగా దీనికి బోలెడంత హైప్ నెలకొంది. పుష్ప ఘనవిజయం తర్వాత పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు.. పుష్ప 2 క్రేజ్ హిందీ భాషలో అసాధారణంగా ఉంది. దానికి తగ్గట్టే సర్వేలో ఈ సినిమా హిందీ వెర్షన్ బాలీవుడ్ సినిమాలను తలదన్ని నంబర్ వన్ గా నిలవడం ఆసక్తికరం. ఇక ఈ జాబితాలో పవన్ కల్యాణ్ - సుజీత్ కాంబినేషన్ మూవీ `ఓజీ`కి అనూహ్యంగా మూడో స్థానం దక్కడం ఆశ్చర్యపరిచింది. ఓజీ టైటిల్ క్యూరియాసిటీని పెంచింది. అలాగే ఫస్ట్ గ్లింప్స్ తో బోలెడంత ఆసక్తి నెలకొంది. మహేష్ - ఎన్టీఆర్ సినిమాల కంటే పవన్ కల్యాణ్ మూవీకి ఈ హైప్ రావడం ఆసక్తిని కలిగిస్తోంది.
హిందీ పరిశ్రమ వరకూ చూస్తే... `పుష్ప: ది రూల్` నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టైగర్ 3-జవాన్- డంకీ వంటి సినిమాలు జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాను రూపొందించడంలో Ormax మీడియాకి సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ ఏడాది ప్రథమార్థంలో షారూఖ్ పఠాన్ అత్యంత క్రేజీ సినిమాగా రికార్డుల్లో నిలిచింది. ఆ తర్వాత పుష్ప -2 కి అసాధారణ క్రేజ్ నెలకొంది. హిందీ అగ్ర హీరోల సినిమాల కంటే తెలుగు నుంచి రాబోతున్న ఒక సినిమా కోసం ఇంతగా ఉత్తరాది ప్రజలు తహతహలాడడం ఎన్నడూ చూడని విచిత్ర పరిణామం.