కోలాలు పాన్ మసాలాలు వదిలిపెట్టరా?
గుట్కాలు, పాన్ మసాలాలతో నోటి క్యాన్సర్ ప్రమాద తీవ్రత గురించి థియేటర్లలో ప్రతిరోజూ ముఖేష్ ప్రకటన చూస్తూనే ఉన్నాం
గుట్కాలు, పాన్ మసాలాలతో నోటి క్యాన్సర్ ప్రమాద తీవ్రత గురించి థియేటర్లలో ప్రతిరోజూ ముఖేష్ ప్రకటన చూస్తూనే ఉన్నాం. అవి నిషిద్ధమైనవి, ప్రమాదకరమైనవి అని తెలిసీ సామాన్య ప్రజలు వాటికి అడిక్ట్ అవుతున్నారు. మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా దొరికే నాటు రకం మసాలా ప్యాకెట్లు ప్రజల జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా జీవితాలను నాశనం చేస్తున్నాయి. అయితే అలాంటి ఒక మసాలా ప్రకటనలో నటించిన ఖిలాడీ అక్షయ్ కుమార్ కి బాధ్యత లేదంటూ నెటిజనులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రజల్ని గొప్పగా ప్రభావితం చేసే సెలబ్రిటీగా బాధ్యత గురించి ప్రశ్నిస్తూ నెటిజనులు చెలరేగుతున్నారు. దీంతో అతడు (అక్షయ్) దిగొచ్చి పాన్ మసాలాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఇకపై సంతకం చేయనని వాగ్దానం చేశాడు. అంతేకాదు పాన్ మసాలా ప్రకటనలో నటించినందుకు అక్షయ్ కుమార్ క్షమాపణలు చెప్పాడు. తాను ఇకపై పాన్ మసాలాకు బ్రాండింగ్ చేయనని ప్రతిజ్ఞ చేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అక్షయ్, అజయ్ దేవగన్, షారుఖ్‌లతో కూడిన వాణిజ్య ప్రకటన కనిపించింది. ఇది క్షణాల్లో వైరల్ కావడంతో అందులో నటించిన స్టార్లను ట్రోలింగ్ సెగ తాకింది. డబ్బు కోసమేనా ఇదంతా చేస్తారు? అంటూ ప్రజలు స్టార్లను నిలదీసారు. డబ్బు కోసం తన మాట మరచిపోయారా? అని అక్షయ్ ని ప్రజలు ప్రశ్నించారు. అయితే సోషల్ మీడియాల్లో ఇది పెద్ద డిబేట్ గా మారడంతో వెంటనే అక్షయ్ కుమార్ పరిస్థితిని అందరికీ వివరిస్తూ అసలు విషయం చెప్పాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ పాన్ మసాలా ప్రకటన 2021 అక్టోబర్‌లో చిత్రీకరించినది అని దాని విషయంలో తాను ఏమీ చేయలేనని ఈ నెలాఖరు వరకు దానిని ప్రసారం చేసే హక్కు ప్రకటన కర్తలకు ఉందని వెల్లడించారు. అంతేకాదు ప్రజలకు హాని కలిగించే పాన్‌మసాలా ఎండార్స్‌ని వదిలేస్తానని కూడా అక్షయ్ వ్యాఖ్యానించారు. గతంలో షూట్ చేసిన ప్రకటన విషయంలో తాను ఏమీ చేయలేనని అక్షయ్ కుమార్ నొక్కి చెప్పారు. ఏది ఏమైనా కానీ అక్షయ్ ట్రోలర్లను శాంతపరిచే ఒక మంచి మాట చెప్పాడు.
ఇకపై స్టార్లు పాన్ మాసాలాలు గుట్కాలు, కోలాలు, బెట్టింగ్, ఆన్ లైన్ జూదం వంటి ప్రకటనల్లో నటించకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన 'మిషన్ రాణిగంజ్' తన కెరీర్ లో పెద్ద ఫ్లాప్ గా మారిందని ట్రేడ్ చెబుతోంది. ఈ సినిమా ట్రైలర్ దశలో ఆకట్టుకున్నా కానీ జనాల్ని థియేటర్లకు రప్పించడంలో విఫలమైంది. దీనికంటే అక్షయ్ నటించిన ఓమైగాడ్ సీక్వెల్ పెద్ద విజయం సాధించింది.